Begin typing your search above and press return to search.

ప్రభాస్, చిరంజీవి కంటే ముందున్న రవితేజ!

బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఇండస్ట్రీని గాడిలో పెట్టారు. కరోనా తరువాత ఎక్కువ చిత్రాలను అందించిన స్టార్స్ లిస్టు పరిశీలిస్తే, రవితేజ అందరికంటే ముందున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:32 AM GMT
ప్రభాస్, చిరంజీవి కంటే ముందున్న రవితేజ!
X

కోవిడ్ తర్వాత కళ తప్పిపోయిన ఇండియన్ బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది టాలీవుడ్. పాండమిక్ టైంలో సినిమాలు తీయడానికి, వాటిని థియేటర్లలో రిలీజ్ చేయడానికి మిగతా ఇండస్ట్రీలు వెనకడుగు వేస్తుంటే.. తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం ఎప్పటికప్పుడు సినిమాలను విడుదల చేస్తూ, రెవెన్యూ జెనరేట్ అయ్యేలా చేసింది. మన హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ, బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఇండస్ట్రీని గాడిలో పెట్టారు. కరోనా తరువాత ఎక్కువ చిత్రాలను అందించిన స్టార్స్ లిస్టు పరిశీలిస్తే, రవితేజ అందరికంటే ముందున్నారు.

మాస్ మహారాజా రవితేజ గడిచిన మూడున్నర ఏళ్లలో ఏకంగా 8 సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేశారు. మరో రెండు వారాల్లో ఇంకో చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్రాక్, ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి చిత్రాల్లో నటించారు. వాల్తేరు వీరయ్య వంటి మల్టీస్టారర్ మూవీ కూడా చేశారు. ఆయన నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆగస్టు 15వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది కోవిడ్ తర్వాత రవితేజ నుంచి వచ్చే 9వ చిత్రం అవుతుంది.

పాన్ ఇండియా హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు చిత్రాలతో టాప్ లో నిలిచారు. రెండేళ్ల కాలంలో ఆయన్నించి రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ పార్ట్-1, కల్కి 2898 AD వంటి భారీ సినిమాలు వచ్చాయి. డిసెంబర్ లో రానున్న 'కన్నప్ప' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం పాండమిక్ తర్వాత నాలుగు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. తనయుడితో కలిసి ఆచార్య అంటూ వచ్చిన చిరు.. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో అలరించారు. వచ్చే సంక్రాంతికి 'విశ్వంభర' మూవీతో రాబోతున్నారు.

కింగ్ అక్కినేని నాగార్జున గడిచిన మూడేళ్లలో ఐదు సినిమాల్లో కనిపించారు. కొడుకతో కలిసి బంగార్రాజు మూవీ చేసిన నాగ్.. వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, నా సామిరంగా చిత్రాల్లో నటించారు. బ్రహ్మాస్త్రం పార్ట్-1లో స్పెషల్ రోల్ ప్లే చేశారు. వచ్చే ఏడాది 'కుబేర' తో ఆడియన్స్ ముందుకు వస్తారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కూడా తండ్రి మాదిరిగానే ఐదు సినిమాలు.. ఒక వెబ్ సిరీస్ తో అలరించారు. లవ్ స్టోరీ, బంగార్రాజు, థాంక్యూ, కస్టడీ చిత్రాల్లో నటించిన చై.. లాల్ సింగ్ చద్దా అనే హిందీ మూవీతో పాటుగా దూత అనే ఒరిజినల్ సిరీస్ లో కనిపించారు. ఈ డిసెంబరులో 'తండేల్' గా వస్తున్నారు.

కరోనా కారణంగా వి, టక్ జగదీశ్ సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని.. శ్యామ్ సింఘరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయి నాన్న వంటి చిత్రాల్లో నటించారు. హిట్-2లో గెస్ట్ రోల్ లో కనిపించారు. ఆగస్టు 29న 'సరిపోదా శనివారం' చిత్రంతో థియేటర్లలోకి రానున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి మూడు సినిమాలు చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ.. త్వరలో తన 109వ చిత్రంతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. పవన్ కల్యాణ్ నుంచి వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు వచ్చాయి.

లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇటీవల కల్కిలో అతిథి పాత్రలో మెరిశారు. రామ్ పోతినేని ఈ మూడేళ్లలో రెడ్, ది వారియర్, స్కంద చిత్రాలను విడుదల చేశారు. ఆగస్టు 15న 'డబుల్ ఇస్మార్ట్' తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట, గుంటూరు కారం చిత్రాల్లో నటించగా.. చరణ్ ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ సినిమాల్లో కనిపించారు. అల్లు అర్జున్ పుష్ప, జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రాలతో సందడి చేశారు.

ఈ విధంగా కరోనా తర్వాత మన హీరోలు నటించిన సినిమాల రిలీజుల జాబితా చూసుకుంటే, 9 చిత్రాలతో రవితేజ అందరి కంటే టాప్ లో ఉన్నారు. హిట్ ఫ్లాప్ లను పక్కన పెడితే, ఆయన మూవీస్ వల్ల థియేటర్లకు కావాల్సినంత ఫీడింగ్ దొరికింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ప్రాజెక్ట్స్ లో భాగమైన వారందరికీ పని లభించింది.