'మనమే' మూవీ రివ్యూ
మనమే.. శర్వానంద్ కొత్త చిత్రం. భలే మంచి రోజు.. దేవదాస్ లాంటి చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
By: Tupaki Desk | 7 Jun 2024 9:59 AM GMT'మనమే' మూవీ రివ్యూ
నటీనటులు: శర్వానంద్-కృతి శెట్టి-రాహుల్ రవీంద్రన్-సచిన్ ఖేద్కర్-త్రిగుణ్-శివ కందుకూరి-తులసి-సుదర్శన్-రాహుల్ రవీంద్రన్-వెన్నెల కిషోర్-ఆయేషా ఖాన్-సీరత్ కపూర్-ముకేష్ రుషి-సీత తదితరులు
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ-రాజశేఖర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
రచన-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
మనమే.. శర్వానంద్ కొత్త చిత్రం. భలే మంచి రోజు.. దేవదాస్ లాంటి చిత్రాలను రూపొందించిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ప్రోమోల్లో చాలా కలర్ ఫుల్ గా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా కూడా అంతే కలర్ ఫుల్ గా ఉందా.. అంచనాలను అందుకుందా.. చూద్దాం పదండి.
కథ: విక్రమ్ (శర్వానంద్) యూకేలో జీవితాన్ని జాలీగా గడిపే కుర్రాడు. అతడి ప్రాణ మిత్రుడైన అనురాగ్ (త్రిగుణ్) ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. తన భార్య కూడా చనిపోవడంతో వారి పిల్లాడు అనాథ అవుతాడు. చిత్రమైన పరిస్థితుల్లో ఆ పిల్లాడిని సుభద్ర (కృతిశెట్టి)తో కలిసి విక్రమ్ కొన్ని నెలల పాటు చూసుకోవాల్సి వస్తుంది. ఐతే బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్ కు ఈ పని చాలా కష్టమవుతుంది. అయినా సర్దుకుని పిల్లాడి సంరక్షణ చూసుకుంటాడు. ఈ క్రమంలోనే సుభద్ర మీద అతడికి ఇష్టం ఏర్పడుతుంది. ఆమెను పెళ్లి చేసుకుని పిల్లాడిని జీవితాంతం తనే చూసుకోవాలనుకుంటాడు. కానీ ఇంతలో సుభద్రతో ఎంగేజ్మెంట్ అయిన కార్తీక్ (శివ కందుకూరి) లైన్లోకి వస్తాడు. దీంతో విక్రమ్ జీవితం ఏ మలుపు తిరిగింది.. సుభద్ర చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంది.. పిల్లాడి జీవితం ఏమైంది.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ఒక కథను ఎంత బాగా మొదలుపెట్టారు.. ఎంత కొత్తగా ఆరంభించారు అన్నదాని కంటే.. ఆ కథను ఎంత బాగా ముందుకు నడిపించారు.. ఎలా ముగించారు.. మొదట్లో ఉన్న కొత్తదనపు ఫీలింగ్ ను చివరిదాకా ఎలా కొనసాగించారు అన్నది కీలకం. 'మనమే' చిత్రంలో ఆరంభం చాలా బాగుంటుంది. కథ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒక దశ వరకు చక్కటి వినోదంతో సాగే సినిమా ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు చిందేలా చేస్తుంది. వినోదాత్మక కథనానికి తోడు విజువల్ మాయాజాలం ఆహ్లాదాన్ని పంచుతుంది. ఐతే ప్రథమార్ధమంతా సరదాగా సాగిపోయి.. ఆ తర్వాత సీరియస్ గా కథలోకి వెళ్లగానే సాధారణంగా మారిపోయే చాలా సినిమాల బలహీనతే 'మనమే'ను కూడా వెంటాడింది. బలమైన కాన్ఫిక్ట్ లేని పాయింట్ మీద సుదీర్ఘంగా.. బోరింగ్ గా సాగే రెండో అర్ధం 'మనమే' గ్రాఫ్ ను కిందికి తీసుకెళ్లిపోయింది. ప్రధానంగా ఎమోషన్ల మీద సాగిన ద్వితీయార్ధంలో ఆ ఎమోషన్లు ఎంతమాత్రం పండకపోవడంతో చివరికి ప్రేక్షకులకు నిట్టూర్పు తప్పదు. ప్రేక్షకులకు టైంపాస్ చేయించే ఆకర్షణలు కొన్ని ఉన్నా.. పూర్తి సంతృప్తి మాత్రం లభించదు.
అపరిచితులైన ఒక అబ్బాయి.. అమ్మాయి కలిసి తమకు సంబంధం లేని ఒక పిల్లాడిని పెంచడానికి ఒక ఇంట్లో నివాసం ఉండడం.. వారి మధ్య పెరిగే రిలేషన్ నేపథ్యంలో 'మనమే' కథ రొటీన్ కు భిన్నంగానే అనిపిస్తుంది. ఈ పాయింట్ కొత్తగా క్యూరియస్ గా అనిపించి.. ప్రేక్షకులు ఆరంభంలోనే సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు. హీరో హీరోయిన్లు కొట్టుకునే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే అంటూ ఖుషి-మురారి లాంటి సినిమాల గురించి ఈ సినిమా ప్రమోషన్లలో ఉదా8హరణగా చెప్పాడు హీరో శర్వా. ఐతే ఆ సినిమాల స్థాయిలో కాకపోయినా ఇందులోనూ హీరో హీరోయిన్ల గిల్లి కజ్జాలు మంచి వినోదాన్నే ఇస్తాయి. ఆవారాగా తిరిగే కుర్రాడు.. ఒక పిల్లాడి కేర్ టేకర్ గా మారడం వల్ల తలెత్తే ఇబ్బందుల నేపథ్యంలో సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. శర్వా 'రన్ రాజా రన్' మోడ్ లోకి మారి చేసిన అల్లరి.. తన వన్ లైనర్స్ బాగా పేలాయి. ఫారిన్లో అందరూ సినిమాలు తీస్తారు కానీ.. 'మనమే'లో మాదిరి ఆ లొకేషన్లను అందంగా చూపిస్తూ ప్రేక్షకులకు ఆహ్లాదం పంచడం తక్కువ. ప్రతి సన్నివేశం కలర్ ఫుల్ గా ఉండేలా ప్రొడక్షన్ డిజైన్.. కెమెరా పనితనం ఉండడంతో ప్రథమార్ధమంతా సినిమాలో మంచి ఫీల్ కలుగుతుంది. పిల్లాడి నేపథ్యంలో వచ్చే మెజారిటీ సీన్లు వినోదాన్ని పంచుతాయి. ప్రథమార్ధంలో 'మనమే' జోరు చూస్తే ఇదొక 'విన్నర్' అనే ఫీలింగ్ వస్తుంది.
ఐతే 'మనమే'కు సమస్యంతా ద్వితీయార్ధంతోనే. ప్రధానంగా ఎమోషన్ల మీదే మిగతా సగం సినిమాను నడిపించాలని శ్రీరామ్ ఆదిత్య ప్రయత్నించాడు కానీ.. అది ఫలితాన్నివ్వలేదు. హీరో హీరోయిన్ల మధ్య ముందు నుంచే బంధం బలపడేలా కొన్ని సీన్లయినా పెట్టి ఉంటే.. వాళ్ల మధ్య ఎడబాటు తలెత్తినపుడు ఎమోషన్ వర్కవుట్ అయ్యేది. పిల్లాడిని కలిసి పెంచడం అనే పాయింట్ తప్ప వాళ్ల మధ్య ఏ రకమైన ఎమోషన్ కనిపించదు. సీరియస్నెస్ లేని హీరో పాత్ర వల్ల తను హీరోయిన్ కోసం తను పడే బాధ ఎక్కడా ఎలివేట్ కాలేదు. ఇక హీరోయిన్ అయితే ఏ ఎమోషన్ లేని బొమ్మలాగా తయారైంది ద్వితీయార్ధంలో. ఆయేషా ఖాన్.. సీరత్ కపూర్.. ఇలా ఒక్కొక్కరిని దించి యువ ప్రేక్షకులకు రొమాంటిక్ రిలీఫ్ ఇవ్వాలని చూశారు కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. హీరోయిన్.. తన ఫియాన్సీలతో కలిసి హీరో వేసే టూర్ తో 'మనమే' గ్రాఫ్ బాగా పడిపోతుంది. ఇక్కడ ఓ ఒక వృద్ధ జంటను రంగంలోకి దించి ఎమోషన్ పెంచాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ప్రథమార్ధంలో ప్రతిదీ ప్లస్సులా కనిపిస్తే.. ద్వితీయార్ధంలో అన్నీ ప్రతికూలం అయ్యాయి. ముగింపులోనూ మెరుపులు లేకుండా మరీ రొటీన్ గా సాగడంతో 'మనమే' చివరికి ఒక సగటు సినిమాలా కనిపిస్తుంది. అల్లరి పాత్రలో శర్వా పెర్ఫామెన్స్.. అతను పండించిన వినోదం.. విజువల్స్-మ్యూజిక్ కోసం 'మనమే'ను ఒకసారి ట్రై చేయొచ్చు. అంతకుమించి ఎక్కువ ఆశిస్తే కష్టం.
నటీనటులు: ఈ చిత్రంలో శర్వాను చూసిన వాళ్లకు కచ్చితంగా 'రన్ రాజా రన్' గుర్తుకు వస్తోంది. అందులో మాదిరే ఇక్కడా అల్లరి నటనతో అతను ఆకట్టుకున్నాడు. కేవలం తన పాత్ర మీదే ప్రథమార్ధమంతా నడుస్తుంది. ద్వితీయార్ధంలోనూ అక్కడక్కడా ఆ మార్కు కొనసాగుతుంది. శర్వా గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాడు. కృతి శెట్టి ఓకే అనిపిస్తుంది. తను చూడ్డానికి అందంగా ఉంది. నటన కొన్ని చోట్ల బాగానే అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ సీన్లలో ఇంపాక్ట్ వేయలేకపోయింది. సచిన్ ఖేద్కర్ కొన్ని సన్నివేశాల్లోనే తన అనుభవాన్ని చూపించాడు. వెన్నెల కిషోర్ కనిపించిన కాసేపు పంచులు బాగానే వేశాడు. సుదర్శన్ పర్వాలేదు. రాహుల్ రామకృష్ణ పెద్దగా నవ్వించలేకపోయాడు. తులసి.. సీత.. ముకేష్ రుషి వీళ్లంతా ఓకే. కీలకమైన ఖుషి పాత్రలో నటించిన బాల నటుడు (దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తనయుడు) ఆకట్టుకున్నాడు. రాహుల్ రవీంద్రన్ విలనీ ఓకే. త్రిగుణ్.. మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం: హేషమ్ అబ్దుల్ తన సంగీతంతో 'మనమే' లెవెల్ పెంచడానికి ప్రయత్నించాడు. తన బ్యాగ్రౌండ్ స్కోర్.. బిట్ సాంగ్స్ మంచి ఫీల్ ఇస్తాయి. ఐతే తన నుంచి ఆశించే చార్ట్ బస్టర్ మాత్రం ఇందులో మిస్సయింది. పాటలు సోసోగా సాగిపోతాయి. సినిమాకు విష్ణు శర్మ-రాజశేఖర్ కలిసి అందించిన ఛాయాగ్రహణం పెద్ద ఎసెట్. విజువల్స్ తొలి సన్నివేశం నుంచి ఆఖరి వరకు ఆకట్టుకుంటాయి. స్క్రీన్ చాలా కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య విషయానికి వస్తే.. ఎప్పట్లాగే అతను సినిమా ఆరంభంలో భిన్నమైన పాయింట్ తో ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కలిగించాడు. ప్రథమార్ధంలో దర్శకుడిగా తన మార్కు కనిపిస్తుంది. కానీ అతను చివరిదాకా టెంపోను కొనసాగించలేకపోయాడు. ఊరించి ఉస్సూరుమనిపించే తన బలహీనతను అతను కొనసాగించాడు.
చివరగా: మనమే.. వినోదం ప్లస్-ఎమోషన్ మిస్
రేటింగ్- 2.5/5