Begin typing your search above and press return to search.

'మార్క్ ఆంటోనీ' మూవీ రివ్యూ

మార్క్ (విశాల్) ఒక గ్యారేజీ నడుపుకునే మెకానిక్. అతడికి చనిపోయిన తన తండ్రి ఆంటోనీ (విశాల్) అంటే అస్సలు పడదు. తన తల్లిని చంపడమే కాక అనేక పాపాలు చేసి హత్యకు గురైన ఆంటోనీ మీద ద్వేషంతో రగిలిపోతుంటాడు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 1:16 PM GMT
మార్క్ ఆంటోనీ మూవీ రివ్యూ
X

'మార్క్ ఆంటోనీ' మూవీ రివ్యూ

నటీనటులు: విశాల్-ఎస్.జె.సూర్య-సునీల్-రీతూ వర్మ-అభినయ-సెల్వ రాఘవన్ తదితరులు

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం

నిర్మాత: వినోద్ కుమార్

రచన-దర్శకత్వం: ఆదిక్ రవిచంద్రన్

అనువాద చిత్రాలతో ఒకప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ కలిగి ఉండేవాడు తమిళ కథానాయకుడు విశాల్. ఐతే గత కొన్నేళ్లలో అతడి సినిమాలు వరుసగా నిరాశ పరిచాయి. ఐతే విశాల్ కొత్త సినిమా 'మార్క్ ఆంటోనీ' మాత్రం క్రేజీ ట్రైలర్ తో ప్రేక్షకులతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: మార్క్ (విశాల్) ఒక గ్యారేజీ నడుపుకునే మెకానిక్. అతడికి చనిపోయిన తన తండ్రి ఆంటోనీ (విశాల్) అంటే అస్సలు పడదు. తన తల్లిని చంపడమే కాక అనేక పాపాలు చేసి హత్యకు గురైన ఆంటోనీ మీద ద్వేషంతో రగిలిపోతుంటాడు. ఆంటోనీ స్నేహితుడు.. తనను కొడుకులా చూసుకునే జాకీ మార్తాండ (ఎస్.జె.సూర్య)ను తండ్రిలా గౌరవిస్తాడు. జాకీ కూడా తన కొడుకు మదన్ కంటే మార్క్ ను ఎక్కువ అభిమానిస్తాడు. ఐతే అనుకోకుండా గతంలోని మనుషులతో మాట్లాడే ఒక ఫోన్ మార్క్ కు దొరగ్గా.. దాని ద్వారా తన తండ్రి కాలంలోని వాళ్లతో ఫోన్ కాల్స్ మాట్లాడిన మార్క్ కు అనేక సంచలన విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి.. దాని వల్ల మార్క్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: విశాల్ అంటే రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ అతను కొంచెం వెరైటీగా కూడా ట్రై చేసేవాడు ఒకప్పుడు. పల్నాడు, ఇంద్రుడు, అభిమన్యుడు లాంటి సినిమాల్లో అతను మాస్ వినోదాన్నందిస్తూనే ప్రేక్షకులకు కొత్తదనం కూడా పంచాడు. కానీ కొన్నేళ్ల నుంచి మాత్రం మరీ మూస సినిమాలు చేసి విసుగెత్తించేస్తున్నాడు. కానీ ‘మార్క్ ఆంటోనీ’ అత‌డి గ‌త చిత్రాల నుంచి భిన్నంగా క‌నిపిస్తుంది. ఒక ఫోన్ ద్వారా వేర్వేరు కాలాల్లోని మనుషులు మాట్లాడుకోవడం.. గతంలో జరిగిన సంఘటలన్ని మార్చే ప్రయత్నం చేయడం.. ఈ లైన్లో సినిమాలు కొత్తేమీ కాదు కానీ.. ‘మార్క్ ఆంటోనీ’ ఈ కాన్సెప్ట్ ను వినోదం కోసం బాగానే వాడుకుంది. ప్లే బ్యాక్.. ఒకే ఒక జీవితం సహా చాలా సినిమాల్లో ఫోన్-టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ చూశాం కానీ.. అవి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తూ.. ఎంటర్టైన్మెంట్ విషయంలో ఒక స్థాయిని మించలేకపోయాయి. ‘మార్క్ ఆంటోనీ’లో ఎంట‌ర్టైన్మెంట్ డోస్ బాగానే ఇచ్చారు. కాక‌పోతే న‌రేష‌న్ మ‌రీ లౌడ్ గా సాగ‌డం.. రెండున్న‌ర గంట‌ల పాటు మ్యూజిక్ స‌హా అన్నీ హై పిచ్ లో సాగ‌డం ఇరిటేట్ చేస్తుంది. ఆ న‌రేష‌న్ స్టైల్ వ‌ల్లే మార్క్ ఆంటోనీ ఒక స్థాయిని మించి ఎంట‌ర్టైన్ చేయ‌లేక‌పోయింది.

ఎస్.జె.సూర్య లాంటి విలక్షణ నటుడిని ఈ కథలోకి తీసుకురావడం దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంబంధించి తీసుకున్న ఉత్తమ నిర్ణయం. పేరుకు విలనే కానీ.. సినిమాను నడిపించడంలో అతడికి ‘హీరో’ను మించిన పాత్రే. ఒక క్రేజీ ఆలోచనకు.. ఒక క్రేజీ నటుడు తోడైతే ఎలా ఉంటుందో ‘మార్క్ ఆంటోనీ’లో చూడొచ్చు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సూర్య చెడుగుడు ఆడేశాడు. ఆల్రెడీ ‘మానాడు’ సినిమాలో ఇంచుమించు ఇలాంటి క్రేజీ కాన్సెప్ట్ లోనే న‌టించిన అనుభ‌వం ఉండ‌టం.. ద‌ర్శ‌కుడు త‌న పాత్ర‌కు.. న‌ట‌న‌కు ఎలాంటి హ‌ద్దులు పెట్ట‌క‌పోవ‌డంతో అత‌ను విచిత్ర విన్యాసాలు ఎన్నో చేశాడు. క్రేజీగా సాగే త‌న పాత్ర‌.. న‌ట‌న‌.. హావ‌భావాలు.. సూర్య‌తో ముడిప‌డ్డ కామెడీ సీన్లు మార్క్ ఆంటోనీని సేవ్ చేశాయి. మానాడులో మాదిరే ‘మార్క్ ఆంటోనీ’లో సైతం హీరో మీద‌ సూర్యదే డామినేషన్ అంతా. కాలంలో వెనక్కి వెళ్లి జరిగిన సంఘటలను మార్చే క్రమంలో ఒకే రకమైన సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపించ‌డం మైన‌స్సే అయినా వాటిని వీలైనంత మేర ఎంట‌ర్టైనింగ్ గా మ‌లిచాడు దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంటేనే అలాంటి సినిమాల్లో ఒక క్లాస్ టచ్ కనిపిస్తుంది. కానీ ‘మార్క్ ఆంటోనీ’ మాత్రం ఫుల్ మాస్ స్టయిల్లో నడుస్తుంది. గ్యాంగ్ స్టర్ కథలో ఈ కాన్సెప్ట్ ను చొప్పించి క్రేజీగా సన్నివేశాలు రాసుకున్నాడు ఆదిక్. ఐతే కథలోకి ఈ ఫోన్ కాన్సెప్ట్ వచ్చే వరకు మాత్రం ‘మార్క్ ఆంటోనీ’ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. నరేషన్ మరీ లౌడ్ గా.. గందరగోళంగా అనిపించడంతో ఆరంభంలో ‘మార్క్ ఆంటోనీ’తో కనెక్ట్ కావడం కష్టమే అనిపిస్తుంది. కానీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మొదలయ్యాక ‘మార్క్ ఆంటోనీ’ నడత మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి ‘మార్క్ ఆంటోనీ’ మీద ఇంప్రెష‌న్ మారుతుంది. ద్వితీయార్ధంలో సూర్య మీద న‌డిపిన కామెడీ సీన్లు.. క‌థ‌లోని ట్విస్టులు వ‌ర్కువుట‌య్యాయి. ట్రైలర్లో అందరి దృష్టినీ ఆకర్షించిన సిల్క్ స్మిత ఎపిసోడ్ సినిమాలో భలేగా పేలింది. కానీ ఆరంభం నుంచి విప‌రీత‌మైన హ‌డావుడి.. గంద‌ర‌గోళం మ‌ధ్య స‌న్నివేశాలు చూసి చూసి ఒక ద‌శ త‌ర్వాత ఇరిటేష‌న్ వ‌స్తుంది. స‌న్నివేశాల్లో అతికి తోడు.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అతిగా అనిపించి కొంచెం త‌ల‌పోటు రావ‌డం ఖాయం. టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంటేనే లాజిక్ పక్కన పెట్టేయాలి కాబట్టి.. సినిమాను ఎక్కడా ఆ దృష్టితో చూడకూడదు. అలా ఆలోచిస్తే మధ్యలోనే స్ట్రక్ అయిపోతాం. దర్శకుడు కావాల్సినంత లిబర్టీ తీసుకుని సన్నివేశాలను క్రేజీగా మలిచాడు. ప్రథమార్ధం ఇంకొంచెం ఆసక్తికరంగా ఉండి.. నరేషన్లో కొంచెం కుదురుగా సాగి.. గందరగోళం తగ్గించి ఉంటే ‘మార్క్ ఆంటోనీ’ మంచి స్థాయిలో ఉండేది. కొంచెం కొత్తగా.. క్రేజీగా నడిచే సినిమాలను ఇష్టపడేవాళ్లకు ‘మార్క్ ఆంటోనీ’ నచ్చుతుంది కానీ.. ఇందులోని లౌడ్ నెస్ మాత్రం ఒక హెచ్చ‌రికే.

నటీనటులు: విశాల్ చాన్నాళ్ల తర్వాత తన సినిమాలో.. పాత్రలో వైవిధ్యం చూపించాడు. వయసు పెరగడం.. ఫిట్నెస్ తగ్గడం వల్ల యువకుడి పాత్రలో అతణ్ని చూడటం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ వింటేజ్ క్యారెక్టర్లో మాత్రం అతను ఆక‌ట్టుకున్నాడు. ఆ పాత్రతో బాగా కనెక్ట్ అవుతాం. చివర్లో ముసలి అవతాంలో విశాల్ ఇచ్చిన పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. ఐతే విశాల్ ను మించి ఈ సినిమాలో హైలైట్ అయింది మాత్రం ఎస్.జె.సూర్యనే. సరిగ్గా వాడుకుంటే సూర్య ఏం చేయగలడో ఈ సినిమాలో చూడొచ్చు. తన ఇమేజ్ కు తగ్గ క్రేజీ క్యారెక్టర్ ఇవ్వడం.. అందులో చాలా వేరియేషన్లు ఉండటం.. లుక్స్ పరంగా కూడా వైవిధ్యం చూపించడానికి అవకాశం రావడంతో సూర్య చెలరేగిపోయాడు. అతడితో కనెక్ట్ అయితే ‘మార్క్ ఆంటోనీ’ ఫుల్ పైసా వసూల్ అనిపిస్తుంది. హీరోయిన్లు రీతూ వర్మ.. అభినయల పాత్రలక ప్రాధాన్యం తక్కువే. వాళ్లు ఉన్నంతలో బాగానే చేశారు. సునీల్ కు కథలో కొంచెం కీలకమైన పాత్రే దక్కింది. దానికి అతను న్యాయం చేశాడు. దర్శకుడు సెల్వరాఘవన్ ఒక ప్రత్యేక పాత్రలో మెరిశాడు.

సాంకేతిక వర్గం: కథకు తగ్గట్లే.. సాంకేతిక హంగులు కూడా ఒక సెపరేట్ స్టయిల్లో సాగాయి. జి.వి.ప్రకాష్ కుమార్ తన శైలికి భిన్నంగా.. లౌడ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు ఏమంత ఆకట్టుకోవు కానీ.. బీజీఎం ఓకే. అభినందన్ రామానుజం ఛాయాగ్రహణం బాగా సాగింది. వింటేజ్ వాతావరణాన్ని బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్.. నిర్మాణ విలువలు బాగున్నాయి. రచయిత-దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఎంచుకున్న పాయింటే భిన్నమైంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను అందరూ డీల్ చేసినట్లు అతను చేయలేదు. మాసీగా.. క్రేజీగా కథను నడిపించడానికి ట్రై చేశాడు. నరేషన్ మరీ లౌడ్ కావడం కొంచెం ఇబ్బందే అయినా.. ఎంటర్టైన్మెంట్ విషయంలో అతను మెప్పించాడు.

చివరగా: మార్క్ ఆంటోనీ.. క్రేజీనే కానీ.. టూ లౌడ్


రేటింగ్ - 2.5/5