Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలు ముఖం మీదే త‌లుపులు మూశారు.. న‌టి ఆవేద‌న‌..

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌మ‌తా కుల‌క‌ర్ణి ఇదే విష‌యంపై ప్ర‌శ్న‌ను ఎదుర్కొంది. దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 11:30 AM GMT
స్టార్ హీరోలు ముఖం మీదే త‌లుపులు మూశారు.. న‌టి ఆవేద‌న‌..
X

ఇటీవ‌లి కాలంలో క్వీన్ కంగ‌న ర‌నౌత్ నోటి దురుసు గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. అయితే కంగ‌న కంటే ముందు బాలీవుడ్ లో చెలాకీ త‌నం, నోటి దురుసు ఉన్న క్వీన్ గా మ‌మ‌తా కుల‌క‌ర్ణికి గుర్తింపు ఉంది. 90ల‌లో మేటి క‌థానాయిక‌ల్లో ఒక‌రైన మ‌మ‌తా పెద్ద స్టార్ల‌తో అయినా గొడ‌వ‌ప‌డేందుకు వెన‌కాడేవారు కాద‌ని, బాగా స్థిర‌ప‌డిన కుటుంబం నుంచి వ‌చ్చిన మ‌మ‌తాకు దూకుడు ఎక్కువ‌ని గుస‌గుస వినిపించేది.

అప్ప‌ట్లోనే క‌ర‌ణ్ అర్జున్ షూటింగ్ స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల‌తోనే మ‌మ‌తా గొడ‌వ పెట్టుకుంద‌ని, వారిపై అరిచేసింద‌ని కూడా పుకార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌మ‌తా కుల‌క‌ర్ణి ఇదే విష‌యంపై ప్ర‌శ్న‌ను ఎదుర్కొంది. దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్‌ల `కరణ్ అర్జున్‌`లో మమతా కులకర్ణి క‌థానాయిక‌గా న‌టించింది. షూటింగ్ సమయంలో ఖాన్‌లు తనను చూసి చిరునవ్వు న‌వ్వుకున్నార‌ని, తన ముఖం మీద తలుపులు వేసేశార‌ని వెల్ల‌డించింది. `ఆప్ కి అదాలత్‌` కార్య‌క్ర‌మంలో రజత్ శర్మ ఈ విష‌యంపై మ‌మ‌తాను ప్ర‌శ్నించారు. షూటింగ్ సమయంలో షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్‌లపై అరిచేశార‌ట క‌దా? అని ప్ర‌శ్నించ‌గా.. అది నిజం కాద‌ని మ‌మ‌తా తెలిపింది. తాను వారిపై అర‌వ‌లేద‌ని మ‌మ‌తా అన్నారు. షారూఖ్ మీరు అరిచేసార‌న చెప్పారు క‌దా! అని మ‌ళ్లీ ప్ర‌శ్నించారు. అప్పుడు జ‌రిగిన వాస్త‌వ‌మేంటో మ‌మ‌తా వివ‌రించారు.

ఒక డ్యాన్స్ సీక్వెన్స్ కోసం చిన్ని ప్ర‌కాష్ మాస్టార్ జీ త‌న‌ను పిలిచి వివ‌రించార‌ని మ‌మ‌తా కుల‌క‌ర్ణి గుర్తు చేసుకుంది. మాస్టార్జీని క‌లిసేందుకు వెళ్లేప్పుడు మేడ పై నుంచి దిగి వ‌స్తూ త‌న‌ను చూసిన స‌ల్మాన్- షారూఖ్ చిరున‌వ్వు న‌వ్వుకున్నారు. మాస్టార్జీ ఈ ప్రత్యేకమైన స్టెప్, నువ్వే సోలోగా చేస్తావు అని చెప్పారు. మరుసటి రోజు డ్యాన్స్ సీక్వెన్స్ షూట్ లో తాను మాత్ర‌మే పాల్గొన్నాన‌ని మ‌మ‌తా తెలిపింది. నా మొదటి షాట్ కు ఆమోదం లభించింది. షారుఖ్ -సల్మాన్ ఇద్దరూ ఒక పొద వెనుక నుండి నన్ను చూస్తుండటం నేను గ‌మ‌నించాను. వారు మళ్ళీ నవ్వుతున్నారు... నా త‌ర్వాత వాళ్ల‌పైనే షాట్ చిత్రీక‌రించాల్సి ఉంది. వారు 5,000 మంది మధ్యలో మోకాళ్లపై న‌డ‌వాలి. వారు చాలా రీటేక్‌లు తీసుకున్నారు. దర్శకుడు చివరికి ప్యాక్ అప్ అని అరిచాడు. మేమంతా మా గదులకు పరిగెత్తాము. నిన్న సాయంత్రం వారు నాతో ఆడుకున్నారని నాకు తెలుసు. కొరియోగ్రాఫర్ నాకు అన్ని స్టెప్పులు కేటాయించమని చెప్పే అవకాశం నేను వారికి ఇవ్వకూడదనుకున్నాను. కాబట్టి వారు పరిగెత్తి వెళుతుంటే నేను వారిని అనుస‌రించాను. కానీ నేను ద‌గ్గ‌ర‌కు రాగానే సల్మాన్ నన్ను ఆపి, నా ముఖం మీద తలుపు మూసేశాడు. ఇదే జరిగింది అని మమతా కులకర్ణి వివరించారు.

అయితే ఖాన్ లు త‌న‌ను ఆట‌పట్టించ‌డానికే అలా చేసార‌ని మ‌మ‌తా వివ‌ర‌ణ ఇచ్చింది. కరణ్ అర్జున్ 1995లో విడుద‌లై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షారుఖ్, సల్మాన్, కాజోల్, రాఖీ, మమతా కులకర్ణితో పాటు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ ఏడాది మహా కుంభమేళా సందర్భంగా కిన్నార్ అఖాడా మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ బిరుదును క‌ట్ట‌బెట్ట‌డం వివాదాస్ప‌ద‌మైంది. అయితే నియామకం జరిగిన ఏడు రోజుల్లోనే, అనేక హిందూ మత సంస్థల నిరసనల నేపథ్యంలో మ‌మ‌తాను ఆ పదవి నుండి తొలగించారు. అయితే మ‌మ‌తా కుల‌క‌ర్ణి తాను ఆధ్యాత్మిక విధానంలో కొన‌సాగుతున్నాన‌ని తెలిపారు.