మరో వివాదంలో మంచు విష్ణు.. అడవి పందులను వేటాడిన సిబ్బంది..!
అయితే ఇప్పుడు తన సిబ్బంది నిర్వాకం వల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నారు.
By: Tupaki Desk | 31 Dec 2024 7:37 AM GMT'మంచు' ఫ్యామిలీ ఇటీవల కాలంలో సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే మంచు బ్రదర్స్ విష్ణు - మనోజ్ మధ్య తలెత్తిన గొడవలో పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. జర్నలిస్టు మీద దాడి ఘటనలో మోహన్ బాబుపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఇప్పుడు తన సిబ్బంది నిర్వాకం వల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నారు.
జల్ పల్లిలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది. అక్కడి అడవిలోకి వెళ్లి విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఎప్పటి వీడియో? ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఎవరు రిలీజ్ చేశారు? అనేది తెలియదు కానీ.. ఇది నెట్టింట వైరల్ అవ్వడంతో వన్యప్రాణులను వేటాడిన విష్ణు అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ జల్‌పల్లిలో నివాసం ఉంటున్నారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య మనోజ్, మోహన్ బాబులు ఈ ఇంటి దగ్గరే ఘర్షణ పడ్డారు. మనోజ్ గేట్లు బద్దలు కొట్టి మరీ తన బౌన్సర్లతో ఇంటిలోకి వెళ్ళారు. ఆ సమయంలోనే మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు పోలీసులు ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. ఒకవేళ మోహన్ బాబు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో పోలీసులు మంచు విష్ణు - మంచు మనోజ్ లతో విడివిడిగా మాట్లాడారు. అప్పటి నుంచి మళ్ళీ ఏమీ జరగకుండా జాగ్రత్తగా ఉంటున్నారని అనుకుంటున్న టైంలో, విష్ణు సిబ్బంది మీద హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ కంప్లెయింట్ చేశారు. జనరేటర్ లో పంచదార వేయించి తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ఆరోపించారు. అయితే తన కుమారుడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటూ మనోజ్ తల్లి పోలీసులకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా తాజాగా విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడటం వల్ల మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది.