మాజీ ప్రధాని పాత్రలో ఆత్మని పట్టుకున్నా!
ఓ మాజీ ప్రధాని పాత్ర చేయాలంటే ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఆయన స్థానాన్ని తెరపై రీప్లే చేయడం అన్నది సులభం కాదు.
By: Tupaki Desk | 13 Jan 2024 1:30 AM GMTమాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జీవిత చరిత్ర ఆధారంగా 'మై అటల్ హూ' అనే టైటిల్ తో రవి జాదవ్ ఓ చిత్రాన్ని తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో వాజ్ పాయి పాత్రని పంకజ్ త్రిపాఠీ పోషిస్తున్నారు. ఇప్పటికే వాజయ్ పాయ్ లుక్ లో పంకజ్ అచ్చు గుద్దినట్లే ఉండటం..ఇతర ప్రచార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని పనులు పూర్తిచేసుకుని జనవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈసినిమా అనుభవాల్ని నటుడు పంకజ్ త్రిపాఠి పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే.. 'అటల్ బిహారీ వాజ్ పాయల్ లాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించే అవకాశం నాకు రావడం అదృష్టం. ఈ పాత్రకు నేను ఎంత న్యాయం చేసానో తెలియదు కానీ... ఎలా చేసాను? అన్నది ప్రేక్షకులు సినిమా చూసి డిసైడ్ చేయాలి. నాకు నేనుగా బాగా చేసాను అని చెబితే అతిగా ఉంటుంది.
ఆయన జీవితానికి సంబంధించి చాలా సంఘటనలపై చాలా రీసెర్చ్ చేసి చేసాం. ఓ మాజీ ప్రధాని పాత్ర చేయాలంటే ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఆయన స్థానాన్ని తెరపై రీప్లే చేయడం అన్నది సులభం కాదు. ఆయనలా నటించడం కన్నా ఆయన పాత్రలో ఆత్మ నిపట్టుకుని నటించా. జీవిత కథలంటే ఆహార్యం ఒక్కటే ఉంటే సరిపోదు పాత్రని ఎంతో బలంగా తెరపై చూపించాలి.
ఎంతో విశ్వనీయతతో కూడిన పాత్ర అది. ఆయన కథని ఎంతో కచ్చితంగా చెప్పే సమయంలో..నటించే సమయంలో కొన్ని సవాళ్లు తప్పలేదు. ఒక వ్యక్తి జీవితాన్ని తెరపై పరిపూర్ణంగా చెప్పాలంటే ఆయన గురించి అన్ని అంశాలు చర్చించాలి. మా సినిమాలో అవన్నీ కూలంకుశంగా చర్చించాం. అటల్ జీ జీవితాన్ని మాత్రమే కాకుండా రాజకీయాల్లో ఎలా ఉండేవారు? ఎన్నికలు.. ఓటింగ్ ప్రక్రియలు మరియు సామాజిక పరిణామం వంటి అంశాలను చూపించాం.
స్వాతంత్ర యుగం నుండి భారతదేశం యొక్క పరివర్తనాత్మక ప్రయాణాన్ని కూడా చూపించాం. మొదటి రోజు సెట్ కి వెళ్లిన తర్వాత భయం వేసింది. 'నేను ఏమి చేస్తాను? ఎలా చేయాలి? అని కాస్త కంగారు పడ్డాను. ఆ తర్వాత రెండు..మూడు రోజులకు అన్ని అలవాటు అయ్యాయి. పాత్రలోని సారాంశాన్ని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్ని రకాల ఎమోషనల్ సన్నివేశాలు... హవభావాలు పలికించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. అటల్ జీని అనుకురించడం కన్నా ప్రోస్తేటిక్ పై ఆధారపడటం కన్నా! నేచురల్ గా చేస్తే ఎలా ఉంటుందని అతని పాత్రని ఊహించుకుని నటించాను' అని అన్నారు.