Begin typing your search above and press return to search.

మత్తు వదలరా-2కు వెళ్తున్నారా? పార్ట్-1 కథ గుర్తుందా?

రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కమెడియన్ సత్య మరో లీడ్ రోల్ పోషించారు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 1:10 PM GMT
మత్తు వదలరా-2కు వెళ్తున్నారా? పార్ట్-1 కథ గుర్తుందా?
X

మత్తు వదలరా.. టాలీవుడ్ లో ఐదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సంచలన విజయం సాధించిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి రెండో కొడుకు శ్రీసింహాకు డెబ్యూతోనే మంచి హిట్ దక్కేలా చేసింది. రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కమెడియన్ సత్య మరో లీడ్ రోల్ పోషించారు.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్.. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు(సెప్టెంబర్ 13) థియేటర్లలో సందడి చేయనుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు. మేకర్స్ కూడా అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించారు. టీజర్, ట్రైలర్ తో ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. డిఫరెంట్ వీడియోలతో సందడి చేశారు. వేరే లెవల్ లో మూవీపై హైప్ సృష్టించారు.

మూవీ టీమ్ అంతా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని అందరి దృష్టిని సినిమా వైపు తిప్పుకున్నారు. అయితే మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవ్వనుండగా.. మేకర్స్ మరో క్రేజీ వీడియోను పోస్ట్ చేశారు. మత్తు వదలరా-1 స్టోరీని అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. 2019లో విడుదల అయిన ఫస్ట్ పార్ట్ కథను మరోసారి ఆడియన్స్ కు చెప్పే బాధ్యతను శ్రీసింహా, సత్య తీసుకున్నారు. క్రైమ్ స్టోరీలా చెబుతూ సినీ ప్రియులను అలరించారు.

ఈరోజు మీరు తెలుసుకోబోయే కథ ఆషామాషీది కాదంటూ సత్య స్టోరీని స్టార్ట్ చేశారు. పాత వెయ్యి రూపాయలు చెల్లుతున్న రోజులు అవి.. భాగ్యనగరపు వీధుల్లో బాబు, ఏసు.. ఇంకా అభి రూమ్ మేట్స్ గా ఉంటారు. బాబు, ఏసు ఎన్ని డెలివరీలు చేసినా చివరకు మిగిలేది చిల్లరే. దీంతో ఉద్యోగం మానేస్తా అంటున్న బాబుకు డబ్బులు ఎలా సంపాదించాలో ఏసు చెబుతాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన కస్టమర్స్ నుంచి ఎలా తస్కరించాలో నేర్పిస్తాడు.

బాబు అలా ఓ ప్లాన్ తో డబ్బులు తస్కరిస్తుండగా ఒకసారి దొరికిపోతాడు. ఆ పార్సిల్ తీసుకున్న మహిళ చనిపోతుంది. చనిపోయిన బామ్మ మనవరాలు అదే ఫ్లాట్ లో ఉంటుంది. పై ఫ్లాట్ లో ఉన్న రవితేజ(వెన్నెల కిషోర్)తో చిల్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా మత్తులోకి జారుకున్న బాబు.. లేచి చూస్తే కానిస్టేబుల్ బెనర్జీ చనిపోయి కనిపిస్తాడు. తర్వాత జరిగిన మొత్తాన్ని ఏసు, అభికి చెబుతాడు. ఆ తర్వాత ఫుల్ ట్విస్టులు, వెన్నుపోటులు, దెబ్బలు అని ఇద్దరూ కలిసి తెలిపారు.

ఇక మిగతా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉందని, చూసుకోమని కామెడీగా సలహా ఇచ్చారు. అయితే అండర్ డాగ్స్ గా ఉన్న బాబు, ఏసు సూపర్ కాప్స్ గా ఎలా మారారు? ఉద్యోగం మారిన జీతం సరిపోతుందా? మళ్లీ ఎందులో ఇరుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలే మత్తు వదలరా-2 అని సత్య, శ్రీసింహ చెప్పారు. మరి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సీక్వెల్ ను చూసేందుకు రెడీనా మీరు?