భైరవం.. పంచెకట్టులో మంచు మనోజ్ మాస్ అవతార్!
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ, ఏదైనా కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు.
By: Tupaki Desk | 12 Nov 2024 7:08 AM GMTరాకింగ్ స్టార్ మంచు మనోజ్ కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ, ఏదైనా కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. తన సినిమాల పట్ల ఎంతో కమిట్మెంట్, డెడికేషన్ కలిగి ఉండే యువ హీరో.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ యునిక్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నటుడిగానే కాకుండా, హోస్టుగానూ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అయితే 2017లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మళ్ళీ హీరోగా బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. దాదాపు ఏడేళ్ల గ్యాప్ అనంతరం వరుస సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ''భైరవం'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మనోజ్ మంచు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ''భైరవం''. విలక్షణ దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. వాటికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా మనోజ్ మంచు ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు. పోస్టర్ చూస్తుంటే, గతంలో ఆయన పోషించిన పాత్రలకు పూర్తి భిన్నమైన క్యారక్టర్ లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది.
'భైరవం' మాస్ వరల్డ్ లో గజపతి వర్మ అనే పవర్ ఫుల్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మనోజ్ టెర్రిఫిక్ గా, రగ్గుడ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో పంచెను పైకి కట్టుకొని, వర్షంలో తడుస్తూ ఇంటెన్స్ గా చూస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో ఒక కారు, గొడుగులు పట్టుకొని నిలబడి ఉన్న ఉన్న జనాలను మనం గమనించవచ్చు. మునుపెన్నడూ చూడని రా అండ్ మాస్ లుక్ లో మనోజ్ ఆకట్టుకున్నాడు. ఇది కచ్చితంగా మనోజ్ కి ఇది మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని పోస్టర్ ని బట్టే చెప్పొచ్చని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లను టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో అగ్ని జ్వాలల మధ్య చూపించారు. కానీ ఇక్కడ మనోజ్ మంచు ను మాత్రం వర్షం నేపథ్యంలో బ్లాక్ థీమ్ లో చూపించడం క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. ముగ్గురు హీరోలతో విజయ్ కనకమేడల ఎలాంటి కథను చెప్పబోతున్నారో అనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకూ రిలీజైన మూడు పోస్టర్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తారో చూడాలి.
'భైరవం' చిత్రాన్ని పెన్ స్టూడియోస్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్టార్ కాస్టింగ్ తో పాటుగా టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తుండగా.. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా.. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల స్క్రీన్ ప్లే.. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు. ఈ నియో-నోయిర్ యాక్షన్ డ్రామా త్వరలోనే రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.