స్వలింగ సంపర్కుడిగా మెగాస్టార్.. దిగ్గజాల ప్రశంసలు..
ఈ చిత్రంలో మమ్ముట్టి అంతటి పెద్ద స్టార్ స్వలింగ సంపర్కుడిగా నటించడం చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 27 Sep 2024 8:30 AM GMTనాలుగు దశాబ్ధాల కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, దివంగత నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిగాను నటించిన సంగతి తెలిసిందే. విలక్షణ నాయకుడి పాత్రలో అతడి నటన తెలుగు ప్రజలకు గొప్పగా నచ్చింది.
సుదీర్ఘ కెరీర్ లో వెటరన్ నటుడు ప్రయోగాలకు ఏనాడూ వెనకాడలేదు. 2023లో ఆయన నటించిన 'కాదల్ ది కోర్' దిగ్గజ దర్శకనిర్మాతల్లో చర్చనీయాంశమైంది. కరణ్ జోహార్- పా రంజిత్- జోయా అక్తర్ - వేట్రి మారన్ వంటి ప్రముఖుల సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో మమ్ముట్టి అంతటి పెద్ద స్టార్ స్వలింగ సంపర్కుడిగా నటించడం చర్చనీయాంశమైంది. భారతదేశంలో LGBTQ+ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలు, పోరాటాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో సీనియర్ నటుడు మమ్ముట్టి మాథ్యూ అనే హిజ్రా పాత్రలో నటించారు. నాయకుడు కావాలనుకున్న ఒక స్వలింగసంపర్కుడి కథ ఇది. ఒక నపుంసకుడికి భార్య విడాకులు ఇస్తే, ఆ తర్వాత పరిణామం ఏమిటన్నది? తెరపై ప్రభావవంతంగా చూపించారు. హిజ్రా పాత్రలో అయినా అతడి ధైర్యం, పోరాటం ఆకట్టుకుంటాయి. హిజ్రాల విషయంలో ప్రజల క్రూరత్వం ఎలాంటిదో మనం నిత్యజీవితంలో చూస్తున్నదే. వారి జీవితాల్లోని వెతలను ఎమోషనల్ ఘట్టాలను తెరపై ఆవిష్కరించారు.
సినిమా కథాంశం ప్రకారం.. మాథ్యూ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రక్తి కట్టే మలుపు తిరుగుతుంది. ఎన్నికల బరిలో దిగేందుకు అతడు దాచి ఉంచిన గుర్తింపును మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. అతడిని సమాజం పరిశీలిస్తుంది. బహిరంగ పరిశీలనతో అతడు దొరికిపోతుంటాడు. అదే క్రమంలో లోలోన సంఘర్షణ మొదలవుతుంది. హిజ్రాల విషయంలో సమాజం ఎలా ఆలోచిస్తుందో ఈ సినిమా వర్ణిస్తుంది. మాథ్యూ నిజాన్ని దాచలేడు. కానీ కోర్టులను ఎదుర్కోవాలి. అక్కడ నిజాల్ని అంగీకరించాలి. అదే క్రమంలో అతడి అంతర్గత సంఘర్షణను చిత్రీకరిస్తూ కోర్టు గది దృశ్యాలు ఈ మూవీలో ప్రత్యేకంగా అలరించాయి.
ప్రముఖ దర్శకుల చర్చా గోష్ఠిలో కింది విషయాలు ఆసక్తిని కలిగించాయి. సామాజిక ఒత్తిళ్ల కారణంగా గోప్యంగా జీవించే LGBTQ+ కమ్యూనిటీలో చాలా మంది ఎదుర్కొనే సవాళ్లను, వాస్తవాలను తెరపైకి తేవడంలో ప్రభావం చూపారు. మమ్ముట్టి అటువంటి పాత్రను పోషించాలని తీసుకున్న నిర్ణయం భారతీయ సినిమా చరిత్రలో ధైర్యంతో కూడుకున్నది. ముఖ్యంగా అగ్ర కథానాయకులు ఇలాంటి పాత్రలో నటించేందుకు అంగీకరించడం అన్నది సాహసం. కానీ అలాంటి సాహసానికి మమ్ముట్టి సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి ఉన్నత స్థాయి నటులు అంతగా ప్రజలకు తెలియని ఇలాంటి కథల్ని తెరపైకి తేవడం ద్వారా చాలా ప్రభావితం చేయగలుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. హిజ్రా కమ్యూనిటీపై ఉన్న అపోహలను తొలగించి వారి జీవితాల్లో మేలైన ఘట్టానికి సహకరించేలా సినిమా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.
పెద్ద తారలు తమ కంఫర్ట్ జోన్‌ల నుండి బయటకి అడుగు పెట్టడానికి, వినూత్న పాత్రలను స్వీకరించడానికి ఇష్టపడకపోవడమే బాలీవుడ్ పరాజయాలకు కారణమని ఈ సమావేశంలో కరణ్ జోహార్ ఉద్ఘాటించారు. నటీనటులు తమకు ఇష్టమైన స్టోరీలను సినిమాలపై రుద్దకుండా ప్రయోగాత్మకంగా ఉండాలని, దర్శకుల ఆలోచనలను గౌరవించాలని ఆయన కోరారు. స్టార్ పవర్ కొన్నిసార్లు సృజనాత్మక అన్వేషణకు ఎలా ఆటంకం కలిగిస్తుందో ఆయన మాటల్లో ధ్వనించింది. అందుకే మమ్ముట్టి లాంటి వారు ఇలాంటి ప్రయోగాలకు ముందుకు రావడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. మాలీవుడ్ మెగాస్టార్ ని చూశాక ఇతర పరిశ్రమల అగ్ర హీరోలు కూడా ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నారు. బాలీవుడ్ లో అంతగా నట ప్రదర్శనలు వర్కవుట్ కాకపోవడానికి కారణాలను అన్వేషించే క్రమంలో దిగ్గజ దర్శకుల చర్చా గోష్ఠి ఆసక్తిని కలిగించింది. మమ్ముట్టి, రజనీకాంత్ వంటి పెద్ద స్టార్లు దక్షిణాదిన అద్భుత ప్రయోగాలు చేసారని వారంతా కొనియాడారు.