కెరీర్ 100వ చిత్రం.. ఈ ఫలితం ఊహించలేదే!
'ఫ్యామిలీమ్యాన్' స్టార్ గా అందరి హృదయాల్లో నిలిచిన మనోజ్ కెరీర్‌లో 100వ చిత్రం కావడంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
By: Tupaki Desk | 31 May 2024 7:03 AM GMTజేడి చక్రవర్తి 'సత్య', అల్లు అర్జున్ 'హ్యాపీ' చిత్రాల్లో మనోజ్ భాజ్ పాయ్ నటించిన పాత్రలను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో మనోజ్ కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌తో అతడు ల్యాండ్ మార్క్ హీరో అయ్యాడు. ఇటీవల అతడు సోలో లీడ్‌గా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. సీనియర్ నటుడు మనోజ్ అవార్డ్ స్థాయి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే అతడు నటించిన భయ్యాజీ బాక్సాఫీస్ రిపోర్ట్ తీవ్రంగా నిరాశపరిచింది.
మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన రివెంజ్ డ్రామా 'భయ్యా జీ' ఈ శుక్రవారం విడుదలై మిశ్రమ సమీక్షలను పొందింది. 'ఫ్యామిలీమ్యాన్' స్టార్ గా అందరి హృదయాల్లో నిలిచిన మనోజ్ కెరీర్‌లో 100వ చిత్రం కావడంతో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ భయ్యాజీ దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా ప్రారంభమైంది. ఇప్పటికి ఈ చిత్రం దాదాపుగా థియేటర్లలో మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్సా ఫ్లాపా? అనేది నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది.
భయ్యా జీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. సాన్‌సిల్క్ ప్రకారం 'భయ్యా జీ' తొలి వారం ఓ మోస్తరు వసూళ్లను మాత్రమే సాధించింది. ప్రారంభ రోజు (శుక్రవారం) రూ. 1.35 కోట్లు నిరాశాజనకమైన ప్రారంభం తర్వాత, సినిమా వారాంతంలో బాక్సాఫీస్ వద్ద స్వల్ప వృద్ధిని సాధించింది. శనివారం రూ. 1.75 కోట్లు.. ఆదివారం రూ. 1.90 కోట్లు సంపాదించింది. నిరాశాజనకమైన వారాంతం తర్వాత, ఈ చిత్రం సోమవారం భారీ డ్రాప్స్ ను చవిచూసింది, కేవలం రూ. 0.90 కోట్లు (90 లక్షలు) మాత్రమే సంపాదించింది. ఈ చిత్రం మంగళవారం మరింత పడిపోయి రూ. 0.85 కోట్లు (85 లక్షలు) .. బుధవారం రూ. 0.77 కోట్లు (77 లక్షలు) సంపాదించింది. యాక్షన్ క్రైమ్ డ్రామా ఇప్పుడు దేశీయ మొత్తం కలెక్షన్లు రూ. 7.49 కోట్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా. 8.22 కోట్లు మాత్రమే ఆర్జించింది.
'భయ్యా జీ' హిట్ లేదా ఫ్లాప్?
మనోజ్ బాజ్‌పేయి నటించిన బాలీవుడ్ యాక్షన్ క్రైమ్ డ్రామా 'భయ్యా జీ' బాక్సాఫీస్ వద్ద పేలవమైన ఓపెనింగ్ సాధించింది. ఇది వారాంతంలో కనిష్ట వృద్ధిని చవిచూసింది. వారం రోజులలో మరింతగా క్షీణించింది. మొదటి వారం తర్వాత కూడా ఈ చిత్రం రూ.10 కోట్ల మార్కును అధిగమించలేకపోయింది. బాక్సాఫీస్ వసూళ్లలో స్థిరమైన తగ్గుదల కనిపిస్తోంది. 20 కోట్ల రేంజులో బడ్జెట్ ని వెచ్చించగా.. భయ్యా జీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. బాక్సాఫీస్ పనితీరు ఆధారంగా ఇది స్పష్టమైన బాక్సాఫీస్ వైఫల్యంగా నిలిచిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
పాత కథనే కొత్తగా తిప్పి తీసాడు!
అయితే ఈ సినిమా కథ ఇప్పుడే కొత్త కాదు. తమ్ముడిని యాక్సిడెంట్ కి గురి చేసి చంపేసిన విలన్ ని అంతమొందించేందుకు ఒక అన్నయ్య చేసే పోరాటం ఎలాంటిది? అన్నది దిగ్ధర్శకులు ఎందరో తెరపై అద్భుతంగా చూపించేసారు. ఇప్పుడు నగరంలో చదువుకుంటున్న తన తమ్ముడిని చంపేసిన విలన్ భరతం పట్టేవాడిగా మనోజ్ నటించాడు. ప్రతీకార డ్రామాలో భయ్యాజీ లో షేడ్స్ ఏమిటన్నది తెరపై చూపించారు. ప్రథమార్థం ఆకట్టుకున్నా ద్వితీయార్థం పూర్తిగా ఫెయిలైందని విమర్శలొచ్చాయి. దర్శకుడు అపూర్వ్ సింగ్ వైపే అన్నివేళ్లు చూపిస్తున్నాయి.