Begin typing your search above and press return to search.

ఆ రోజుల్లో... వర్మ గొప్పతనం!

ఆ విషయాన్నే తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు మనోజ్ బాజ్‌ఫాయ్‌ చెప్పుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   16 May 2024 2:30 PM GMT
ఆ రోజుల్లో... వర్మ గొప్పతనం!
X

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఇప్పుడు రాజకీయాలు, బూతు చిత్రాలు, వివాదాస్పద సినిమాల వల్ల కొందరి వాడు అయ్యాడు కానీ ఒకప్పుడు వర్మ అందరి వాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా మొదలుకొని ఎన్నో సినిమాలు ఇండియన్ సినీ పరిశ్రమను ఒకానొక సమయంలో శాసించాయి అనడంలో సందేహం లేదు.

ఆ విషయాన్నే తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు మనోజ్ బాజ్‌ఫాయ్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ... బాలీవుడ్‌ తల రాతను మార్చే విధంగా ఎన్నో అద్భుతమైన కల్ట్‌ సినిమాలను అందించాడు వర్మ. బాలీవుడ్‌ ఇండస్ట్రీను నార్త్‌ ఇండియన్ లేదా ముంబై లోకల్‌ గా ఉన్న వారు ఎవరు కూడా మార్చలేదు.

హైదరాబాద్‌ నుంచి వచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ దశ, దిశ ను మార్చేశాడు. వర్మ సింగిల్‌ హ్యాండ్‌ తో మొత్తం బాలీవుడ్‌ స్థితి గతులను మార్చేసి అందరికి షాక్ ఇచ్చాడు. అతడు ఎవ్వరికి భయపడే రకం కాదు. ఇప్పటికి కూడా వర్మ ఎవరికి కూడా భయపడడు అన్నాడు.

మనోజ్ బాజ్‌పాయ్‌ కి పలు అద్భుతమైన పాత్రలను వర్మ తన గత సినిమాల్లో ఇచ్చాడు. కేవలం మనోజ్ కి మాత్రమే కాకుండా బిగ్‌ బి అమితాబచ్చన్‌ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అందుకు కారణం రామ్‌ గోపాల్ వర్మ అంటూ బాలీవుడ్‌ కు చెందిన ప్రతి ఒక్కరు క్షణం ఆలోచించకుండా అంటారు.

అమితాబచ్చన్ కు సెకండ్‌ ఇన్నింగ్స్ లో అద్భుతమైన విజయాలను వర్మ అందించడం వల్లే ఇప్పటికి కూడా ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఆ సమయంలో వర్మ సినిమాలు బిగ్‌ బి కి పడకుంటే ఇప్పటి వరకు ఆయన్ను ఇండియన్‌ సినీ ప్రేక్షకులు మర్చిపోయేవారేమో అని కొందరు అంటూ ఉంటారు.

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వర్మ హడావుడి ఎక్కువ అయ్యింది. అది సినిమాల ద్వారా కాకుండా రాజకీయంగా, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మరో పార్టీ ని వర్మ విమర్శించడం వల్ల కొందరు వాడు అయ్యాడు అని ఆయన అభిమానులు స్వయంగా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వర్మ మునుపటిలా సినిమాలు తీయాలని కోరుకునే ఆయన ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు అనడంలో సందేహం లేదు.