Begin typing your search above and press return to search.

విజయ్‌ - త్రిష కొడుకు ఫుల్‌ బిజీ... ఒకే నెలలో రెండు సినిమాలు

లియో సినిమాతో తమిళ్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న మాథ్యూ వరుసగా కోలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 3:00 AM GMT
విజయ్‌ - త్రిష కొడుకు ఫుల్‌ బిజీ... ఒకే నెలలో రెండు సినిమాలు
X

తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్‌ హీరోగా త్రిష హీరోయిన్‌గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'లియో' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లియో సినిమాలో విజయ్‌ - త్రిషల కొడుకుగా నటించిన మాథ్యూ థామస్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మలయాళ నటుడు అంతకు ముందు చాలా సినిమాలు చేసినా లియో తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లియో సినిమాతో తమిళ్‌తో పాటు అన్ని భాషల్లోనూ మాథ్యూ ఆకట్టుకున్నాడు. అందుకే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. లియో తర్వాత గేర్‌ మార్చిన మాథ్యూ ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేస్తూ వెళ్తున్నాడు.

లియో సినిమాతో తమిళ్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న మాథ్యూ వరుసగా కోలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతకు ముందు వరకు మలయాళ సినిమాలకే పరిమితం అయిన ఇతడు తమిళ్‌లో రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ధనుష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న నిలవుక్కు ఎన్మేల్‌ ఎన్నాడీ కోబంలో మాథ్యూ నటిస్తున్నాడు. ధనుష్ మేనల్లుడు ఆ సినిమాలో ఒక హీరోగా నటిస్తూ ఉండగా మరో హీరో పాత్రలో మాథ్యూ నటిస్తున్నాడు. ఫిబ్రవరి నెలలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది. లియోకి వచ్చిన స్టార్‌డంను ఈ సినిమా మరింతగా పెంచడం ఖాయంగా తెలుస్తోంది.

మరోవైపు మలయాళంలోనూ మాథ్యూ నటించిన సినిమాను ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఒకే నెలలో రెండు సినిమాలతో మాథ్యూ రాబోతున్నాడు. ఇంతకు ముందు ముఖ్య పాత్రలకి పరిమితం అయిన మాథ్యూ ఈ మధ్య కాలంలో అన్నీ హీరోగానే నటిస్తున్నాడు. సోషల్‌ మీడియాలోనూ ఇతడి క్రేజ్ అమాంతం పెరిగింది. చిన్న సినిమాల దర్శకులు, టీనేజ్‌ కథలతో మాథ్యూ వెంట పడుతున్నారని మలయాళ మీడియా సంస్థ ఒకటి ఇటీవల తన కథనంలో పేర్కొంది.

లియో సినిమాతో వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుని వరుసగా సినిమాలు చేస్తున్న ఈ యువ హీరో ముందు ముందు తెలుగులోనూ ప్రేక్షకలు ముందుకు వస్తాడేమో చూడాలి. మలయాళం, తమిళ్ భాషల్లో ఆకట్టుకున్న పలువురు హీరోలు తెలుగులోనూ మెప్పించారు. కనుక తెలుగులో ఒక్క హిట్‌ పడితే ఇతడు టాలీవుడ్‌లోనూ బిజీ హీరోగా, క్రేజీ హీరోగా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మాథ్యూ నుంచి అయిదు లేదా ఆరు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో రెండు మూడు హిట్ అయినా అతడి జోరు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.