ట్రైలర్: ముగ్గురు జర్నలిస్టు 'మేధావులు' ప్లాన్ చేసిన బ్యాంక్ దోపిడీ!
తాజాగా ఈ చిన్న సినిమా ట్రైలర్ ను టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఒక నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్, కంటెంట్ ఏంటనేది పెద్దగా రివీల్ చేయకపోయినా
By: Tupaki Desk | 22 Feb 2024 9:15 AM GMTఇటీవల కాలంలో ఒకే ఒక్క పోస్టర్ ద్వారా ప్రేక్షకులని ఆకర్షించిన షార్ట్ ఫిల్మ్ 'మేధావులు'. వివేక్ బొరుసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణికాంత్ దునక, మిమిక్రీ జితేంద్ర, సూరజ్ పాల్ క్రిస్టోఫర్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిన్న సినిమా ట్రైలర్ ను టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఒక నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్, కంటెంట్ ఏంటనేది పెద్దగా రివీల్ చేయకపోయినా.. ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని కలిగిస్తుంది.
'మేధావులు' ట్రైలర్ లో ముగ్గురు జర్నలిస్టుల జీవితాలను, వారు పడుతున్న కష్టాలను వివరించారు. కారులో ప్రయాణిస్తున్న సీన్స్ తోనే ఈ వీడియోని కట్ చేశారు. 'నేను మంచి జర్నలిస్ట్ అవుదామని జాయిన్ అయ్యాను సార్' అని ఒకతను అనగా.. "తిండికి తికానా లేదు కానీ, ఉంచుకున్న దానికి ఉల్లిపాయ పకోడీ కావాలన్నాడంట నీలాంటి వాడే'' అని పక్కన ఉన్న ఇద్దరూ గట్టిగా నవ్వుతారు.
'ఆఫీస్ లో కారు ఇవ్వడం అటుంచి, రెస్పెక్ట్ కూడా ఇవ్వరని' ఆవేదన చెందుతున్న ముగ్గురు జర్నలిస్టులు.. ఒక బ్యాంకును దోచుకోవాలని ప్లాన్ చేస్తారు. 'ఒక మేధావి రాబరీ చేస్తే ఎలా ఉంటుందో చెప్పమంటావా?' అంటూ మిమిక్రీ జితేంద్ర దోపిడీ ఎలా చేయాలనే ప్లాన్ ను మిగతా వారికి వివరించడాన్ని మనం చూడవచ్చు. 'ఎంత కొట్టేస్తాం అన్నా?' అని అడగ్గా.. 'ఒక్క రూపాయి కూడా కొట్టేయకుండా మనం బయటకి వచ్చేస్తాం' అని చెప్పడంతో వాళ్ళు షాక్ అవుతారు.
'రాబరీ చేస్తే ఇలా చేశాడా? అనుకోకూడదు.. ఇలా చేసాడ్రా బాబూ! అనుకోవాలి' అనడంతో తమని తాము మేధావులుగా ప్రోజెక్ట్ చేసుకోడానికి ఈ బ్యాంక్ దోపిడీ ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. అయితే సీసీ కెమెరాల ముందు దొరికిపోవడమే తమ గేమ్ అని చెప్పడాన్ని బట్టి చూస్తే వీళ్ళు అతి తెలివిగా ఏదో చేయబోతున్నారని అర్థమవుతోంది. మరి వీళ్ళు నిజంగానే స్మార్ట్ మేధావులా? లేక తింగరోళ్ళా? అనేది తెలియాలంటే ''మేధావులు'' షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే.
ఓవరాల్ గా 'మేధావులు' ట్రైలర్ ఫన్నీగా ఉంటూనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 'తెలివైన వాళ్ళకి అతి తెలివైన వాళ్ళకి మధ్యలో ఉన్నోళ్లే మేధావులు' అనే లైన్ తో ఈ క్రైమ్-డ్రామెడీ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారని తెలుస్తోంది. శ్రీ వెంకట్ దీనికి సంగీతం సమకూర్చగా.. అన్వేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శశాంక్ మాలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఖేల్‌పీడియా యూట్యూబ్ ఛానెల్‌లో రేపు(ఫిబ్రవరి 23) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం విడుదల కానుంది. మరి లఘు చిత్రానికి ఎలాంటి ప్రేక్షకాదరణ లభిస్తుందో చూడాలి.