కన్నప్పలో మంచు వారసుల జోరు!
ఈ చిత్రంలో అరియానా, వివియానాల పాత్రలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. పోస్టర్‌లో వాళ్ల కళాత్మక నృత్య నైపుణ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 2 Dec 2024 8:19 AM GMT
సినీ కుటుంబం నుంచి మరొక తరం వెండితెరకు పరిచయమవుతోంది. ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతున్న పాన్ఇండియా చిత్రం 'కన్నప్ప'లో మంచు కుటుంబానికి చెందిన అరియానా - వివియానాలు సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా, విష్ణు వారి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.
వీరిద్దరి పుట్టినరోజు సందర్భంగా విష్ణు సోషల్ మీడియా వేదికగా వారి ఫోటోలను విడుదల చేశారు. ''నా చిన్ని తల్లుల స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం అందరికీ ఎంతో నచ్చుతుంది. మీ అందరికీ మా కుటుంబం నుంచి ఇది గర్వించదగిన రోజు. హ్యాపీ బర్త్‌డే అరి, వివి'' అంటూ ట్వీట్ చేశారు. అందులో వారి నాట్య నైపుణ్యాన్ని హైలైట్ చేస్తూ, శివుడి భక్తిగా వారి పాత్రకు ప్రాధాన్యతను వివరించారు.
ఈ చిత్రంలో అరియానా, వివియానాల పాత్రలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. పోస్టర్‌లో వాళ్ల కళాత్మక నృత్య నైపుణ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. 'కన్నప్ప' కథ నేపథ్యానికి తగిన రీతిలో వీరి పాత్రలు చక్కటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయని అనిపిస్తోంది. మరోవైపు, మంచు మోహన్ బాబు తమ మనవరాళ్ల చిత్రరంగ ప్రవేశంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ''ఇండస్ట్రీలో తమ ప్రతిభను చాటుకునే అవకాశాన్ని వీరు సద్వినియోగం చేసుకుంటారని నమ్మకంగా ఉన్నా. వారి నటన వారసత్వం మా కుటుంబానికి మరింత గౌరవాన్ని తెస్తుంది'' అని పేర్కొన్నారు.
ఈ చిత్రం కోసం మంచు విష్ణు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఆయన కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, టాలీవుడ్ స్టార్ ప్రభాస్ వంటి నటులతో కలిసి పనిచేయడం ఈ చిత్రంపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. అరియానా మరియు వివియానాలు తమ టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మంచి పేరు తెచ్చుకుంటారని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
'కన్నప్ప' సినిమాను పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం సినిమా ప్రేమికులను థియేటర్లకు రప్పించేలా అన్ని అంశాల్లో కూడా బలంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రం ద్వారా మంచు కుటుంబం నుంచి మరో తరానికి మంచి ఆరంభం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మోహన్ బాబు కూడా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు కుమారుడు కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ తో ఎట్రాక్ట్ చేయనున్నాడు. కన్నప్ప సినిమా ద్వారా మంచు ఫ్యామిలీ జోరు గట్టిగానే హైలెట్ అవుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.