Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మారుతినగర్ సుబ్రహ్మణ్యం

క్యారెక్టర్.. విలన్ పాత్రలతో గొప్ప స్థాయిని అందుకున్న విలక్షణ నటుడు రావు రమేష్ ఇప్పుడు హీరో అయ్యారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 9:08 AM GMT
మూవీ రివ్యూ : మారుతినగర్ సుబ్రహ్మణ్యం
X

'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' మూవీ రివ్యూ

నటీనటులు: రావు రమేష్-అంకిత్ కోయ-ఇంద్రజ-రమ్య పసుపులేటి-అజయ్-హర్షవర్ధన్-శివన్నారాయణ-అన్నపూర్ణ-ప్రవీణ్ తదితరులు

సంగీతం: కళ్యాణ్ నాయక్

ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి

నిర్మాతలు: బుజ్జిరాయుడు పెంట్యాల, మోహన్ కార్య

రచన-దర్శకత్వం: లక్ష్మణ్ కార్య

క్యారెక్టర్.. విలన్ పాత్రలతో గొప్ప స్థాయిని అందుకున్న విలక్షణ నటుడు రావు రమేష్ ఇప్పుడు హీరో అయ్యారు. ఆయన లీడ్ రోల్ చేసిన చిత్రం.. మారుతినగర్ సుబ్రహ్మణ్యం. చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తిరుపతి దగ్గర మారుతి నగర్ కాలనీకి చెందిన మధ్య తరగతి వ్యక్తి సుబ్రహ్మణ్యం. అతడికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చినా కోర్టు కేసు వల్ల పెండింగ్ లో పడిపోవడంతో.. ఆ ఉద్యోగం తప్ప ఏదీ చేయనంటూ భీష్మించుకుని ఉండిపోతాడు. ఇలాగే పాతికేళ్లు గడిచిపోతాయి. భార్య (ఇంద్రజ) సంపాదన మీదే అతను జీవితాన్ని లాగిస్తుంటాడు. అతడి టీనేజీ కొడుకు విక్రమ్ (అంకిత్ కోయ) కూడా బాధ్యత లేకుండా తండ్రితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటాడు. తాను చేసిన తప్పులకు సుబ్రహ్మణ్యం.. భార్యతో తిట్లు తింటూ వ్యర్థంగా జీవితాన్ని గడిపేస్తున్న సమయంలో తన అకౌంట్లోకి అనుకోకుండా రూ.10 లక్షలు పడతాయి. దీంతో తన జీవితంలో అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం జీవితం ఎలా ప్రభావితమైంది.. చివరికి అతడి కథ ఎలా సుఖాంతమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'లో కథానాయకుడైన రావు రమేష్ అకౌంట్లోకి అనుకోకుండా ఓ పది లక్షలు పడిపోతాయి. ఆ సమయంలో వేరే ఊర్లో ఉన్న భార్యకు ఫోన్ చేసి నా అకౌంట్లో డబ్బులేశావా అని అడుగుతాడు. ఆమె అవునంటుంది. అవి కూరగాయలు అమ్మే అమ్మాయికి ఇచ్చేయమంటుంది. ఎందుకని అడిగితే.. నెల నెలా కూరలు కొంటాం కద అంటుంది. దీంతో తండ్రీ కొడుకులు కూరలమ్మే అమ్మాయి ముందు కూర్చుని.. మనం కొనే కూరలకు పది లక్షలవుతుందా అంటూ ఆశ్చర్యపోతారు. అంతే కాక పద బ్యాంకుకి నీ డబ్బులు నీకు తీసిస్తాం అంటాడు రావు రమేష్. అప్పుడామె వెయ్యి రూపాయలకి బ్యాంకుకెందుకు? ఫోన్ పే చేస్తే చాలు అంటుంది. దీనికి అవాక్కవుతాడు రావు రమేష్. పాత్ర పరంగా ఆయనెంత వెర్రిబాగులోడైనా కావచ్చు.. కానీ కూరగాయలకు నెలకు పది లక్షలు ఇచ్చేయడానికి రెడీ అయితే చూసేవాళ్లకు అదెంత వెటకారంగా అనిపిస్తుంది. ఇలాంటి సీన్లను కామెడీ అనుకుని ఎలా నవ్వుకోగలం? ఇదొక్కటే కాదు.. 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమాలో ఎటకరాంగా.. ఇల్లాజికల్ గా అనిపించే సీన్లు చాలానే ఉన్నాయి. రావు రమేష్ చేయడం వల్ల సుబ్రహ్మణ్యం పాత్ర కొంచెం పండింది. అక్కడక్కడా కొన్ని నవ్వులూ పండాయి. కానీ షార్ట్ స్టోరీలా అనిపించే ఈ కథను విపరీతంగా సాగదీయడం.. ఇల్లాజికల్ సీన్ల వల్ల 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' ఒక సగటు సినిమా స్థాయిని మించలేకపోయింది.

ఎవరో ఏంటో తెలియకుండా మన అకౌంట్లోకి పది లక్షలు డబ్బులు వేసేస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఏమాత్రం బాధ్యత లేకుండా.. భార్య సంపాదన మీద బతికేస్తున్న ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైతే? ఈ పాయింట్ మీద 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమాను సరదాగా నడిపించాలని చూశాడు రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య. ఐతే ఇది రెండున్నర గంటల నిడివితో ఓ కథను నడిపించడానికి సరిపడా బలం ఈ పాయింట్లో లేకపోయింది. దాని చుట్టూ అల్లిన కొన్ని కామెడీ సీన్లు ఓకే అనిపిస్తాయి తప్ప.. కథ మాత్రం మరీ మందగమనంతో సాగడం.. ఆసక్తికర మలుపులేమీ లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేయడంలో తలపండిన రావు రమేష్.. సినిమా మొత్తాన్ని నడిపించే అలాంటి పాత్ర ఒకటి తగలడంతో తన వంతుగా ఈ చిత్రాన్ని నిలబెట్టడానికి బాగానే కష్టపడ్డాడు. సన్నివేశాలు చాలా వరకు సాధారణంగానే రాసుకున్నా.. రావు రమేష్ పండించిన వినోదం వల్లే అవి కొంత మెరుగుపడ్డాయి. ఐతే కొన్ని సీన్లు మరీ ఇల్లాజికల్ గా సాగడం మాత్రం ప్రేక్షకులను చికాకు పెడుతుంది. పైన చెప్పుకున్న కూరలమ్మాయి సీన్ అందులో ఒకటి. ఇదే విడ్డూరం అంటే.. షాపుల్లోకి వెళ్లి వస్తువులన్నీ కొనేసిన తండ్రీ కొడుకులు మళ్లీ వాళ్లకే తిరిగి ఇచ్చేస్తాం డబ్బులు వెనక్కి ఇవ్వండి అనడం ఇంకా విచిత్రం. ఒకసారి ఓ వ్యక్తి చేతిలో మోసపోయాక కూడా ఇంకోసారి మరో వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఎగనామం పెట్టించుకోవడం ఇంకో విడ్డూరం.

ఏ లాజిక్కులూ లేకుండా నడిచిపోయే 'జాతిరత్నాలు' తరహా కామెడీ అంటే ఓకే కానీ.. ఒక మధ్య తరగతి కుటుంబం.. అందులో బాధలు-బాధ్యతలు అంటూ ఒక సెటప్ చూపించాక తెర మీద పాత్రలు మరీ బాధ్యతారాహిత్యంగా ఉంటూ అల్లరి చేస్తే కామెడీని ఎంజాయ్ చేయడం కష్టం. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'తో ఇదే సమస్య. ఫ్యాక్షన్ సినిమాల్లో విపరీతమైన రక్తపాతం చూపించి చివర్లో శాంతి వచనాలు పలికినట్లు.. ఇందులో కూడా హీరో పాత్రను చాలా బాధ్యతారాహిత్యంగా చూపించి.. చివర్లో ఆ పాత్ర పరివర్తన మాటలు చెప్పిస్తారు. కానీ అవేమంత ఎమోషనల్ గా అనిపించవు. సినిమా ఆరంభంలో కొంచెం హుషారుగా అనిపించినా.. 10 లక్షల డబ్బుల చుట్టూ డ్రామాను విపరీతంగా సాగదీయడం వల్ల రాను రాను ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఈ పది లక్షలు అకౌంట్లో పడడం వెనుక చివర్లో చూపించిన ట్విస్ట్ కొసమెరుపులా అనిపిస్తుంది. ముగింపు సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అనుకున్నంత ఇంపాక్ట్ మాత్రం వేయలేకపోయింది. రావు రమేష్ నటనను ఇష్టపడేవాళ్లు ఆయన్ని ఫుల్ లెంగ్త్ రోల్ లో చూడడానికి.. కొన్ని కామెడీ సీన్ల కోసం ఈ చిత్రంపై ఓ లుక్కేయొచ్చు కానీ.. ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే మాత్రం కష్టం.

నటీనటులు:

రావు రమేష్ నటన గురించి చెప్పేదేముంది? చిన్న పాత్ర చేసినా తనదైన ముద్ర వేస్తారు. 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'లో ప్రధాన పాత్రను బాగానే వాడుకున్నారు. కామెడీతో పాటు భావోద్వేగాలనూ బాగా పండించారు. ఆయన ఇప్పటివరకు ఏ సినిమాలో ఇంత అల్లరి చేసి ఉండరు. ఈ క్రమంలో బాగానే నవ్వించగలిగారు. రావు రమేష్ కొడుకు పాత్రలో అంకిత్ కోయ కూడా బాగానే చేశాడు. తన కామెడీ టైమింగ్ బాగుంది. ఇంద్రజ సీరియస్ పాత్రలో ఆకట్టుకుంది. సోషల్ మీడియా పిచ్చి ఉన్న టీనేజ్ అమ్మాయిగా రమ్య పసుపులేటి ఓకే అనిపించింది. హర్షవర్ధన్.. అజయ్.. ప్రవీణ్.. వీళ్లంతా తమ తమ పరిధిలో బాగానే చేశారు. అన్నపూర్ణమ్మ చిన్న పాత్రలో మెరిసింది.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' ఓ మోస్తరుగా అనిపిస్తుంది. బిట్ సాంగ్స్ తప్ప ఫుల్ లెంగ్త్ పాటలు లేని ఈ సినిమాలో కళ్యాణ్ నాయక్ సంగీతం పర్వాలేదు. తన నేపథ్య సంగీతం యాప్ట్ అనిపిస్తుంది. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం సినిమా నడతకు తగ్గట్లుగా సాగింది. నిర్మాణ విలువలు ఓకే. ఇంతకుముందు 'హ్యాపీ వెడ్డింగ్' సీరియస్ లవ్ స్టోరీ తీసిన లక్ష్మణ్ కార్య.. ఈసారి కామెడీ టచ్ ఉన్న కథను ఎంచుకున్నాడు. రావు రమేష్ లాంటి నటుడిని పెట్టి ఓ మధ్య తరగతి కథను చెప్పాలన్న ఆలోచన బాగుంది. కానీ అతను మరీ తక్కువ పరిధి ఉన్న కథను ఎంచుకున్నాడు. రెండున్నర గంటల పాటు కథా విస్తరణ చేయదగ్గ బలమైన పాయింట్ ఇందులో లేకపోయింది. కామెడీని బాగానే డీల్ చేయగలిగాడు కానీ.. ఆసక్తికర కథనం రాసుకోకపోవడంతో లక్ష్మణ్ కార్య అనుకున్న స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయాడు.

చివరగా: మారుతినగర్ సుబ్రహ్మణ్యం.. కొన్ని నవ్వుల కోసం

రేటింగ్- 2.5/5