Begin typing your search above and press return to search.

సంగీత ప్రియుల్ని హింసించి వేధించే క‌ల్చ‌ర్ ఇది!

'బెదురులంక 2012' ప్రమోషన్ కార్య‌క్ర‌మంలో మొత్తం ఆల్బమ్‌కు బదులుగా ఒకేసారి ఒక పాటను విడుదల చేసే ధోరణిని ఆయన విమర్శించారు

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:19 AM GMT
సంగీత ప్రియుల్ని హింసించి వేధించే క‌ల్చ‌ర్ ఇది!
X

టాలీవుడ్ లో కొన్నేళ్లుగా ఆడియో రిలీజ్ అనేది చాలా వింతైన మార్పుల‌కు లోనైంది. ఒక‌ప్పుడు సినిమాలోని ఐదారు పాట‌ల‌ను ఒకేసారి ఆల్బ‌మ్ గా రిలీజ్ చేస్తే ప్ర‌జ‌లు అన్ని పాట‌ల్ని మ‌న‌స్ఫూర్తిగా వినేవారు. న‌చ్చిన పాట‌ను ప‌దే ప‌దే రిపీట్ చేస్తూ మ‌రీ వినేవారు. టేప్ రికార్డ‌ర్ల కాలంలో ఈ స‌న్నివేశం ఉండేది. సీడీలు డీవీడీలు వినే రోజుల్లోను చాలా కాలం ఇది కొన‌సాగింది. అయితే రాను రాను పాట‌ల విడుద‌ల ఒక ప్ర‌హ‌స‌నంగా మారింది. నూత‌న ప్ర‌క్రియ‌గా రూపాంత‌రం చెందింది. ఇందులోకి కూడా స్వార్థం ప్ర‌వేశించింది.

ఎట్టి ప‌రిస్థితిలో పాట‌ల విడుద‌ల‌ను కూడా ప్ర‌చారం కోసం క‌మ‌ర్షియ‌లైజ్ చేయ‌డం అన్న ఆలోచ‌న మొద‌లైంది. ప‌బ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ ప్ర‌జ‌ల్లో నిరంత‌రం ట‌చ్ లో ఉండాల‌న్న ఆలోచ‌న‌ను చేసారు. ఈ కొత్త విధానాన్ని ప్రోత్స‌హించిన ప్ర‌థ‌ముడిగా ప‌రిశ్ర‌మ దిగ్గ‌జం అల్లు అర‌వింద్ పాపుల‌రయ్యారు.

ఒక్కో సింగిల్ ని రిలీజ్ చేస్తూ వ‌రుస‌గా ఐదు పాట‌ల‌కు ఐదు విభిన్న‌మైన స‌మ‌యాల్ని ఆయ‌న లాక్ చేసారు. ఈ ప్ర‌చారానికి ప్ర‌జ‌లు లేదా సంగీత ప్రియులు అల‌వాటు ప‌డ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టినా కానీ నెమ్మ‌దిగా అది సినిమా ప్ర‌చారానికి ఉప‌యుక్తంగా ఉంద‌ని నిరూప‌ణ అయింది. నిజానికి సంగీత‌ప్రియుల‌కు ఈ విధానం ఇప్ప‌టికీ న‌చ్చ‌దు. కానీ భ‌రించాలి.

ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత త‌న‌లోని అసహ‌నాన్ని బ‌య‌ట‌పెట్టారు మెలోడి బ్ర‌హ్మ‌ మణి శర్మ. ఇటీవల సంగీత పరిశ్రమ రూపురేఖ‌ల‌ గురించి బలమైన అభిప్రాయాలను షేర్ చేసారు. తాజా చిత్రం 'బెదురులంక 2012' ప్రమోషన్ కార్య‌క్ర‌మంలో మొత్తం ఆల్బమ్‌కు బదులుగా ఒకేసారి ఒక పాటను విడుదల చేసే ధోరణిని ఆయన విమర్శించారు.

ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల పాటల ప్రాధాన్యత, విలువ తగ్గిపోతుందన్నారు. పాటలను ఒకే ఆల్బమ్‌గా విడుదల చేయడం ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్న‌ట్టు తెలిపారు. కొన్ని పాటలు పదే పదే విన్న తర్వాత ముద్ర వేయడానికి సమయం పట్టవచ్చని కూడా అన్నారు. నిజానికి చాలా మంది మ‌న‌సుల్లో ఉన్న‌ది మ‌ణిశ‌ర్మ నోట బ‌హిరంగంగా బ‌య‌ట‌ప‌డింది.

దీనిపై భిన్న‌మైన అభిప్రాయాలు ఉండ‌వ‌చ్చు. కానీ ఒక ఆల్బ‌మ్ లోని ఆరు పాట‌ల్ని ఒకేసారి వింటే ఉండే కిక్కు వేరు. లేదా ఒక రోజులోనో రెండు రోజుల్లోనే తీరిక స‌మ‌యాల్లో అన్ని పాట‌ల్ని వినేందుకు ఆస్కారం ఉంది గ‌నుక అది కూడా కిక్కిస్తుంది.

అలా కాకుండా రోజుల త‌ర‌బ‌డి ట్రిప్పుకో పాట అంటూ రిలీజ్ చేస్తూ ప్ర‌చారం కోసం సంగీత‌ప్రియుల్ని హింసించ‌డం చాలామందికి న‌చ్చ‌నిది. ఒకేసారి ఒక్కో పాట వినే ప‌ద్ధ‌తితో ప్ర‌చారం క‌లిసి రావ‌చ్చేమో కానీ నిజ‌మైన సంగీత ప్రియుల‌కు ఇది టార్చ‌ర్ లాంటిది. పాట‌ల‌న్నీ ఒకేసారి విన‌లేం అనుకునేవాడు క‌చ్ఛితంగా నిజ‌మైన సంగీత ప్రియుడు కానేకాదు!