Begin typing your search above and press return to search.

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్ హిలేరియ‌స్

అవ‌కాశం వ‌స్తే చూపిస్తాం! అంటూ ఇంత‌కుముందు ప్రీటీజ‌ర్ లో చెప్పాడు రావు ర‌మేష్.

By:  Tupaki Desk   |   29 July 2024 4:54 AM GMT
మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్ హిలేరియ‌స్
X

అవ‌కాశం వ‌స్తే చూపిస్తాం! అంటూ ఇంత‌కుముందు ప్రీటీజ‌ర్ లో చెప్పాడు రావు ర‌మేష్. ఇప్పుడు అవ‌కాశం వ‌చ్చింది.. చూపించాడు. అస‌లు హిలేరియ‌స్ కామెడీకి డెఫినిష‌న్ అంటే ఏమిటో ఈ సీనియ‌ర్ న‌టుడు తాజా చిత్రం `మారుతీ నగర్‌ సుబ్రమణ్యం`లో చూపించాడు. అత‌డు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ సీజ‌న్ లో చ‌క్క‌ని హాస్యంతో వినోదం పంచ‌డం ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కాన్నిచ్చింది. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ ఆద్యంతం క‌డుపుబ్బా న‌వ్వించింది. ట్రైల‌ర్ తోనే ఇంత ర‌చ్చ చేసాడు.. పూర్తి సినిమాలో ఇంకెంత హ్యూమ‌ర్ పండిస్తాడో చూడాల‌నే ఆస‌క్తి క‌లిగింది. ఇటీవ‌లి కాలంలో హాస్యం ప‌రంగా ఇంత‌గా ఇంప్రెస్ చేసిన మ‌రొక ట్రైల‌ర్ లేదు.

ధూమపానం విషయంలో భార్యతో సమస్యలు ఉన్న క్రేజీ ఫ్యామిలీ మ్యాన్‌గా రావు రమేష్‌ని చూపించారు. భార్య‌తో తంటాలు, మా నాన్న అల్లు అర‌వింద్ అని చెప్పుకుని తిరిగే కొడుకుతో స‌మ‌స్య‌లు ఏమిట‌న్న‌ది ఆద్యంతం వినోదాత్మ‌కంగా చూపారు. ఒకానొక ద‌శ‌లో అతను తన ఎస్‌.బి.ఐ ఖాతాలో భారీ మొత్తం న‌గ‌దు జ‌మ అవ్వ‌గానే అది తెలుసుకుని ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతాడు. పొగ‌రాయుడి జీవితంలో ఇదో భారీ ట్విస్ట్‌. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెర‌పైనే చూడాలి.

రావు రమేష్ త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ను ఎంచుకుని తండ్రి పాత్ర‌లోనే బోలెడంత గ‌మ్మ‌త్త‌యిన కామెడీ పండించాడు. అతని ట్రేడ్‌మార్క్ కామెడీ , డైలాగ్స్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. స‌న్నివేశానుసారం పుట్టుకొచ్చే కామెడీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. పూర్తిగా వినోదభరితమైన కామెడీ-డ్రామా చిత్ర‌మిద‌ని అర్థ‌మ‌వుతోంది. హిలేరియ‌స్ కామెడీ అన్న ప‌దానికి స‌రైన అర్థం ఏమిటో ఈ ట్రైల‌ర్ ఆవిష్క‌రించింది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పిస్తున్నారు. పిబిఆర్ సినిమాస్ మరియు లోకమాత్రే క్రియేషన్స్ బ్యానర్‌పై బుజ్జి రాయుడు పెంట్యాల- మోహన్ కార్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 23న గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మారుతీ నగర్ సుబ్రమణ్యం లో పూర్తి-నిడివి ఉన్న ప్ర‌ధాన పాత్ర‌లో రావు ర‌మేష్ న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై ఇప్ప‌టికే ఆస‌క్తి నెల‌కొంది. ఈరోజు ట్రైలర్‌ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసి బ్లెస్ చేశారు.