Begin typing your search above and press return to search.

'మెకానిక్ రాకీ' రివ్యూ

ఈ ఏడాది ఇప్పటికే గామి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో పలకరించిన అతను.. ఇప్పుడు 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   22 Nov 2024 8:53 AM GMT
మెకానిక్ రాకీ రివ్యూ
X

'మెకానిక్ రాకీ' రివ్యూ

నటీనటులు: విశ్వక్సేన్-మీనాక్షి చౌదరి-శ్రద్ధా శ్రీనాథ్-సునీల్-నరేష్-హర్ష చెముడు-విశ్వదేవ్ రాచకొండ తదితరులు

సంగీతం: జేక్స్ బిజోయ్

ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి కాటసాని

నిర్మాత: రజని తాళ్ళూరి

రచన-దర్శకత్వం: రవితేజ ముళ్ళపూడి

తెలుగులో విరామం లేకుండా సినిమాలు చేస్తున్న యువ కథానాయకుడు.. విశ్వక్సేన్. ఈ ఏడాది ఇప్పటికే గామి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో పలకరించిన అతను.. ఇప్పుడు 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ ముళ్ళపూడి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్సేన్) చదువు సరిగా అబ్బక తన తాత.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కారు గ్యారేజీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు. ఐతే ఆ గ్యారేజ్ ఉన్న స్థలం మీద రంకిరెడ్డి (సునీల్) అనే గూండా కన్ను పడుతుంది. తన మనుషులను పంపించి గ్యారేజ్ ఖాళీ చేయించాలని చూస్తాడు కానీ.. రాకీ అడ్డు పడతాడు. అయినా రంకి రెడ్డి ప్రయత్నాలు ఆగవు. ఈలోపు రాకీ తండ్రి చనిపోతాడు. తండ్రి కోరిక మేరకు ఎలాగైనా గ్యారేజ్ కాపాడుకోవాలని రాకీ విశ్వ ప్రయత్నం చేస్తాడు. మరి తన ప్రయత్నం ఫలించిందా.. రంకిరెడ్డితో అతడి పోరాటం ఎక్కడి దాకా వెళ్లింది.. ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ప్రథమార్ధమంతా ఒక ఫ్లోలో మామూలుగా కథను నడిపించడం.. ఏదో ఒక చోట ట్విస్ట్ ఇచ్చి.. తూచ్ ఇప్పటిదాకా మీరు చూసిందంతా అబద్ధం.. అసలు కథ ఇది అంటూ ప్రేక్షకులను షాక్ కు గురి చేయడం.. అక్కడ్నుంచి ట్విస్టుల మీద ట్విస్టులిస్తూ ఎంగేజ్ చేయడం.. 'పోకిరి' తర్వాత ఈ ఫార్ములా చాలా కామన్ అయిపోయింది. యువ కథానాయకుడు విశ్వక్సేన్ సైతం ఆల్రెడీ ఇదే ఫార్ములాతో 'ధమ్కీ' సినిమా చేశాడు. అందులో ధమ్కీలు మరీ ఎక్కువపోయి తేడా కొట్టేసింది. కానీ అతను మళ్లీ అదే స్టయిల్లో ఇంకో సినిమా చేశాడు. అదే.. మెకానిక్ రాకీ. సగం వరకు చాలా రొటీన్ గా సాగిపోతూ.. సగటు మసలా సినిమాలా కనిపించే 'మెకానిక్ రాకీ' రెండో అర్ధంలో కొత్త టర్న్ తీసుకుని ప్రేక్షకులను కొంతమేర ఎంగేజ్ చేస్తుంది. విశ్వక్సేన్ ఎప్పట్లాగే ఎనర్జిటిక్ పెర్ఫామెన్సుతో సినిమాను నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఇద్దరు అందమైన హీరోయిన్లు.. వారి పాత్రల చిత్రణ.. మ్యూజిక్ కొంతమేర ప్లస్ అయి 'మెకానిక్ రాకీ' ఓ మోస్తరు సినిమాలా అనిపిస్తుంది.

'మెకానిక్ రాకీ' ప్రథమార్ధం చూాశాక.. మొత్తం సినిమా చూడాలన్న ఆశే కలగదు. మధ్యలోనే లేచి వెళ్లిపోదాం అనేంతగా రొటీన్ టెంప్లేట్ వినోదంతో విసుగెత్తిస్తుంది ఫస్టాఫ్. కొత్త దర్శకుడు కాస్తయినా కొత్తదనం లేకుండా చాలా మామూలుగా నడిపించేశాడు ఈ కథను. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి అన్నీ ఒక టెంప్లేట్ ప్రకారం సాగిపోతుంటాయి. రెండో కథానాయికకు హీరో తన స్టోరీ చెప్పడంతో మొదలయ్యే ఈ కథలో చాలాసేపు ఏ విశేషాలూ కనిపించవు. సీమ ఫ్యాక్షనిస్టుగా పాత గెటప్పులో విశ్వక్ చేసే హంగామా కొంత నవ్విస్తుంది తప్ప.. వర్తమానంలో మాత్రం అంతా రొటీన్ గా సాగిపోతుంది. హీరో కాలేజీ వ్యవహారం.. కథానాయికతో ప్రేమ.. చదువు సరిగా సాగక గ్యారేజ్ చేతికి తీసుకోవడం.. ఇలా మామూలుగా నడిచిపోతుంది కథ. విలన్ ఎంట్రీతో అయినా ఏమైనా కథలో ఊపు వస్తుందేమో అనుకుంటే అదీ జరగదు. హీరో స్థలం మీద విలన్ కన్నేయడం.. వాళ్లను అతను గొడవ పడడం.. ఇలా ఈ ట్రాక్ సైతం రొటీనే. మధ్య మధ్యలో రొటీన్ పాటలు.. ఫైట్లతో 'మెకానిక్ రాకీ' చిన్న హై కూడా లేకుండా సాగిపోతుంటుంది. అసలేముందని ఈ కథను విశ్వక్ ఓకే చేశాడు అనే సందేహాలు కలిగిస్తుంది.

ఐతే రొటీన్ ఫ్లోతో సాగిపోతున్న కథలో పాత్రల పరంగా ట్విస్టులు బయటికి వచ్చాక 'మెకానిక్ రాకీ' ఎంగేజ్ చేయడం మొదలుపెడుతుంది. మరీ షాకైపోయే రేంజి ట్విస్టులు కాకపోయినా.. ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టడానికి అవి సరిపోయాయి. కథ పరంగా విశ్వక్సేన్ 'ధమ్కీ'ని గుర్తుకు తెచ్చినా.. ఇందులో ఎమోషన్ తో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ముందు మామూలుగా అనిపించిన పాత్రలు ట్విస్టు తర్వాత క్రేజీగా మారుతాయి. ఆ పాత్రలే సినిమాను డ్రైవ్ చేస్తాయి. సైబర్ నేరాల నేపథ్యంలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కథాకథనాలు నడవడంతో ద్వితీయార్ధమంతా మంచి ఫ్లోతో నడుస్తుంది. క్లైమాక్స్ ఇంకొంచెం భిన్నంగా.. క్రేజీగా తీర్చిదిద్దుకుని ఉంటే ప్రథమార్ధంలోని తప్పులన్నీ మాఫీ అయిపోయేవి. కానీ ముగింపు సన్నివేశాలు ఒకింత నిరాశ పరుస్తాయి. 'మెకానిక్ రాకీ'ని సూపర్ అనలేం. అలా అని తీసిపడేయనూ లేం. హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్ల పాత్రలకూ ప్రాధాన్యం ఉండడం.. వాళ్లు అందం అభినయంతో ఆకట్టుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ ముగ్గురి కోసం.. కథలోని ట్విస్టులు.. సెకండాఫ్ లో ఎంగేజింగ్ గా సాగే కథనం కోసం 'మెకానిక్ రాకీ'పై ఓ లుక్కేయొచ్చు. కానీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే మాత్రం కష్టం.

నటీనటులు:

ఎలాంటి కథలో అయినా ఎనర్జిటిక్ పెర్ఫామెన్సుతో తన వరకు ఎంగేజ్ చేస్తాడని విశ్వక్ పేరు తెచ్చుకున్నాడు. 'మెకానిక్ రాకీ'లో కూడా అదే చేశాడు. చాలా రొటీన్ గా సాగిపోయే ప్రథమార్ధంలో కూడా విశ్వక్ పెర్ఫామెన్సే ప్రేక్షకులను కొంత ఎంగేజ్ చేస్తుంది. ఇక కథ పరంగా బలం.. వైవిధ్యం ఉన్న ద్వితీయార్ధంలో అతను మరింత మెప్పించాడు. మోసపోతున్న వాడిలా అమాయకంగా కనిపించినపుడు.. ఇదంతా డ్రామా అని తెలియజేస్తూ తన పాత్రలో మరో కోణంలో చూపించేటపుడు తనలోని పెర్ఫామర్ కనిపిస్తాడు. హీరోయిన్లు ఇద్దరికీ సినిమాలో మంచి పాత్రలు పడ్డాయి. మధ్య తరగతి అమ్మాయిగా 'లక్కీ భాస్కర్' తర్వాత మీనాక్షి చౌదరి మరోసారి మెప్పించింది. ట్రెడిషనల్ లుక్స్ లోనే తన అందంతో ఆకట్టుకున్న మీనాక్షి.. కథలో కీలకమైన సన్నివేశాల్లో చక్కగా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర.. తన నటన ఆశ్చర్యపరుస్తాయి. తన పాత్రలో విశేషం ఏంటన్నది తెర మీదే చూడాలి. రంకిరెడ్డిగా విలన్ పాత్రలో సునీల్ రొటీన్ అనిపిస్తాడు. హర్ష చెబుడు హీరో ఫ్రెండు పాత్రలో కొంత నవ్వించాడు. హీరో తండ్రిగా నరేష్ అలవాటైన పాత్రలో ఆకట్టుకున్నాడు. హర్షవర్ధన్.. మిగతా ఆర్టిస్టులు ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'మెకానిక్ రాకీ' ఓకే అనిపిస్తుంది. జేక్స్ బిజోయ్ పాటలు బాగానే సాగాయి. మంగ్లీ పాడిన పాట వినసొంపుగా ఉంది. దాని చిత్రీకరణ కూడా బాగుంది. మిగతా పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. జేక్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా నడతకు తగ్గట్లుగా సాగింది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ రెడ్డి తన విజువల్స్ తో మెప్పించాడు. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి పనితనం 50-50గా అనిపిస్తుంది. అతను తన కథలో భారమంతా ట్విస్టుల మీదే పెట్టేశాడు. వాటి మీద ద్వితీయార్ధంలో కథనాన్ని నడిపించిన తీరు బాగానే ఉంది కానీ.. ప్రథమార్ధాన్ని మరీ అంత రొటీన్ టెంప్లేట్లో నడిపించడమే నిరాశ పరుస్తుంది. నరేషన్లో ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే వైవిధ్యాన్ని అతను చూపించలేకపోయాడు. ఐతే ప్రథమార్ధంలో జరిగిన తప్పులను రెండో అర్ధంలో ఓ మోస్తరుగా అతను కవర్ చేశాడు.

చివరగా: మెకానిక్ రాకీ.. రొటీన్ కథకు ట్విస్టులతో రిపేర్లు

రేటింగ్-2.5/5