Begin typing your search above and press return to search.

30 ఏళ్లు అయినా మంజు మేడం అదే జోరు

సినిమా ఇండస్ట్రీలో హీరోలు ముప్పై, నలభై ఏళ్లు హీరోలుగా కొనసాగుతారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 11:30 PM GMT
30 ఏళ్లు అయినా మంజు మేడం అదే జోరు
X

సినిమా ఇండస్ట్రీలో హీరోలు ముప్పై, నలభై ఏళ్లు హీరోలుగా కొనసాగుతారు. కానీ హీరోయిన్స్‌ మాత్రం పదేళ్లు కొనసాగడం గొప్ప విషయంగా మారింది. అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే పదేళ్లకు మించి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి 30 ఏళ్లు అవుతున్నా మంజు వారియర్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఒకానొక సమయంలో మంజు వారియర్ సౌత్‌ లోనే స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగింది.

ఈ మధ్య కాలంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న మంజు వారియర్‌ అప్పుడప్పుడు హీరోయిన్‌ గానూ చేస్తోంది. ధనుష్ తో కలిసి ఆ మధ్య ఈమె చేసిన సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్‌ గా ఈ వయసులోనూ తన సత్తా చాటుతున్న మంజు వారియర్‌ కి మరింతగా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఈమె రజినీకాంత్‌ తో కలిసి 'వేట్టయన్‌' సినిమాలో నటించింది. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇటీవల విడుదలైన వేట్టయన్ సినిమా పాట లో మంజు వారియర్‌ స్టెప్స్‌ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

మంజు వారియర్‌ డాన్స్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సమయంలో మంజు వారియర్ గురించిన చర్చ ప్రముఖంగా జరుగుతోంది. మంజు వారియర్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 30 ఏళ్లు అవుతోంది. 15 ఏళ్ల వయసులోనే మంజు వారియర్‌ సినిమా ల్లో అడుగు పెట్టింది. మలయాళంలో దాదాపుగా 40 సినిమాలు చేసిన మంజు వారియర్‌ తమిళ్‌ లో వరుసగా సినిమాలు చేసింది. 1995 లో సాక్ష్యం సినిమాతో మంజు వారియర్‌ ఎంట్రీ ఇచ్చింది. ఏటా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంజు వారియర్‌ ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది.

హీరోయిన్‌ గా బిజీ బిజీగా ఉన్న సమయంలోనే మలయాళ హీరో దిలీప్ ను 1999 లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. దిలీప్ తో వచ్చిన విభేదాల కారణంగా విడి పోయింది. భర్త నుంచి విడిపోయిన సమయంలో ఉన్న ఒక్క కూతురు కూడా తండ్రి వద్ద ఉంటానని చెప్పడంతో మంజు వారియర్‌ కి తీవ్ర దుఖం మిగిలింది. ఆ సమయంలో మంజు వారియర్‌ కొన్నాళ్లు డిప్రెషన్ కి వెళ్లినట్లుగా చెప్పింది. తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్‌ గా కెరీర్‌ ఆరంభంలో చేసిన స్పీడ్‌ తో పోల్చితే మరింత స్పీడ్‌ గా ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న మంజు వారియర్‌ తెలుగు లో కూడా నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.