Begin typing your search above and press return to search.

తెలుగులో మంజుమ్మెల్ బాయ్స్.. రైట్స్ ఎంతంటే?

కొవిడ్ టైంలో అన్ని భాషల సినిమాలు చూడడం మొదలుపెట్టిన టాలీవుడ్ ఆడియన్స్.. మాలీవుడ్ సినిమాలకు బాగా కనెక్ట్ అయిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   15 March 2024 1:12 PM GMT
తెలుగులో మంజుమ్మెల్ బాయ్స్.. రైట్స్ ఎంతంటే?
X

కొవిడ్ టైంలో అన్ని భాషల సినిమాలు చూడడం మొదలుపెట్టిన టాలీవుడ్ ఆడియన్స్.. మాలీవుడ్ సినిమాలకు బాగా కనెక్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మలయాళం మూవీలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. మాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మన మేకర్స్‌. ఇటీవల ప్రేమలు మూవీ డబ్బింగ్ వెర్షన్ రిలీజైంది.

ఇప్పుడు మరో మలయాళం సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ కూడా తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. గత నెలలో మాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.160 కోట్లకుపైగా వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా రికార్డు సృష్టించేందుకు దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయనుందని వార్తలొస్తున్నాయి.

అయితే ఆ వార్తలు నిజమేనని, రూ.2 కోట్లకు మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు రైట్స్ ను మైత్రీ సంస్థ దక్కించుకుందని లేటెస్ట్ బజ్. కానీ ఇప్పటి వరకు ఈ వార్తలపై మైత్రీ సంస్థ స్పందించలేదు. అయితే ఈ మూవీ తెలుగులో నేడే(మార్చి 15) రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా.. మార్చి 29వ తేదీన విడుదల కానుందని సమాచారం. కావాలనే రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

రెండు వారాలపాటు తెలుగులో ప్రమోషన్లు భారీగా నిర్వహించి రిలీజ్ చేయాలని మైత్రీ సంస్థ భావిస్తోందట. అతి త్వరలోనే ప్రమోషన్లను స్టార్ట్ చేయనుందట. ప్రేమలు టీమ్ లానే.. మంజుమ్మెల్ బాయ్స్ టీమ్ కూడా హైదరాబాద్ లో మూవీ ప్రమోషన్లు నిర్వహించడానికి ప్లాన్ చేస్తోందట. కేరళ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. మన దగ్గర కూడా ఈ మూవీ మంచి హిట్ కావడం పక్కా అని తెలుస్తోంది

ఈ సినిమాను డైరెక్టర్ చిదంబరం రూ.20 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ గుణ గుహల్లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీశారు. ఈ మూవీలో సౌబిన్‌ షాహిర్‌, శ్రీనాథ్‌ భసి, బాలు వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్‌, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్‌ పరంబోల్‌, షెబిన్ బెన్సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.