ఎన్టీఆర్-నీల్ మూవీ సంక్రాంతికి వద్దు!
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కర్ణాటకలోని మంగళూరులో ప్రారంభం కాబోతుంది.
By: Tupaki Desk | 10 Jan 2025 8:30 AM GMTఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ 'డ్రాగన్' ఈనెలలోనే మొదటి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా పూర్తి కాకుండానే డ్రాగన్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కర్ణాటకలోని మంగళూరులో ప్రారంభం కాబోతుంది. దాదాపు రెండు వారాల పాటు అక్కడ షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. జనవరి 9 లేదా 10వ తేదీన సంక్రాంతి కానుకగా డ్రాగన్ సినిమాను విడుదల చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కావడం మనం చూస్తూ ఉంటాం. కనుక ఏ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యే పరిస్థితి ఉండదు. పండుగ సీజన్‌లో సినిమాలను విడుదల చేయడం అనేది టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వందల కోట్లు, వేల కోట్ల వసూళ్లు రాబట్టాలి అంటే పండుగ సీజన్‌లో కాకుండా సోలోగా వస్తేనే సాధ్యం.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే మరో రెండు మూడు సినిమాలతో థియేటర్‌లను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కలెక్షన్స్‌ను సైతం ఇతర సినిమాలతో షేర్ చేసుకోవాల్సి రావడంతో కచ్చితంగా ఓపెనింగ్ విషయంలో దెబ్బ పడుతుంది. లాంగ్ రన్‌లోనూ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకోలేకపోవచ్చు. సినిమాకి హిట్ టాక్ వచ్చినా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు కాకపోవచ్చు. ఒక వేళ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే మినిమం వసూళ్లు కూడా దక్కే అవకాశం ఉండదు. కనుక పండుగ సీజన్‌లో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను విడుదల చేయవద్దు అంటూ ఫ్యాన్స్‌తో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2026 సమ్మర్‌కి సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో దాదాపు అందరు హీరోల సినిమాలు ఒక తేదీకి అని ప్రకటించి కనీసం రెండు మూడు నెలల ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేసి బజ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ఆలస్యం అయితే అంత ఎక్కువగా బజ్ క్రియేట్ అవుతున్న రోజులు ఇవి. అందుకే సినిమా అత్యధికంగా వసూళ్లు తెచ్చి పెట్టాలి అంటే కచ్చితంగా సోలో రిలీజ్ కావాలి. అది కూడా ముందు వారం తర్వాత రెండు వారాల వరకు ఏ ఒక్క పెద్ద సినిమా విడుదల కాకుండా జాగ్రత్తగా డేట్‌ను ప్లాన్ చేశాలి. ప్రశాంత్ ఆ విషయంలో కింగ్ అని అంతా అంటారు. కనుక డ్రాగన్‌ను అంత ఈజీగా వదిలి పెట్టక పోవచ్చు. ఎన్టీఆర్‌కి మొదటి వెయ్యి కోట్ల మూవీగా డ్రాగన్ నిలువబోతుంది.