టాలీవుడ్ లో మాలీవుడ్ మోజు!
ఇప్పుడిదే బాటలో మాలీవుడ్ హీరోలు సైతం టాలీవుడ్ లో క్రేజీ నటులుగా మారుతున్నారు.
By: Tupaki Desk | 11 Feb 2025 8:30 AM GMTసాధారణంగా టాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేది మాలీవుడ్ అందాల బ్యూటీలు మాత్రమే. అక్కడ నుంచి దిగుమతి అయ్యే నేచురల్ అందాలకు టాలీవుడ్ ఫిదా అవుతుంది. కొంత కాలంగా టాలీవుడ్ లో మాలీవుడ్ భామలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇతర భాషల కంటే కేరళ నుంచి దిగుమతి అయ్యే భామలంటే తెలుగు ఆడియన్స్ ప్రత్యేకంగా ఆరాదిస్తున్నారు. ఇప్పుడిదే బాటలో మాలీవుడ్ హీరోలు సైతం టాలీవుడ్ లో క్రేజీ నటులుగా మారుతున్నారు.
ఇప్పటికే దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ లో సినిమాలు తగ్గించి టాలీవుడ్ లో జోరందుకుంటున్నాడు. 'సీతారామం' విజయం తర్వాత అతడి మార్కెట్ రేంజ్ తెలుగులో అంతకంతకు పెరిగింది. దీంతో ఇక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు ఎంచుకుంటున్నాడు. మరో మాలీవుడ్ నటుడు పహాద్ పాజిల్ కూడా అలాగే ఫేమస్ అవుతున్నాడు. 'పుష్ప'తో టాలీవుడ్ కి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన పహాద్ అలియాస్ భన్వర్సింగ్ షెకావత్ విలన్ గా కంటే డబ్బింగ్ చిత్రాలతో హైలైట్ అవ్వడం మొదలు పెట్టాడు.
అతడు హీరోగా నటించిన మాలీవుడ్ చిత్రాల్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు. అలాగే పృధ్వీరాజ్ సుకుమారన్ 'సలార్' తో లాంచ్ అయ్యాడు. అందులో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో ఇక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. అంతకు ముందే మంచి దర్శకుడిగానూ అతడికి పేరుంది. ఆ క్రేజ్ కూడా కలిసొస్తుంది. అతడి సినిమాలు ఇక్కడా రీమేక్ అవ్వడం అతడి ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం 'సలార్' సీక్వెల్ తో పాటు మహేష్ పాన్ ఇండియా చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
పృధ్వీరాజ్ డైరెక్ట్ చేసిన `ఎల్2 ఎంపురాన్` కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. `మార్కో` సినిమాతో ఉన్ని ముకుందన్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు. అప్పటికే ఉన్ని ముకుందన్ కొన్నితెలుగు సినిమాల్లో నటించాడు.కానీ మార్కో కంటెంట్ అతడిని ఎక్కువగా వైరల్ చేసింది. దీంతో ఉన్ని ముకుందన్ ని మంచి విలన్ గా తయారు చేయోచ్చని ఇక్కడ మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్, జయరామ్ లాంటి సీనియర్లు చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నారు.
`శాకుంతలం`లో నటించిన దేవ్ మోహన్ తాజాగా `సతీలీలావతి`లో లావణ్య త్రిపాఠితో జోడీగా నటిస్తున్నాడు. మరో మాలీవుడ్ ట్యాలెంట్ టివినో థామస్ కూడా బాగానే వైరల్ అవుతున్నాడు. తారక్ ప్రశాంత్ నీల్ సినిమాలో టివినో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే టివినో నటించిన కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.