మనోళ్లు ఉస్సూరుమంటే.. వాళ్లు ఊగిపోతున్నారు
రజినీ స్క్రీన్ ప్రెజెన్స్.. ఆయన పాత్ర గురించి అక్కడి వాళ్లు ఒక రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్నారు.
By: Tupaki Desk | 10 Feb 2024 4:30 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజవుతుంటే మామూలుగా ఉండే హంగామానే వేరు. కానీ ‘లాల్ సలాం’ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. గత మూడు దశాబ్దాల్లో ఇంత తక్కువ హైప్‌తో రిలీజైన రజినీ సినిమా ఇంకొకటి లేకపోవచ్చు. రజినీకాంత్ పూర్తి స్థాయి పాత్ర చేయకపోవడం లో బజ్ ఒక కారణమే కానీ.. ఈ సినిమా టైటిల్‌తో ప్రోమోలేవీ అంతగా ఎగ్జైట్ చేయలేదన్నది వాస్తవం. శుక్రవారం విడుదలైన సినిమాకు తమిళంలో టాక్ ఒకలా ఉంటే.. తెలుగులో ఇంకోలా ఉంది. తమిళంలో చాలా వరకు ‘లాల్ సలాం’కు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఉదయం థియేటర్లు అనుకున్నంత స్థాయిలో కళకళలాడలేదు. హౌస్ ఫుల్స్ కూడా పడలేదు. కానీ అక్కడ రివ్యూలన్నీ పాజిటివ్‌గానే వచ్చాయి. రజినీ స్క్రీన్ ప్రెజెన్స్.. ఆయన పాత్ర గురించి అక్కడి వాళ్లు ఒక రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్నారు.
దీంతో సాయంత్రానికి ‘లాల్ సలాం’ తమిళ వెర్షన్ పుంజుకుంది. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ‘లాల్ సలాం’కు తమిళంలో పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. తమిళ నేటివిటీ, కల్చర్‌తో ముడిపడ్డ సినిమా కావడంతో అక్కడి వాళ్లు ‘లాల్ సలాం’తో బాగానే కనెక్ట్ అవుతున్నారు. తెలుగు వెర్షన్ విషయంలో దీనికి పూర్తి భిన్నమైన స్పందన కనిపిస్తోంది. రజినీ సినిమా అంటే ఎగబడే తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మార్నింగ్ షోలు ఎక్కడా సగం కూడా నిండిన పరిస్థితి కనిపించడం లేదు. చాలా తక్కువ ఆక్యుపెన్సీలతో నడిచాయి థియేటర్లు. ఇక ఇక్కడ టాక్ కూడా బాలేదు. రివ్యూలు కూడా నెగెటివ్‌గానే వచ్చాయి. మనది కాని కథలా అనిపించడం.. రజినీ నుంచి అభిమానులు ఆశించే ఫైర్ వర్క్స్ లేకపోవడం మైనస్ అయింది. తమిళ నేటివిటీ బాగా దట్టించేయడంతో ‘లాల్ సలాం’ మనవాళ్లకు ఏమాత్రం రుచించేలా లేదు. తెలుగులో అయితే ఇది డిజాస్టర్ అనడంలో సందేహం లేదు.