'చంద్రముఖి' బ్రాండ్ తో ఆ సినిమాకి హాట్ కేకుల్లా?
తాజాగా 'మణిచిత్రతజు' రీ-రిలీజ్ అయింది. 4కె ఫార్మెట్ లో రిలీజ్ చేసారు.
By: Tupaki Desk | 18 Aug 2024 4:38 AM GMTరజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు నటించిన 'చంద్రముఖి' అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రజనీ కెరీర్ లో ఇదొక ల్యాండ్ మార్క్ హిట్ గా నిలిచిపోయింది. రజనీతో తొలిసారి పి. వాసు చేసిన తొలి హారర్ థ్రిల్లర్ చిత్రమిది. అయితే ఇది రీమేక్ సినిమా అన్న సంగతి తెలిసిందే. 'ఆప్తమిత్ర' అనే కన్నడ సినిమాకి రీమేక్ రూపం. అయితే ఈ కన్నడ చిత్రానికి మూలం ఓ మలయాళ సినిమా అని తెలుస్తోంది.
1993 లో మాలీవుడ్ లో 'మణిచిత్రతజు' అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాన్నే 2004 లో కన్నడలో, 2005 లో తమిళ్ లోనూ పునర్మించారు. ఇవే కథల్ని తిప్పి వెంకటేష్ 'నాగవల్లి' సినిమా చేసారు. కానీ ఇది ఆశించిన ఫలితానివ్వని సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రముఖి - అంటూ పి.వాసునే రాఘవ లారెన్స్ తో కూడా ఓ సినిమా చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే.
ఆ సంగతి పక్కన బెడితే...ఈ మొత్తం 'చంద్రముఖి' కథకి మూలం మలయాళ చిత్రం 'మణిచిత్రతజు' అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. తాజాగా 'మణిచిత్రతజు' రీ-రిలీజ్ అయింది. 4కె ఫార్మెట్ లో రిలీజ్ చేసారు. చంద్రముఖి బ్రాండ్ తో ఈ సినిమాకి రీ-రిలీజ్ లో మంచి క్రేజ్ వస్తోంది. యూట్యూబ్ ట్రైలర్ కూడా క్వాలిటీగా ఉంది.
దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపాదించి రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 30 వేలకు పైగా టికెట్లు బుక్ అవ్వడం చూసి ట్రేడ్ షాక్ అయింది. హైదరాబాద్ లో వేసిన రెండు షోలు సైతం పుల్ అవుతున్నాయి. ఇదంతా 'చంద్రముఖి' ఇంపాక్ట్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతోనే మాతృకలో ఏముందో? చూద్దామనే ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తుంది. ఇందులో మోహన్ లాల్, సురేష్ గోపీ, శోభన కీలక పాత్రలు పోషించారు.