అతడితో నాకు పెద్ద ముప్పు..సాటి హీరోపై అగ్రహీరో ఆందోళన!
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలానో దక్షిణాది చిత్రసీమలో మమ్ముట్టి, మోహన్‌లాల్ అంతే గొప్ప స్టార్లు.
By: Tupaki Desk | 15 Nov 2024 7:42 AM GMTమెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలానో దక్షిణాది చిత్రసీమలో మమ్ముట్టి, మోహన్‌లాల్ అంతే గొప్ప స్టార్లు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మలయాళ చిత్ర పరిశ్రమను శాసించిన అగ్ర కథానాయకులు ఆ ఇద్దరూ. పూర్తిగా బయటి వ్యక్తులు అయినా పరిశ్రమలోకి ప్రవేశించి తమదైన ముద్ర వేయడానికి కష్టపడి పనిచేయడంపై మాత్రమే ఆధారపడిన నటులు. రజనీ, చిరంజీవి, లాల్, మమ్ముట్టి శ్రమను నమ్ముకుని స్టార్లు అయ్యారు.
పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్సెస్ తో కెరీర్ ఆరంగేట్రమే శాశ్వత ముద్ర వేసిన స్టార్లుగా మమ్ముట్టి, మోహన్ లాల్ పాపులరయ్యారు. ఆ ఇద్దరూ జాతీయ ఉత్తమ నటులుగా పురస్కారాలు అందుకున్నవారే. కెరీర్ లో అవార్డులు రివార్డులకు కొదవేమీ లేదు..మమ్ముట్టి తన కెరీర్‌ను సహాయక పాత్రలతో ప్రారంభించగా, మోహన్‌లాల్ తన తొలినాళ్లలో అడపాదడపా ప్రతినాయకుడి పాత్రలు పోషించాడు. కానీ కాలక్రమంలో ఆ ఇద్దరూ హీరోలుగా ప్రయత్నించి ఎదగడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. మమ్ముట్టి అద్భుతమైన లుక్ లు అతడిని పెద్ద హీరోని చేసాయి. అయితే మోహన్‌లాల్ ఉన్నత స్థాయికి వెళ్లడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయంలో అతడు తనకు అంది వచ్చిన ప్రతి పాత్రను అంగీకరించాడు.
అయితే మోహన్‌లాల్ పెద్ద స్టార్ అవుతాడని ఊహించిన స్టార్ ఆరోజుల్లో మమ్ముట్టి. ఆ ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. పోటీతత్వం ఉంది. ప్రముఖ ఫిలింమేకర్ శ్రీనివాసన్ ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మమ్ముట్టి గురించి వివరిస్తూ లాల్ పై అతడి అంచనా గురించి వెల్లడించారు. మమ్ముట్టి హీరో పాత్రల్లో మెరుస్తున్నప్పుడు.. ఓ రోజు చెన్నైలోని ఓ హోటల్‌లో ``అతడి(లాల్) విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి` అన్నారట. మోహన్‌లాల్ త్వరలో హీరో అవుతాడు.. కానీ అతడు నాకు ముప్పుగా మారే అవకాశం ఉంది! అని మమ్ముట్టి అన్నారట. లాల్ విలన్ గా ఉన్నప్పుడే అతడిని అంచనా వేసారు మమ్ముట్టి. చివరకు అదే నిజమైంది.
దర్శకుడు ప్రియదర్శన్ గురించి మమ్ముట్టి అప్పట్లోనే ఒక అంచనా వెలువరించారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్ ఇద్దరి గురించి మమ్ముట్టి అంచనాలు నిజమయ్యాయని ఆ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ అన్నారు. ప్రియదర్శన్ నేడు భారతదేశంలోని ప్రముఖ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. హిందీలోను ఆయన బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.