Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్‌ కి రాజాసాబ్‌ సమర్పణ పైనే ఆశలు!

రాజ్ తరుణ్‌ కథల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలతో పాటు, కొన్ని వ్యక్తిగత విషయాల కారణంగా వరుసగా ఫ్లాప్స్ ను చవిచూడాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 12:30 AM GMT
రాజ్ తరుణ్‌ కి రాజాసాబ్‌ సమర్పణ పైనే ఆశలు!
X

యూట్యూబ్‌ ద్వారా నటుడిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి, విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ద్వారా ఏకంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ లో ఉయ్యాల జంపాల సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో కెరీర్‌ ఆరంభంలో రాజ్ తరుణ్ జోరు మామూలుగా సాగలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున దూసుకు వచ్చాడు. ఒకానొక సమయంలో జూనియర్ మాస్ మహారాజా అనే బిరుదు కూడా రాజ్ తరుణ్ కు ఇవ్వాలి అన్నట్లుగా అతడి ఫ్యాన్స్ మరియు కొందరు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజ్ తరుణ్‌ కథల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలతో పాటు, కొన్ని వ్యక్తిగత విషయాల కారణంగా వరుసగా ఫ్లాప్స్ ను చవిచూడాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో రాజ్‌ తరుణ్ కి హిట్‌ అనేదే లేకుండా పోయింది. ఆ మధ్య నాగార్జున సినిమాలో చేసినా కూడా రాజ్‌ తరుణ్ కి కాలం కలిసి రాలేదు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ పురుషోత్తముడు మరియు తిరగబడరా సామి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో పాటు రాజ్ తరుణ్ ఇలాంటి సినిమాలు ఎందుకు కమిట్‌ అవుతున్నాడు అంటూ అతడిని అభిమానించే వారు కూడా అసహనం వ్యక్తం చేశారు.

ఇన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా రాజ్‌ తరుణ్ కి ఎక్కడో అదృష్టం ఇంకా మిగిలే ఉండటం వల్ల ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆ రెండు ఫ్లాప్ అయినా కూడా రాజ్ తరుణ్ కి భలే ఉన్నాడే అనే సినిమాపై చాలా నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం మారుతి ఆ సినిమా వెనుక ఉండటమే. రాజాసాబ్‌ దర్శకుడు మారుతి ఆ సినిమాను సమర్పిస్తుండటంతో పాటు, కథ మరియు స్క్రీన్‌ ప్లే లో తనదైన ముద్ర వేసినట్లు సమాచారం అందుతోంది. అదే నిజమైతే కచ్చితంగా రాజ్ తరుణ్ కి భలే ఉన్నాడే సినిమా మినిమం హిట్ ను అందించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చిన్న సినిమాల దర్శకుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ, హిట్స్ సొంతం చేసుకుంటూ ప్రస్తుతం ప్రభాస్‌ తో రాజాసాబ్‌ వంటి భారీ సినిమా ను తీసే స్థాయికి మారుతి వచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అందులో చాలా సినిమాలకు తానే కథను అందించడంతో పాటు షాడో దర్శకుడిగా కూడా వర్క్ చేశాడు. అందుకే మారుతి నిర్మాణంలో సినిమా అనగానే కొందరిలో కాకున్నా కొందరిలో అయినా ఆసక్తి ఉంటుంది. మారుతి ఎంతో కొంత ఇన్వాల్వ్‌ అవుతాడు కనుకే భలే ఉన్నాడే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజ్ తరుణ్ కి మారుతి బ్రాండ్ ఇమేజ్ ఏమైనా వర్క్ అయ్యేనా చూడాలి.