Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మ్యాక్స్

By:  Tupaki Desk   |   27 Dec 2024 8:59 AM GMT
మూవీ రివ్యూ : మ్యాక్స్
X

'మ్యాక్స్' మూవీ రివ్యూ

నటీనటులు: కిచ్చా సుదీప్-వరలక్ష్మి శరత్ కుమార్-సంయుక్త కోర్నాడ్-సుకృత వాఘ్లే-సునీల్-ఇలవరసు-అనిరుధ్ భట్ తదితరులు

సంగీతం: అజనీష్ లోక్ నాథ్

ఛాయాగ్రహణం: శేఖర్ చంద్ర

నిర్మాతలు: కలైపులి ఎస్.థాను-కిచ్చా సుదీప్

రచన-దర్శకత్వం: విజయ్ కార్తికేయ

కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన కిచ్చా సుదీప్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగే ఉంది. తన కొత్త చిత్రం 'మ్యాక్స్' ఈ రోజే కన్నడతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైంది. మాస్ ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం.. సినిమాగా ఎంత మేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ మహాక్షయ్ (కిచ్చా సుదీప్) ఒక సిన్సియర్ పోలీసాఫీసర్. అతను ఏ ఒక్క చోటా ఎక్కువ కాలం డ్యూటీ చేయడు. నేరం చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టడు. తన విధులకు ఎంతటి వారు అడ్డు వచ్చినా ఎదిరిస్గాడు. అందుకే చాలా సార్లు బదిలీ అవుతాడు. ఒక కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన అతను.. సస్పెన్షన్ ముగించుకుని బెంగళూరు శివార్లలోని ఓ స్టేషన్ కు సీఐగా ఛార్జ్ తీసుకోవడానికి సిద్ధమవుతాడు. ఐతే రేపు ఉదయం విధుల్లోకి రావాల్సిన అర్జున్.. ముందు రోజు రాత్రి రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించి పోలీసుల మీద దాడి చేసిన ఇద్దరు మంత్రుల కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్లో పడేస్తాడు. కానీ ఆ ఇద్దరూ పోలీస్ స్టేషన్లో అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు వదులుతారు. వాళ్లెలా చనిపోయారన్నది మిస్టరీగా మారుతుంది. ఈ విషయం బయటికి పొక్కకుండా చూసుకోవడం.. ఈ వ్యవహారం నుంచి తనతో పాటు స్టేషన్లోని మిగతా పోలీసులను కాపాడుకోవడం.. మరోవైపు మంత్రుల కొడుకుల కోసం వస్తున్న గ్యాంగుల్ని కాచుకోవడం.. అర్జున్ కు పెద్ద సవాలుగా మారుతుంది. ఈ స్థితిలో అతనేం చేశాడు.. ఈ సవాళ్లను ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కన్నడ సినిమాలంటే రొడ్డకొట్టుడు అనే ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు. తెలుగు.. తమిళ చిత్రాలను రీమేక్ చేస్తూ.. వాటిని అనుకరిస్తూ సగటు మాస్ మసాలా సినిమాలే తీసేవాళ్లు అక్కడి దర్శకులు. కానీ గత కొన్నేళ్లలో కన్నడ సినిమాల తీరే మారిపోయింది. కేజీఎఫ్.. కాంతార లాంటి సినిమాలతో దేశం దృష్టిని ఆకర్షించిన కన్నడ పరిశ్రమ నుంచి ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. మాస్ సినిమాలనే కొంచెం డిఫరెంటుగా మలిచే ప్రయత్నం జరుగుతోంది. కిచ్చా సుదీప్ కొత్త చిత్రం 'మ్యాక్స్' కూడా ఈ కోవలోనిదే. ఇందులో హీరోయిజం ఉంది. ఎలివేషన్లు ఉన్నాయి. యాక్షన్ డోస్ కూడా తక్కువేమీ కాదు. కానీ అది రొటీన్ స్టయిల్లో మాత్రం ఉండదు. విషయం ఉన్న కథ నేపథ్యంలోనే అన్ని మసాలాలు ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు విజయ్ కార్తికేయ. లోకేష్ కనకరాజ్ కల్ట్ మూవీ 'ఖైదీ' స్ఫూర్తితో తెరకెక్కిన 'మాస్' కథ ప్రధానంగా రేసీగా సాగిపోతూనే మాస్ మూమెంట్స్ తో ఆ వర్గం ప్రేక్షకులనూ అలరించేలా సాగుతుంది. కొన్ని బలహీనతలు ఉన్నా సరే.. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని మాస్ మూవీ ఇది.

ఎంత కాదనుకున్నా 'మ్యాక్స్'లో 'ఖైదీ' సినిమా పోలికలు చాలానే కనిపిస్తాయి. ఇది దాని తరహాలోనే ఒక్క రాత్రిలో ముగిసిపోయే కథ. అక్కడా ఇక్కడా పోలీసులకు.. నేరస్థులకు మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ తరహా పోరు నేపథ్యంలో కథ నడుస్తుంది. పోలీసులు అనుకోని సమస్యలో చిక్కుకుని ఆ టాస్క్ నుంచి బయటపడడానికి చేసే పోరాటం నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఐతే దాని మాదిరే ఇది కూడా ఉత్కంఠ పెంచుతూ.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. కిచ్చా సుదీప్ పెద్ద మాస్ హీరో అయినప్పటికీ.. సగటు మాస్ సినిమాల్లో మాదిరి ఇంట్రోలు.. బిల్డప్పులు.. రొటీన్ ఎలివేషన్లు.. పాటలు.. ఫైట్లు అంటూ ఫార్ములా స్టయిల్లో సినిమాను నడిపించలేదు దర్శకుడు విజయ్ కార్తికేయ. హీరో పాత్రకు ఎలివేషన్ ఇచ్చినా.. అతను ఫైట్ చేసినా.. అది కథను అనుసరించే ఉంటుంది. కథను దాటి ఇందులో ఏమీ జరగలేదు. కాబట్టే మాస్ ప్రేక్షకులే కాక క్లాస్ ఆడియన్స్ కూడా ఈ పాత్రతో కనెక్ట్ అవుతారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగడం.. దాన్ని అనుసరించే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తరహాలో కథ ముందుకు సాగడం వల్ల ప్రేక్షకులు ఎక్కడా డీవియేట్ కారు. కథను మలుపు తిప్పే ఆ ఇన్సిడెంట్ సినిమా ఆరంభంలోనే వచ్చేయడంతో ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అవుతారు.

పోలీస్ స్టేషన్లోనే మంత్రుల కొడుకులు చనిపోవడం.. తన మీద దీన్ని కవర్ చేయడానికి హీరో వేసే ఎత్తుగడల నేపథ్యంలో స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. కథనం మరీ పరుగులు పెట్టకపోయినా.. ఆసక్తికర సీన్లతో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తూ 'మ్యాక్స్' ప్రథమార్ధం సాగుతుంది. ప్రథమార్ధమంతా డిపెన్స్ మోడ్లో ఉండే హీరో పాత్ర.. రెండో అర్ధంలో ఎటాక్ మోడ్లోకి రావడంతో అందుకు తగ్గట్లే కథనం కూడా ఊపందుకుంటుంది. కొన్ని యాక్షన్ ఘట్టాలు కూడా తోడై 'మ్యాక్స్' మాస్ ను అలరిస్తూ ముందుకు సాగుతుంది. ఐతే బలమైన విలన్ పాత్రలు లేకపోవడం 'మ్యాక్స్'కు మైనస్ అయింది. సునీల్.. వరలక్ష్మిల పాత్రలు అనుకున్నంత బలంగా లేకపోవడం వల్ల హీరోకు ఎదురే లేదన్నట్లుగా సాగిపోతుంది. దీనికి తోడు మంత్రుల కొడుకులు చేసిన అరాచకం గురించి ఏమీ చూపించకుండా చిన్న సన్నివేశంతో సరిపెట్టడం బాగా అనిపించదు. ముందే వాళ్లు చేసిన దారుణాన్ని చూపించి ఉంటే.. ఆ పాత్రలను ముగించడం సరైన పేఆఫ్ అయ్యుండేది. ఇలా కొన్ని లోపాలున్నప్పటికీ 'మ్యాక్స్' ఆద్యంతం ఎంగేజింగ్ గానే సాగుతుంది. మాస్-యాక్షన్ వినోదాన్ని అందిస్తూనే డిఫరెంట్ స్టయిల్లో నడిచే మ్యాక్స్.. 'ఖైదీ' తరహా సినిమాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. కానీ 'ఖైదీ' తరహాలోనే ఉండడం కొంత మైనస్.

నటీనటులు:

కిచ్చా సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది 'మ్యాక్స్'లో. టఫ్ పోలీసాఫీసర్ పాత్రకు అతను పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. పోలీస్ అన్న మాటే కానీ.. కథ రీత్యా సినిమాలో ఎక్కడా అతను ఖాకీ దుస్తుల్లో కనిపించడు. అయినా అతణ్ని పోలీస్ గానే ఫీలవుతాం. అంత బాగా ఆ పాత్రను పోషించాడు సుదీప్. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా హీరోయిజాన్ని పండించడంలో సుదీప్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ద్వితీయార్ధంలో తన పాత్ర బాగా ఎలివేట్ అయింది. కరప్ట్ పోలీస్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ఉనికిని చాటుకుంది. ఆమెకు సూటయ్యే పాత్రనే ఇచ్చాడు దర్శకుడు. సునీల్ విలన్లలో ఒకడిగా బాగానే చేశాడు. మరో తెలుగు నటుడు వంశీకి చెప్పుకోదగ్గ పాత్ర పడలేదు. పోలీస్ పాత్రల్లో సంయుక్త కోర్నాడ్.. ఇలవరసు ఓకే. కానీ పోలీస్ బృందంలోని వాళ్లలో కొందరు మరీ అతిగా నటించిన ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక వర్గం:

అజనీష్ లోక్ నాథ్ మరోసారి తన నేపథ్య సంగీతంతో మెప్పించాడు. కొన్ని చోట్ల మరీ లౌడ్ అనిపించినప్పటికీ.. సినిమాకు నప్పేలా.. కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఇచ్చేలా అతను బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. చివరి అరగంటలో స్పీకర్లు బద్దలయిపోయే రేంజిలో మాస్ ను ఉర్రూతలూగిస్తూ సాగుతుంది స్కోర్. రెండు బిట్ సాంగ్స్ మినహాయిస్తే ఇందులో చెప్పుకోదగ్గ పాటలేమీ లేవు. శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా రిచ్ గా తెరకెక్కింది. రైటర్ కమ్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ సగటు మాస్ సినిమాలకు భిన్నంగా వైవిద్యమైన కథనే ఎంచుకున్నాడు. దాన్ని మాస్ స్టయిల్లో నరేట్ చేయడానికి ప్రయత్నించాడు. అతను రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగానే సాగింది. కానీ 'ఖైదీ'తో పోలికలు అనివార్యంగా అనిపిస్తాయి. విలన్ల పాత్రలను మరింత బాగా తీర్చిదిద్దుకుని ఉంటే.. కొత్త సీన్లు రాసుకుని ఉంటే 'మ్యాక్స్' ఔట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.

చివరగా: మ్యాక్స్.. ఓ మోస్తరు మాస్

రేటింగ్- 2.5