ఒసామా బిన్ లాడెన్‌కు మనోజ్ కుమార్‌కు మధ్య సంబంధం ఏంటో తెలుసా ?
బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ కుమార్ 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
By: Tupaki Desk | 4 April 2025 6:30 AMబాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ కుమార్ 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే మనోజ్ కుమార్ కు పాకిస్థాన్ లోని ఒక ప్రత్యేక నగరంతో అనుబంధం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా మట్టుబెట్టిన నగరం అదే. ఆ కథేంటో ఈ వార్తలో తెలుసుకుందాం.
మనోజ్ కుమార్ జన్మస్థలం
మనోజ్ కుమార్ 1937 జూలై 24న అబోటాబాద్ లో జన్మించారు. ఈ నగరం ప్రస్తుతం పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ లో ఉంది. పంజాబీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మనోజ్ కుమార్ విభజన బాధను అనుభవించారు. వాస్తవానికి మనోజ్ కుమార్ కు 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే భారతదేశ విభజన జరిగింది. దీంతో దేశం భారతదేశం, పాకిస్థాన్ గా రెండు దేశాలుగా విడిపోయింది. దీంతో మనోజ్ కుమార్ కుటుంబం అబోటాబాద్ ను విడిచిపెట్టి ఢిల్లీకి వచ్చింది.
అబోటాబాద్ నగరం
ఢిల్లీలో మనోజ్ కుమార్ కుటుంబం కింగ్స్ వే క్యాంపులో శరణార్థులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని గురు తేజ్ బహదూర్ నగర్ గా పిలుస్తారు. ప్రారంభంలో మనోజ్ కుమార్ కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంది. అయినప్పటికీ అతను తన చదువును కొనసాగించాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
ఒసామా బిన్ లాడెన్ తో అబోటాబాద్ కు సంబంధం
బ్రిటీష్ పాలనలో అబోటాబాద్ ఒక ముఖ్యమైన సైనిక స్థావరంగా ఉండేది. ఈ నగరాన్ని 1853లో మేజర్ జేమ్స్ అబోట్ పేరు మీద స్థాపించారు. పాకిస్థాన్ లోని ఈ నగరం దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, 2011లో అమెరికా నిర్వహించిన ఆపరేషన్ తో వార్తల్లో నిలిచింది. 2011 మే 2న అమెరికా నేవీ సీల్స్ రహస్య ఆపరేషన్ లో భాగంగా అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను అబోటాబాద్ లోని బిలాల్ టౌన్ ప్రాంతంలో హతమార్చింది. ఒసామా స్థావరం అబోటాబాద్ లోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడం గమనార్హం.
ఒసామాను అమెరికా ఎందుకు అంతమొందించింది?
అమెరికాలో 9/11 ఉగ్రదాడులకు ఒసామా బిన్ లాడెన్ సూత్రధారి. దీంతో అమెరికా 9/11 దాడులకు ప్రతీకారంగా ఒసామాను మట్టుబెట్టింది. అమెరికా ఆపరేషన్ తో అబోటాబాద్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.