'పసివాడి ప్రాణం' కథనే ఎన్నిసార్లు తిప్పి తీసినా!
ఇటీవలి కొన్నేళ్లుగా అతడు అసాధారణ నటనతో ప్రశంసలు దక్కించుకుంటున్నాడు
By: Tupaki Desk | 31 July 2023 4:36 AM GMTమనోజ్ బాజ్‌పేయి పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ గ్యాంగ్ స్టర్ డ్రామా 'సత్య'తో తెలుగు వారికి సుపరిచితుడైన ప్రముఖ నటుడు. జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కార గ్రహీత. చాలా కాలంగా అత్యుత్తమ నటులలో ఒకరిగా కీర్తిని అందుకుంటున్నారు. అతడు ఆస్వాధిస్తున్న ప్రస్తుత సూపర్ స్టార్‌డమ్‌కు ఈ ప్రయాణం అంత సులువు కాదన్నది సన్నిహితులకు మాత్రమే తెలిసిన నిజం. ఇటీవలి కొన్నేళ్లుగా అతడు అసాధారణ నటనతో ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఫ్యామిలీమ్యాన్ సీజన్ సహా ఇటీవలే విడుదలైన బండా చిత్రంలోను అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు మనోజ్ భాజ్ పాయ్. ఇంతలోనే అతడి కృషి- హార్డ్ వర్క్ కి తగిన గుర్తింపు దక్కింది. తాజాగా ప్రతిష్ఠాత్మక డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DIFF) లో బాజ్ పాయ్ నటించిన 'జోరామ్'కి పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయి ప్రతిభకు 'ఉత్తమ నటుడు' బిరుదును అందుకున్నాడు.
జోరామ్- పోస్టర్లు విజువల్స్ చూశాక ఇది అవార్డ్ కేటగిరీ సినిమా అని ఇట్టే చెప్పేయొచ్చు. మనోజ్ బాజ్ పాయ్ పూర్తిగా బస్తీ యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. జొరమ్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యం ఉన్న కథాంశం. ఒక వ్యక్తి గతానికి, వర్తమానానికి మధ్య నలిగిపోయే కథ. గతానికి వర్తమానానికి గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగి ఉన్న దర్సు అనే క్లిష్టమైన పాత్రను పోషించానని మనోజ్ బాజ్ పాయ్ తెలిపారు. బయటికి అతను మామూలు మనిషిలా కనిపిస్తాడు. ప్రజలు కూడా దానిని గమనించలేరు. కానీ ఏ విధంగానూ అతడు సామాన్యుడు కాదు! ప్రభావవంతమైన పాత్రలతో కూడిన అద్భుతమైన చిత్రమిదని అతడు తెలిపాడు.
'జోరామ్' అనేది ఒక సామాన్యుడు తన రక్తసంబంధాన్ని బిడ్డను కాపాడుకోవడానికి అన్ని అడ్డంకులను ఎలా అధిగమించాడనే ఒక గంభీరమైన కథతో తెరకెక్కింది. భారతీయ సినీపరిశ్రమలకు ఈ కథాంశం కొత్తేమీ కాదు. ఇప్పటికే సుపరిచితమైన ఒక అందమైన కథను ఇలాంటి పురస్కారానికి ఎంపిక చేయడం ఆసక్తికరమని మనోజ్ అన్నారు. ఫెస్టివల్ సర్క్యూట్‌లో జోరామ్ కి ప్రశంసలు కురిసాయి. మనోజ్ అనేక వర్గాల నుండి ప్రశంసలు పొందాడు. అతని తరంలోని అత్యుత్తమ నటులలో ఒకరిగా కీర్తిని పొందారు.
ఇది అతడి కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా పేరొచ్చింది. మనోజ్ భాజ్ పాయ్ నటించిన ఇటీవలి చిత్రం 'బండా' కూడా ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. పాపులర్ భారతీయ దేవత తరపున కోర్టులో వాదించే న్యాయవాది పాత్రను మనోజ్ ఇందులో పోషించాడు. అతడు పోషించే విలక్షణమైన పాత్రలు తన స్థాయిని ప్రతిసారీ ఎలివేట్ చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
చిరు నటించిన క్లాసిక్ సినిమాతో పోలిక:
తల్లిదండ్రులను కోల్పోయిన ఒక పసివాడి ప్రాణాల్ని రక్షించుకునేందుకు విలన్ల గ్యాంగ్ ని ఎదురించేవాడిగా.. పసివాడిపై కుట్రలను ఛేధించే అంగరక్షకుడిగా సుప్రీంహీరో చిరంజీవి 'పసివాడి ప్రాణం'(1987) చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి, విజయశాంతి, సుమలత ముఖ్యపాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ లో రూపొంది నాటి యువతరం ఫ్యామిలీ ఆడియెన్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే 'పసివాడి ప్రాణం' కథాంశం స్ఫూర్తితోనే భజరంగి భాయిజాన్ కథను అల్లారు మేటి రచయిత విజయేంద్ర ప్రసాద్. ఒక చిన్నారికి అండగా నిలిచే భాయిజాన్ (సల్మాన్) కథేమిటన్నది తెరపై ఉత్కంఠగా చూపించారు. హిందీ ఆడియెన్ దృష్టి కోణానికి చేరువగా.. ఇండియా పాక్ బార్డర్ నేపథ్యానికి కథను ఎంతో ఉద్విగ్నభరితంగా మార్చడంలో విజయేంద్రుడు సఫలీకృతం అయ్యారు.
ఇప్పుడు మనోజ్ భాజ్ పాయ్ నటించిన 'జోరామ్' కథ ఒక పసికందు చుట్టూ తిరుగుతుంది. ఆ పసివాడిని రక్షించే క్రమంలో కథానాయకుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నదే కథాంశం. అయితే ఇందులో మనోజ్ సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడు అంటూ తెలియజేసాడు. అదేమిటో తెరపైనే చూడాలి.