Begin typing your search above and press return to search.

నన్ను తొక్కాలని చూస్తున్నారు: మంచు మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన ధైర్యం, ఆత్మవిశ్వాసం చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 5:42 AM GMT
నన్ను తొక్కాలని చూస్తున్నారు: మంచు మనోజ్
X

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన ధైర్యం, ఆత్మవిశ్వాసం చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరత్ హీరోగా తెరకెక్కిన ‘జగన్నాథ్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మనోజ్, ఈ ఈవెంట్‌లో చేసిన ప్రసంగం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటలు కేవలం సినిమా ప్రమోషన్‌కే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా వెల్లడించాయి.

ఈ టీజర్ లాంచ్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, తనపై జరుగుతున్న కుట్రలు, ట్రోల్స్, విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. “నన్ను తొక్కాలని ప్రయత్నిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరూ నన్ను అభిమానుల గుండెల నుంచి తీసివేయలేరు” అని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఇచ్చే ప్రేమ తనకు అసలైన బలమని, వారి ఆశీస్సులతో ఎవరైనా ఎదిరించినా ఎదుర్కొంటానని సవాల్ విసిరారు.

మనోజ్ ప్రసంగంలో విభిన్నమైన ఆలోచనా విధానం హైలెట్ అయ్యింది. ముఖ్యంగా సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ, “సినిమా బడ్జెట్ ఎంత? వంద కోట్లు, రెండువందలు కోట్లు అన్నది ముఖ్యం కాదు. సినిమా బాగుందా లేదా అనేది ముఖ్యం” అంటూ ఒక సినిమాపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్టుగా ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలా ఒక ప్రాజెక్ట్ బడ్జెట్‌పై వచ్చిన హంగామా నేపథ్యంలో ఈ కామెంట్స్ మరింత దారుణంగా చర్చకు దారి తీస్తున్నాయి.

ఇక మనోజ్ తన అభిమానుల గురించి మాట్లాడుతూనే భావోద్వేగానికి లోనయ్యారు. “మీరే నా దేవుళ్లు.. మీరే నా కుటుంబం. నేను అమ్ముడుపోయే కాయో, పండో అనుకోవద్దు. నా ఫ్యాన్స్ నా సొంతం. నన్ను ఎవరైనా తొక్కాలనుకున్నా, లేపాలనుకున్నా, అది మీ వల్లే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఆ శక్తి చూపించలేరు” అంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. అభిమానుల ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతేకాదు, “న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అది బయట వాళ్లైనా సరే, నా వాళ్లయినా సరే.. నేను వెనకడుగు వేయను. నా ప్రాణం ఉన్నంతవరకు విద్యార్థుల కోసం, సమాజం కోసం నిలబడతాను” అని స్పష్టం చేశారు. ఈ మాటలు ఆయన మనసులో ఉన్న సంకల్ప బలాన్ని చాటిచెప్పాయి. ఈ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొందరు ఆయన చెప్పిన మాటల్లో ఉన్న నిజాయితీని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది పరోక్షంగా కుటుంబ రాజకీయాలపై పంచ్ అని అనుకుంటున్నారు. అయితే, మనోజ్ ఈ వ్యాఖ్యలతో మరోసారి తన అభిమానులకు దగ్గరయ్యారు. ‘జగన్నాథ్’ సినిమా ప్రమోషన్‌తో మొదలైన ఈ వేదిక, కుటుంబ వివాదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు అన్నీ కలగలిసి ఒక పెద్ద చర్చకు దారి తీసింది. మరి ఈ వాక్యాలు మంచు ఫ్యామిలీలో ఎలాంటి చర్చలకు దారి తీస్తాయో చూడాలి.