Begin typing your search above and press return to search.

మార్చి 2025: పోటీ లేని రిలీజ్ లైనప్.. హిట్ టాక్ వస్తే జాక్‌పాట్!

ఈ ఏడాది వేసవి సీజన్‌ను మార్చి నెలతోనే సినిమాలు వేడెక్కించబోతున్నాయి. అగ్రహీరోల చిత్రాలతో పాటు, అనువాద చిత్రాలు, మల్టీజానర్ మూవీలతో ప్యాక్డ్‌గా ఉంది.

By:  Tupaki Desk   |   1 March 2025 7:30 AM GMT
మార్చి 2025: పోటీ లేని రిలీజ్ లైనప్.. హిట్ టాక్ వస్తే జాక్‌పాట్!
X

ఈ ఏడాది వేసవి సీజన్‌ను మార్చి నెలతోనే సినిమాలు వేడెక్కించబోతున్నాయి. అగ్రహీరోల చిత్రాలతో పాటు, అనువాద చిత్రాలు, మల్టీజానర్ మూవీలతో ప్యాక్డ్‌గా ఉంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కువగా సినిమాలు పోటీ లేకుండా కాస్త గ్యాప్ ఇచ్చి విడుదలవుతుండటమే. మంచి టాక్ వస్తే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మహిళా దినోత్సవానికి ముందు రోజు మార్చి 7న పెద్ద సంఖ్యలో సినిమాలు థియేటర్లకు రాబోతున్నాయి. మహిళా సాధికారతను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన నారి: ది విమెన్ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుంది. అదేరోజు త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా రూపొందిన జిగేల్ మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ రెండు చిత్రాలతో పాటు బాలీవుడ్‌ బిగ్ బడ్జెట్ మూవీ ఛావా తెలుగులో అనువాదమై విడుదలవుతోంది. విక్కీ కౌశల్, రష్మిక మంధాన నటించిన ఈ సినిమా, శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కింది.

అదేరోజు హారర్ థ్రిల్లర్‌ కింగ్‌స్టన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా సముద్రం నేపథ్యంలో కొత్త కంటెంట్‌తో రాబోతున్నట్టు ట్రైలర్ కనిపిస్తోంది. అలాగే మలయాళం నుంచి ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ అనే థ్రిల్లర్ కూడా అదేరోజు రిలీజవుతోంది.

మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని, మార్చి 14న మళ్లీ సినిమాల జోరు మొదలవుతుంది. నాని సమర్పణలో వస్తున్న కోర్ట్ సినిమాలో ప్రియదర్శి, హర్ష్‌ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా పోక్సో చట్టంపై అవగాహన కల్పించేలా ఉండనుంది. అదేరోజు కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రేమకథా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. అదేరోజు జాన్ అబ్రహాం హీరోగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ ది డిప్లొమాట్ కూడా విడుదల కానుంది.

మొదటి రెండు వారాల్లో భారీ రిలీజ్‌లు ఉన్నప్పటికీ, మూడో వారం మాత్రం ఎక్కువగా మాస్ ఆడియన్స్‌ ను టార్గెట్ చేసే సినిమాలు ఉన్నాయనే చెప్పాలి. మార్చి 27న విక్రమ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ వీర ధీర శూరన్ 2 విడుదల కానుంది. అదేరోజు మలయాళ బిగ్ బడ్జెట్ మూవీ ఎల్ 2: ఎంపురాన్ విడుదల అవుతోంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్.

మార్చి చివరి వారంలో మిగిలిన రెండు సినిమాలు ప్రధానంగా హైలైట్ కానున్నాయి. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందిన రాబిన్ హుడ్ ఈ నెల 28న థియేటర్లకు రాబోతోంది. అదేరోజు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 కూడా విడుదల కానుందని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ తాజా బజ్ ప్రకారం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

పవన్ సినిమా రాకపోతే అదేరోజు మ్యాడ్ టీమ్ సీక్వెల్‌తో రానున్నట్లు నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. వీరమల్లు రాదని క్లారిటీ వచ్చాకే ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంగీత్‌ శోభన్, నార్నె నితిన్, రామ్‌ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందించనుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈసారి మార్చిలో రిలీజ్‌ లైనప్ చూస్తే పోటీ ఎక్కువగా లేకుండా, సినిమాలు ఒక్కోవారం వరుసగా రావడం గమనార్హం. అంటే హిట్ టాక్ వస్తే, నిర్మాతలు, హీరోలకు కాసుల వర్షం ఖాయం. మరి ఏ సినిమాలు హిట్ అవుతాయో, ఏవి డిజాస్టర్ అవుతాయో వేచి చూడాలి.