మార్కో... మరీ హింసాత్మకం బాబోయ్
అవి కూడా ఏ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
By: Tupaki Desk | 18 Dec 2024 12:30 AM GMTప్రస్తుతం ప్రేక్షకులు రొమాంటిక్ సినిమాలను, హింసాత్మక సినిమాలను ఎక్కువగా ఆధరిస్తున్నారు. గతంలో మాదిరిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలను, కామెడీ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. హర్రర్ సినిమాలకు వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతున్న కాలం ఇది. స్త్రీ 2 సినిమా రూ.800+ కోట్ల వసూళ్లు సొంతం చేసుకోగా, అత్యధిక హింసాత్మక సినిమాగా పేరు సొంతం చేసుకున్న యానిమల్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. కేజీఎఫ్, సలార్‌లు సైతం శృతి మించిన హింసతో ఉంటాయి. అవి కూడా ఏ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు అతే జోనర్‌లో 'మార్కో' అనే మలయాళ మూవీ రాబోతుంది. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ దర్శకత్వంలో రూపొందిన మార్కో సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట మలయాళంలో మాత్రమే విడుదల కాబోతున్న ఈ సినిమాను వచ్చిన టాక్‌ను బట్టి ఇతర భాషల్లోనూ డబ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హింసాత్మక సినిమాలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది కొందరి అభిప్రాయం.
ఇటీవల వచ్చిన సెన్సార్ టాక్ చూస్తూ ఉంటే మార్కో సినిమా మరో యానిమల్, కేజీఎఫ్, సలార్ రేంజ్ సినిమా యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉంటుంది అనిపిస్తుంది. ఈమధ్య కాలంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమాలను నార్త్ ఇండియా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కనుక హిందీలో మార్కో సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వెంటనే అంటే వారం రోజుల లోపులోనే అన్ని భాషల్లోనూ విడుదల చేసే విధంగా ప్లాన్ బి రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్ సినిమాలు ఎక్కువగా వస్తాయి. కానీ మార్కో మాత్రం చాలా విభిన్నంగా హింసాత్మక సినిమాగా రాబోతుంది. మలయాళ ప్రేక్షకులు ఈ సినిమాలోని హింసను చూసి షాక్ అవుతారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న ఉన్ని ముకుందన్ ఈ సినిమాను చేయడం ద్వారా మరింతగా మంచి ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. మార్కో సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించబోతున్న ఫలితం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.