మరోసారి MAA అధ్యక్షుడిగా మంచు విష్ణు?
ఇలాంటి సమయంలో ఎన్నికలు లేకుండానే మూవీ ఆర్టిస్టుల సంఘం ప్రస్తుత అధ్యక్షుడైన మంచు విష్ణు మరో దఫా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటూ మీడియాలో కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 8 April 2024 4:14 AM GMTరెండేళ్లకు ఒకసారి జరగాల్సిన మూవీ ఆర్టిస్టుల సంఘం (MAA ) ఎన్నికలు అంతకంతకు జాప్యం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఈసీ పదవీకాలం ముగిసినా కానీ ఎన్నికలు జాప్యం అవ్వడంపై ఆర్టిస్టుల్లో చర్చ సాగుతోంది. 2021లో ఎన్నికైన బాడీ ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్నికలు లేకుండానే మూవీ ఆర్టిస్టుల సంఘం ప్రస్తుత అధ్యక్షుడైన మంచు విష్ణు మరో దఫా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటూ మీడియాలో కథనాలొచ్చాయి.
అయితే తాజాగా దీనిని మా ఉపాధ్యక్షుడు అయిన మాదాల రవి ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. మాదాల రవి ఓ సమావేశంలో మాట్లాడుతూ-''తాజా జనరల్ బాడీ మీటింగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కోసం జూలై లో మలేషియా లో ఈవెంట్ చేస్తున్నాము. మా బిల్డింగ్ ను కూడా నిర్మించనున్నాం. అప్పటి వరకు మంచు విష్ణు అధ్యక్షుడిగా సేమ్ కార్యవర్గం కొనసాగాలి అని జనరల్ బాడీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. సోమవారం అధికారికంగా అన్ని వివరాలతో మంచు విష్ణు ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నారు'' అని తెలిపారు.
గత ఎన్నికల్లో గెలిచిన 'మా' ఈసీ కమిటీ 2021-23 సీజన్ కి పాలన సాగించింది. 2023-2025 సీజన్ కి ఎన్నికలు జరగాల్సి ఉండగా అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. అధ్యక్షుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) బిల్డింగ్ ని నిర్మిస్తామని, దానికోసం కోట్లలో నిధిని తాను స్వయంగా సమకూరుస్తానని గత ఎన్నికల ముందు హామీగా ప్రకటించారు. కానీ అది జరగకపోవడంపై ఆర్టిస్టుల్లో చర్చ సాగుతోంది. ఇప్పుడు నిధిని సేకరించేందుకు మలేషియాలో ఈవెంట్ చేస్తున్నామని చెబుతున్నారు. దీనిపై నేటి అధికారిక ప్రెస్ నోట్ లో స్పష్ఠతనిస్తారన్న చర్చా సాగుతోంది.