కన్నప్ప 'లవ్' - రొమాంటిక్ ట్రాక్ లో ఊహించని సాంగ్
మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంట మీద చిత్రీకరించిన ఈ పాటలో నీటి మధ్య, అడవుల మధ్య రొమాంటిక్ ఎమోషన్లు ప్రధానంగా చూపించారు.
By: Tupaki Desk | 10 March 2025 6:14 PM ISTమంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ నుండి మరో లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సినిమాలో మోహన్ బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్‌కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన లవ్ లిరికల్ వీడియో "సగమై చేరి సగమై.." ప్రేమ, భావోద్వేగాలతో నిండిన పాటగా సాగింది. స్టీఫెన్ దేవసీ సంగీతం అందించగా, రేవంత్, హరిచరన్, చిన్మయి, సాహితి, షాన్, నజీమ్ అర్షద్ వంటి గాయకులు ఈ పాటను భాషలకు తగ్గట్టుగా ఆలపించారు.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ పాటలో హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభుదేవా - బృంద మాస్టర్ కలిసి ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా, లొకేషన్స్ కూడా అందంగా కుదిరాయి. పాట విజువల్స్ పరంగా చూస్తే.. ప్రకృతి సోయగాలతో కూడిన లొకేషన్లు ఆకట్టుకున్నాయి.
మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంట మీద చిత్రీకరించిన ఈ పాటలో నీటి మధ్య, అడవుల మధ్య రొమాంటిక్ ఎమోషన్లు ప్రధానంగా చూపించారు. ప్రీతి ముకుందన్ గ్లామర్ లుక్, నేచురల్ లొకేషన్స్ పాటకు ప్లస్ పాయింట్ అయితే, కంపోజిషన్ పరంగా చూసుకుంటే అదోకే ఓకే అనిపించే స్థాయిలో ఉంది. అయితే కన్నప్ప లాంటి సినిమాలో ఇలాంటి లవ్ రొమాంటిక్ సాంగ్ ఉంటుందని ఎవరు ఊహించలేదు.
మేకర్స్ కన్నప్ప కథను సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. విష్ణు, ప్రీతి ముకుందన్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ హైలైట్ అయ్యాయి. అలాగే మ్యూజిక్ పరంగా స్టీఫెన్ దేవసీ మంచి బాణీలను ఇచ్చారు. పూర్తిగా మైథలాజికల్ టచ్‌తో రొమాన్స్ మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక బిగ్ స్క్రీన్‌పై ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.