Begin typing your search above and press return to search.

'కన్నప్ప' ప్రభాస్ వర్షన్‌ లోడింగ్‌..!

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'కన్నప్ప' విడుదలకు సిద్ధం అయింది. ఏప్రిల్‌ 25, 2025న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు గత రెండు నెలలుగా జరుగుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   18 March 2025 5:00 PM IST
కన్నప్ప ప్రభాస్ వర్షన్‌ లోడింగ్‌..!
X

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'కన్నప్ప' విడుదలకు సిద్ధం అయింది. ఏప్రిల్‌ 25, 2025న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు గత రెండు నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. సినిమాలో నటించిన ముఖ్య నటీనటుల పోస్టర్స్‌ను విడుదల చేయడం ద్వారా సినిమాను వార్తల్లో నిలుపుతూ వచ్చిన మంచు విష్ణు పాటల విడుదలతో సినిమాపై అంచనాలు పెంచాడు. ముఖ్యంగా శివుడి పాట విడుదల తర్వాత కన్నప్ప సినిమాకు మొదటి సారి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ప్రభాస్ లుక్‌ రివీల్‌ చేసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. గెస్ట్‌ రోల్‌ అంటే ఇలా వచ్చి అలా వెళ్లి పోవడం కాకుండా కనీసం 30 నిమిషాల పాటు ప్రభాస్ పాత్ర ఉంటుంది అని చిత్ర యూనిట్‌ సభ్యులు పదే పదే చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా కథకు అత్యంత కీలక సమయంలో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సినిమాలో ఒక్క చోట మాత్రమే కనిపించకుండా కథతో పాటు ప్రభాస్ పాత్ర ట్రావెల్‌ చేస్తుందని మంచు విష్ణు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాలో ప్రభాస్ ఉండటం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. కనుక సినిమా విడుదల సమయంలో విడుదల కాబోతున్న ట్రైలర్‌లో ప్రభాస్‌ను మరింతగా రివీల్‌ చేయాలని విష్ణు అండ్‌ టీం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

కన్నప్ప నుంచి రాబోతున్న ట్రైలర్‌లో ప్రభాస్‌ పాత్రను పూర్తిగా చూపించడంతో పాటు, ట్రైలర్‌లో ప్రభాస్ డైలాగ్‌లను కూడా పెట్టబోతున్నారు. మొత్తంగా ప్రభాస్ వర్షన్‌ ట్రైలర్‌ అన్నట్లుగా కన్నప్ప ట్రైలర్‌ ఉంటుంది అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ట్రైలర్‌ కోసం అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ను రెడీ చేయించారని తెలుస్తోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కన్నప్ప ట్రైలర్‌ను దుబాయ్‌ లో విడుదల చేయబోతున్నారు. అక్కడ భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు గాను మంచు విష్ణు ప్లాన్‌ చేస్తున్నాడు. ఏప్రిల్‌ 5న దుబాయ్‌లో లాంచ్‌ కాబోతున్న ట్రైలర్‌ను అదే తేదీన యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

సాధారణంగా ప్రభాస్ సినిమా ట్రైలర్‌కి ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందో అదే స్థాయిలో కన్నప్ప సినిమా ట్రైలర్‌కి రెస్పాన్స్‌ దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంతా కన్నప్ప ట్రైలర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కన్నప్ప ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరగడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు ధీమాతో ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని ఇండియన్‌ భాషల్లోనూ కన్నప్ప జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ముకేష్ కుమార్‌ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో విష్ణు, ప్రభాస్‌తో పాటు మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ బాబు, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.