దావా వేయాల్సింది మన్సూర్ కాదు త్రిష: మద్రాసు హైకోర్టు
బహిరంగ ప్రదేశంలో కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతూ నటుడు మన్సూర్ అలీఖాన్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు వేసింది
By: Tupaki Desk | 12 Dec 2023 5:32 AM GMTబహిరంగ ప్రదేశంలో కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతూ నటుడు మన్సూర్ అలీఖాన్ కు మద్రాస్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆ మేరకు సోమవారం నాడు కోర్ట్ హెచ్చరికలు సినీవర్గాల్లో చర్చకు తెర లేపాయి. మన్సూర్ అసంబద్ధమైన అలవాటైన వివాదాస్పద వ్యాఖ్యలు సరికాదంటూ కోర్టు మండిపడింది. సోమవారం నాడు నటి త్రిష, ఖుష్బు నటుడు చిరంజీవిపై దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణకు రాగా.. జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ ''వాస్తవానికి, ఇది నటి త్రిష దాఖలు చేయాల్సింది! మీరు ఎందుకు దాఖలు చేశారు? 'అంటూ మన్సూర్‌ని న్యాయమూర్తి ప్రశ్నించారు.
చాలా మంది వ్యక్తులు నటీనటులను తమ రోల్ మోడల్‌గా ఆరాధిస్తారు కాబట్టి అతడు బహిరంగ ప్రదేశంలో ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు.. మాట్లాడేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి! అని న్యాయమూర్తి అన్నారు. ఇతరులపై అవాంఛనీయ వ్యాఖ్యలు తరచుగా చేస్తున్నందున మన్సూర్ కి న్యాయమూర్తి మొట్టికాయలు వేసారు. మీడియాతో తరచుగా మాట్లాడటం.. కోర్టు వివాదం తప్ప వేరే పని లేదా? అని న్యాయమూర్తి అడిగారు. త్రిషను టార్గెట్ చేసినందుకు తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు నుండి తప్పించుకున్నందుకు మన్సూర్ అలీ ఖాన్ త్రిషకు బేషరతుగా క్షమాపణలు చెప్పారా? అని కూడా న్యాయమూర్తి ఈ సందర్భంలో ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇతరుల గౌరవాన్ని కాపాడాలని .. అతడు పబ్లిక్‌లో ఏ వ్యాఖ్యలు చేస్తున్నాడో తెలుసుకోవాలని మన్సూర్ కి మీరు సలహా ఇవ్వాలని అతడి తరపు న్యాయవాదికి జడ్జి గారు సూచించారు.
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా సందేశాలు పెట్టి తన ఇమేజ్‌కి చెడ్డపేరు తెచ్చినందుకు ప్రతి ఒక్కరి నుండి కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ మన్సూర్ అలీఖాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ త్రిష, ఖుష్బు, చిరంజీవిలకు న్యాయమూర్తి నోటీసు ఇచ్చారు. పిటిషన్ తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.
లియో కోస్టార్ త్రిషపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడంతో మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఇబ్బందుల్లో పడ్డాడు. పెద్ద ఎత్తున అతడు విమర్శలు ఎదుర్కొన్నాడు. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదనంతరం అతడు త్రిషకు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు.. కానీ తర్వాత వెనక్కి తగ్గాడు. తన సందేశాన్ని క్షమాపణగా తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు.