స్టేషన్‌లో రెండు గంటలు.. మంచు మనోజ్‌కు ఏం జరిగింది?
ఈ ఘటనకు ముందు మంచు మనోజ్ తన సిబ్బందితో కలసి కనుమ రహదారిలోని ఓ రెస్టారెంట్‌లో బస చేశారు.
By: Tupaki Desk | 18 Feb 2025 5:58 AM GMTసినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సోమవారం అర్ధరాత్రి ఆయన తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం సంచలనంగా మారింది. పోలీసులు తనను అకారణంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాత్రి 11:15 గంటల సమయంలో స్టేషన్‌కు చేరుకుని, అక్కడ సుమారు రెండు గంటల పాటు ఉన్నారు.
ఈ ఘటనకు ముందు మంచు మనోజ్ తన సిబ్బందితో కలసి కనుమ రహదారిలోని ఓ రెస్టారెంట్‌లో బస చేశారు. అయితే, పోలీసులు అక్కడకు చేరుకుని "ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అంటూ ప్రశ్నించారని, తన సిబ్బందిని స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది మంచు మనోజ్‌తో ఉన్నట్లు చెప్పినా, పోలీసుల తీరులో మార్పు రాలేదని చెప్పారు. పైగా, స్టేషన్‌కు వచ్చినప్పటి నుంచి అక్కడ ఎస్ఐ లేకపోవడంతో మరింత అసహనానికి గురయ్యారని తెలిపారు.
ఈ వ్యవహారంపై తన అసంతృప్తిని తెలియజేస్తూ మంచు మనోజ్ వరుసగా వీడియోలు విడుదల చేశారు. తన తాలూకు వ్యక్తిగత జీవితం అంతా పోలీసుల కంటికి బడుతుందా? తాను ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడుతూ, ఏ కారణం లేకుండా తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇంతకు ముందు కూడా మంచు మనోజ్ కొన్ని సామాజిక అంశాలపై బహిరంగంగా స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతున్న సమయంలో పోలీసులు తనకు ఇబ్బందులు కలిగించడం అన్యాయమని పేర్కొన్నారు. భాకరాపేట సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో తన బాధను వ్యక్తం చేశారు.
అయితే, పోలీసులు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. రొటీన్‌గా పెట్రోలింగ్ చేస్తుండగా మంచు మనోజ్ టీమ్ అనుమానాస్పదంగా ఉండటంతో విచారణ చేసినట్లు చెబుతున్నారు. ఎలాంటి దురుసుగా వ్యవహరించలేదని, కేవలం భద్రతను దృష్టిలో ఉంచుకుని మాత్రమే చర్యలు తీసుకున్నామని వివరణ ఇచ్చారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మంచు మనోజ్ వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. పోలీసులు, మంచు మనోజ్ మధ్య మరింత ఘర్షణ ఏర్పడుతుందా లేక దీనికి పరిష్కారం త్వరలోనే దొరుకుతుందా అనే దానిపై అందరి దృష్టి నెలకొంది.