ఇద్దరు పిల్లలకు తల్లినంటే నన్నంతా హెచ్చరించారు!
అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా జంటగా మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ `బొంబాయి` గురించి చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 9 Nov 2024 7:30 PM GMTఅరవింద్ స్వామి, మనీషా కోయిరాలా జంటగా మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ `బొంబాయి` గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందూ-ముస్లీం లవ్ స్టోరీ అప్పట్లో ఓ సంచలనం. ఇరువురి మధ్యా లవ్ ట్రాక్- బొంబాయి నగరంలో కొత్త కాపురం.. టెర్రర్ ఎటాక్- నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన చిత్రం. ఇందులో మనీషా కోయిరాలా ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో ఆద్యంతం అభినయించిన తీరుకు ప్రేక్షకుడు ఫిదా అయ్యాడు.
శైలా భాను పాత్రలో ఓవైపు తల్లిగా..మరోవైపు ప్రేమికురాలిగా తన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలచుకుంది. ఆమె కెరీర్ జర్నీలోనే ఎంపిక చేసుకున్న గొప్ప రోల్ అది. ఇలాంటి అద్భుతమైన పాత్రను మనీషా కోయిరాలా తొలుత వదులుకోవాలనుకుంది? అన్న సంగతి ఎంత మందికి తెలుసు. అవును ఈ విషయం తానే స్వయంగా రివీల్ చేసింది. `ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో నేను పోషించే శైలా భాను అనే పాత్ర కొంచెం అమాయకంగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉంటుందని చెప్పారు.
కానీ ఈ పాత్రలో నటించొద్దని నా చుట్టూ ఉన్న వారంతా నన్ను ఎంతగానో హెచ్చరించారు. ఓసారి తల్లిగా నటిస్తే హీరోయిన్ అవకాశాలు రావని అన్నారు. అదే ఇమేజ్ లో ఇరుక్కుపోతావని తల్లి పాత్రలు పోషించమే మిగతా దర్శకులు అడుగుతారని ఇది సరైన నిర్ణయం కాదని చాలా మంది చెప్పారు. దీంతో నేను కూడా ఆ పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నా. కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మోహతా మణిరత్నం పనితనం గురించి అవగాహన కల్పించారు.
ఆయనతో పనిచేసే అవకాశం ఎవరికోగానీ రాదు..నీకు వచ్చింది వదులుకోవద్దని చెప్పారు. ఆ రోజు అశోక్ మెహతా మాటలు విని సైన్ చేసాను. ఆయన గనుక ఆ మాట చెప్పకపోయి ఉంటే ఇండస్ట్రీలో నా కెరీర్ మరోలా ఉండేదని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఓ గొప్ప చిత్రాన్ని కోల్పేయేదాన్ని. మళ్లీ అలాంటి పాత్ర పోషించే అవకాశం నాకు జీవితంలో దక్కేది కాదు. ఆ పాత్ర చేసిన తర్వాత నన్ను ఎంతగానే ప్రజలు ప్రేమించడం మొదలు పెట్టారు` అని తెలిపింది.