Begin typing your search above and press return to search.

మీడియం రేంజ్ హీరోల విష‌యంలోనూ నిర్మాత‌లు త‌గ్గేదేలే!

ఒక‌వేళ సినిమా ప్లాప్ అయి న‌ష్టాలు వ‌స్తే గ‌నుక అదే హీరో త‌న పారితోషికంలో కొంత మిన హాయింపు ఇస్తాడనో..పూర్తిగా వ‌దులుకుంటాడ‌నే భ‌రోసా కూడా నిర్మాత‌కు ఉండేది.

By:  Tupaki Desk   |   8 March 2025 6:00 AM IST
మీడియం రేంజ్ హీరోల విష‌యంలోనూ నిర్మాత‌లు త‌గ్గేదేలే!
X

ఒక‌ప్పుడు స్టార్ హీరో కోస‌మే నిర్మాత రిస్క్ తీసుకుని 100 కోట్లు ఖ‌ర్చు చేసేవారు. ప‌క్కాగా బిజినెస్ అవుతుం ద‌నే న‌మ్మకంతోనే అంత భారీ మొత్తంలోపెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందుకొచ్చేవారు. ఇక్క‌డ మ‌రో సినారే కూడా ఉంది. ఒక‌వేళ సినిమా ప్లాప్ అయి న‌ష్టాలు వ‌స్తే గ‌నుక అదే హీరో త‌న పారితోషికంలో కొంత మిన హాయింపు ఇస్తాడనో..పూర్తిగా వ‌దులుకుంటాడ‌నే భ‌రోసా కూడా నిర్మాత‌కు ఉండేది. దీంతో నిర్మాత మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుకొచ్చే వాడు.

అదే మీడియం రేంజ్ హీరోల‌పై అంత మొత్తం పెట్టాలంటే నిర్మాత చాలా విష‌యాలు ఆలోచించేవారు. 50 కోట్లు ఖ‌ర్చు చేయ‌డ‌మే ఎక్కువ‌గా భావించేవారు. దీంతో ద‌ర్శ‌కులు కూడా బ‌డ్జెట్ ఓవ‌ర్ ది బోర్డ్ దాట కుండానే పూర్తి చేయాల్సి వ‌చ్చేది. ఇలా కొంత రాజీతో కూడిన నిర్మాణం మీడియం రేంజ్ హీరోల విష‌యంలో జ‌రిగేది. అయితే ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలపై కూడా 100 కోట్లు పెట్ట‌డానికి నిర్మాత‌లు వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

వ‌స్తే కొండ పోతే పైసా అన్న లెక్క‌లో ధైర్యంగా నిర్మాణంలోకి దిగిపోతున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల `ది ప్యార‌డైజ్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ద‌స‌రా`తో నాని 100 కోట్ల క్ల‌బ్ లో చేరాడు. దీంతో ప్యారడైజ్ బ‌డ్జెట్ ఏకంగా 120 కోట్లుగా మారింది. అలాగే మెగా మేన‌ల్లుడు సాయితేజ్ హీరోగా రోహిత్ కె. పి `సంబ‌రాల ఏటిగ‌ట్టు` అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా బ‌డ్జెట్ కూడా 125 కోట్లు అంటున్నారు.

`విరూపాక్ష‌`తో సాయితేజ్ కూడా సెంచ‌రీ కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఇక అక్కినేని వార‌సుడు ఇటీవ‌లే `తండేల్` తో 100 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కార్తిక్ దండు తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బ‌డ్జెట్ కూడా సుమారు 100 కోట్లు అని స‌మాచారం. `తండేల్` రిలీజ్ కు ముందే ఫిక్స్ అయిన బ‌డ్జెట్ ఇది. అలాగే నిఖిల్ `స్వ‌యంభూ`, యంగ్ హీరో తేజ స‌జ్జా `మిరాయ్` చిత్రాల బ‌డ్జెట్ కూడా సెంచ‌రీకి స‌మీపంలోనే ఉంద‌ని అంటున్నారు.