Begin typing your search above and press return to search.

ఏఐ ట్రెండ్.. సూపర్ స్టార్ సినిమాలోనూ

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) చేస్తున్న ఎన్నో అద్భుతాలను ఇప్పుడు చూస్తున్నాం. ఈ టెక్నాలజీని సినీ పరిశ్రమ కూడా బాగానే ఉపయోగించుకుంటోంది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 11:15 AM GMT
ఏఐ ట్రెండ్.. సూపర్ స్టార్ సినిమాలోనూ
X

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) చేస్తున్న ఎన్నో అద్భుతాలను ఇప్పుడు చూస్తున్నాం. ఈ టెక్నాలజీని సినీ పరిశ్రమ కూడా బాగానే ఉపయోగించుకుంటోంది. చనిపోయిన దిగ్గజాలకు తెర మీద జీవం తీసుకొచ్చి నటింపజేయడం.. అలాగే పాటలు పాడించడం చేసేస్తున్నారు. దృశ్యాల్లో సహజత్వం తీసుకురావడం కష్టమవుతోంది కానీ.. పాటలు పాడించడం ద్వారా మాత్రం ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేస్తున్నారు. దీని మీద విమర్శలూ, వివాదాలూ తప్పట్లేదన్నది వేరే విషయం. ‘కీడా కోలా’లో ఎస్పీ బాలు వాయిస్‌ను రీక్రియేట్ చేస్తే.. ఇటీవలే రిలీజైన ‘గోట్’లో భవతారిణి గొంతుతో పాట పాడించేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోనూ ఈ ప్రయోగం చేస్తున్నారు. లెజెండరీ సింగర్ మలేషియన్ వాసు గాత్రాన్ని రీక్రియేట్ చేశారు ఈ చిత్రం కోసం.

సూపర్ స్టార్ హీరోగా ‘వేట్టయాన్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబరు 10న రిలీజ్ కానున్న ఈ చిత్రం నుంచి తొలి పాట ‘మనసిలాయో’ తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఉత్సాహభరితంగా సాగిన ఈ పాట కోసం దివంగత మలేషియన్ వాసు గాత్రాన్ని ఉపయోగించారు. చివరగా 27 ఏళ్ల కిందట రజినీ కోసం ఆయన పాట పాడారు. ఆయన చనిపోయిన తర్వాత ఇన్నేళ్లకు తన వాయిస్‌ను ఏఐ ద్వారా రీక్రియేట్ చేసి రజినీ సినిమాలో పెట్టేస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. ప్రోమో చూస్తే పాట మంచి ఉత్సాహభరితంగా సాగేలా కనిపిస్తోంది. తెలుగు సినిమాలకు పాటలు ఇచ్చినపుడు మాత్రం కొంచెం మొక్కుబడిగా ట్యూన్లు ఇస్తాడనే పేరు తెచ్చుకున్న అనిరుధ్.. తమిళంలో మాత్రం ఎప్పటికప్పుడు వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. ‘మనసిలాయో’ కూడా ఆ కోవకు చెందిన పాటలాగే కనిపిస్తోంది. ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్ రూపొందిస్తున్న ‘వేట్టయాన్’లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా ముఖ్య పాత్రలు పోషించడం విశేషం.