తంగళన్ గందరగోళంపై మేనేజర్ వివరణ
దీనికి సంబంధించి అన్ని సందేహాలను ఇప్పుడు విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ తన X పేజీలో ఫుల్ క్లారిటీనిచ్చేసారు.
By: Tupaki Desk | 3 Nov 2023 4:59 AM GMTచియాన్ విక్రమ్ దర్శకుడు పా రంజిత్ ల 'తంగళన్' చిత్రం టీజర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేసినప్పటి నుండి దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. టీజర్ లాంచ్‌లో విక్రమ్ తన పాత్రకు డైలాగ్స్ లేవని అన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాల్లో అది సునామీగా మారింది. ఈ సినిమాలో విక్రమ్ అస్సలు మాట్లాడడు అని విస్తృతంగా ప్రచారమైంది. శివపుత్రుడు తరహాలోనే చియాన్ ఈ చిత్రంలో కూడా మాట్లాడడు! అంటూ వార్త వైరల్ అయిపోయింది. దీంతో అభిమానుల్లో కొంత టెన్షన్ అలుముకుంది. కానీ ఇప్పుడు విక్రమ్ మేనేజర్ దీనికి సంబంధించి వివరణను ఎక్స్(గతంలో ట్విట్టర్)లో షేర్ చేసారు.
పా రంజిత్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 'తంగళన్' 26 జనవరి 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఇది 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తమిళ చిత్రాలలో ఒకటి. ఇటీవల చియాన్ విక్రమ్ 'తంగళన్' టీజర్ లాంచ్‌లో ప్రత్యేకంగా కనిపించాడు. టీజర్ అందరి మనసులు దోచేసుకుందని సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే టీజర్ లాంచ్‌లో విక్రమ్ మాట్లాడుతూ టీజర్‌లో డైలాగులు లేవని చెప్పాడు. అయితే సినిమా మొత్తంలో అతనికి డైలాగులు లేవని తప్పుగా అపార్థం చేసుకుని దానినే మీడియాలు ప్రచారం చేసేశాయి.
దీనికి సంబంధించి అన్ని సందేహాలను ఇప్పుడు విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ తన X పేజీలో ఫుల్ క్లారిటీనిచ్చేసారు. #తంగళన్‌లో చియాన్ సర్ కు డైలాగ్స్ లేవని సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించారు. ఇంకా స్పష్ఠంగా చెప్పాలంటే ఈవెంట్లో ఒక రిపోర్టర్ విక్రమ్ పాత్రకు డైలాగ్ ఉందా? అని అడిగాడు. విక్రమ్ సర్ తనకు టీజర్ లో డైలాగ్ లేదని చమత్కరించారు అంతే. కాబట్టి చియాన్ కచ్చితంగా సినిమాలో డైలాగ్స్ చెబుతారు`` అని తెలిపారు. #తంగళన్ లైవ్ సింక్ సౌండ్‌ని కలిగి ఉంటుందని కూడా తెలిపారు.
'తంగళన్' పీరియాడికల్ డ్రామా. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పశుపతి, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, డేనియల్ కాల్టాగిరోన్, హరికృష్ణన్ అన్బుదురై సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పా రంజిత్, తమిళ ప్రభ, అళగీయ పెరియవన్ సంయుక్తంగా స్క్రీన్ ప్లే రాశారు. 'తంగళన్' సాంకేతిక బృందంలో కంపోజర్ జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రాఫర్ ఎ కిషోర్ కుమార్, ఎడిటర్ సెల్వ ఆర్కె ఉన్నారు.