'ఆ ఆస్తులన్నీ నాకు అప్పగించండి'.. కలెక్టరేట్ కు మోహన్ బాబు, మనోజ్
టాలీవుడ్ లోని ప్రముఖ ఫ్యామిలీల్లో ఒకటైన మంచు కుటుంబ వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Feb 2025 12:58 PM GMTటాలీవుడ్ లోని ప్రముఖ ఫ్యామిలీల్లో ఒకటైన మంచు కుటుంబ వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇంకా అది ముగియలేదు. మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం.. లేఖలు విడుదల చేయడం.. ఫిర్యాదు చేయడం.. పలు వ్యాఖ్యలు చేయడం.. ఇదంతా కొంతకాలంగా జరుగుతోంది.
అయితే కొద్ది రోజుల క్రితం.. తల్లిదండ్రులు, వృద్ధుల, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు తన ప్రతినిధి ద్వారా లేఖ పంపించారు. బాలాపూర్ మండలం జల్ పల్లిలో తాను నివసిస్తున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని మోహన్ బాబు తన లేఖలో ఆరోపించారు.
ఆస్తులు కావాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. తన నివాసంలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేసి తనకు అప్పగించాలని ఆయన కోరారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసుకుని ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో మోహన్ బాబు వేసిన లేఖ పై ఇటీవల రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్.. నోటీసులు పంపారు.
మోహన్ బాబు, మనోజ్ లకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇటీవల మనోజ్ హాజరై వివరణ ఇచ్చారు. తన లీగల్ టీంతో కలెక్టర్ ను కలిశారు. ఆస్తుల వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. మళ్లీ ఫిబ్రవరి 3వ తేదీ హాజరవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా మోహన్ బాబు, మనోజ్.. జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ లోని జిల్లా సమీకృత కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం మోహన్ బాబు, మనోజ్ వేర్వేరుగా రాగా.. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అయితే తన ఆస్తులను మనోజ్ అక్రమంగా ఆక్రమించారని మోహన్ బాబు కలెక్టర్ తో నేరుగా చెప్పారు.
తన స్వార్జిత ఆస్తిపై ఎవరికి కూడా ఎలాంటి హక్కు లేదని తెలిపారు. అందుకే మనోజ్ తనకు సంబంధించిన ఆస్తులు అప్పగించాలని అన్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఇప్పటికే పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గత ఏడాది మొదలైన మంచు కుటుంబంలో వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.