పవన్, మహేష్ దూరంగా.. మణిశర్మ ఆవేదన
ఇప్పటికీ చాలా మంది మణిశర్మ బాణీలు కట్టిన పాటలను వింటూ ఉంటారు. చెప్పాలంటే.. 1998 నుంచి 2011 వరకు టాలీవుడ్ లో మెలోడీ బ్రహ్మ యుగం నడిచిందనే చెప్పొచ్చు.
By: Tupaki Desk | 3 Jan 2024 8:20 AM GMTమెలోడీ బ్రహ్మ మణిశర్మ.. ఈ పేరు వినగానే ఆయన మ్యూజిక్ అందించిన సూపర్ హిట్ పాటలు గుర్తొస్తాయి. స్టార్ హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. అలా ప్రతీ హీరో కెరీర్ లో మణిశర్మ ఇచ్చిన ఆల్బబ్ కచ్చితంగా ఉంటుంది. ఇక మెగాస్టార్ కెరీర్ లో అయితే చెప్పనక్కర్లేదు.. లైఫ్ టైమ్ గుర్తుండిపోయేలా అనేక ఆల్బమ్స్, ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్లు ఇచ్చారు.
ఇప్పటికీ చాలా మంది మణిశర్మ బాణీలు కట్టిన పాటలను వింటూ ఉంటారు. చెప్పాలంటే.. 1998 నుంచి 2011 వరకు టాలీవుడ్ లో మెలోడీ బ్రహ్మ యుగం నడిచిందనే చెప్పొచ్చు. ఆ సమయంలో ఎన్నో వందల అద్భుతమైన పాటలతోపాటు మర్చిపోలేని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను మణిశర్మ ప్రేక్షకులకు అందించారు. కానీ అలాంటి మణిశర్మ ఇప్పుడు ఛాన్సులు కోసం బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా మణిశర్మ అడపాదడపా సినిమాలను మాత్రమే చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు పెరగడం, వేరే ఇండస్ట్రీ నుంచి సంగీత దర్శకులను తెచ్చుకోవడం వల్ల ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. 2023లో మణిశర్మ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది. 2022లో అది కూడా లేదు. ఇప్పుడు మణిశర్మ చేతిలో కేవలం రెండు సినిమాలే ఉన్నాయి. తాజాగా మణిశర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎక్కువ అవకాశాలు రాకపోవడంపై స్పందించారు.
''మహేశ్ బాబు నా తమ్ముడు. అతడు నన్ను చాలా నమ్మాడు. మా చివరి సినిమా వరకు ఆ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకున్నాను. కానీ ఏమి జరిగిందో నాకు తెలియదు. మా చివరి చిత్రం తర్వాత అతడు నన్ను ఎప్పుడూ పిలవలేదు. పవన్‌కల్యాణ్ ఖుషిలోని చెలియా సాంగ్ను కంపోజ్ చేశాను. గుడుంబా శంకర్‌లో అన్ని పాటలను కూడా నేనే కంపోజ్ చేశాను. ఆ పాటలను కంపోజ్ చేస్తున్నప్పుడు మేమిద్దరం డ్యాన్స్ చేశాం, పాడాం, చాలా ఎంజాయ్ చేశాం. కానీ అతడు కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు" అని మణిశర్మ చెప్పారు.
నేను హార్ట్ అయ్యేది ఒకటే. మహేశ్, పవన్ లాంటి స్టార్ హీరోలు అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. తమన్ కు ఒకటి, దేవి కి ఒకటి, నాకు ఒకటి. పోనీ వాళ్లకు రెండు, నాకు ఒకటి ఇచ్చినా ఆడియన్స్ కు కొత్త కొత్త మ్యూజిక్ అందుతుంది. ఇది నా వరకు నేనే అనుకుంటాను. వాళ్లను అడగలేను" అంటూ మణిశర్మ తన మనుసులోని బాధను బయటపెట్టారు.
ప్రస్తుతం మణిశర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఎంతోమంది హీరోలకు కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు ఇలా ఛాన్సులు కోసం బాధపడడం... హార్ట్ టచింగ్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మణిశర్మకు ఫ్యూచర్ లో అయినా అవకాశాలు వస్తాయేమో చూడాలి.