Begin typing your search above and press return to search.

మీనాక్షి అరడజనులో ఒకే ఒక్కటి..!

అయితే వరుసగా ఆఫర్లు మాత్రం దక్కించుకుని దూసుకు పోతూనే ఉంది.

By:  Tupaki Desk   |   26 Nov 2024 5:09 AM GMT
మీనాక్షి అరడజనులో ఒకే ఒక్కటి..!
X

2021లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హర్యాన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి మొదట్లో నిరాశ పరచినా మెల్లమెల్లగా కెరీర్‌లో నిలదొక్కుకుంటూ వస్తోంది. ఈ ఏడాదిలో మీనాక్షి చౌదరి నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. గుంటూరు కారం సినిమా ఫెయిల్‌ కావడంతో పాటు, రెండో హీరోయిన్‌గా నటిండచం వల్ల ఆ సినిమా పెద్దగా ఈ అమ్మడికి గుర్తింపు, స్టార్‌డం తెచ్చి పెట్టలేక పోయింది. అయితే వరుసగా ఆఫర్లు మాత్రం దక్కించుకుని దూసుకు పోతూనే ఉంది.

ఈ ఏడాదిలో మొదటి సినిమా నిరాశ పరిచిన ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. రెండు నెలలకు ఒక సినిమా చొప్పున ఈమె ఈ ఏడాదిలో మొత్తంగా ఆరు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒకే ఏడాది ఆరు సినిమాలతో వచ్చిన హీరోయిన్స్ మరెవ్వరూ లేరు అనడంలో సందేహం లేదు. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి హిట్స్ విషయంలో మాత్రం తీవ్ర నిరాశను ఎదుర్కొంది. మొదటి సినిమా గుంటూరు కారం ఫ్లాప్ అయ్యింది, ఆ వెంటనే సింగపూర్‌ సెలూన్‌ సినిమాతో వచ్చింది. ఆ తమిళ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే నిలిచింది. ఆ తర్వాత మరో తమిళ్‌ మూవీ ది గోట్‌ లో నటించింది.

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటించిన ది గోట్‌ బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కించుకుంది. అయితే టాక్‌ విషయంలో మాత్రం నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద ది గోట్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా మీనాక్షి చౌదరికి మాత్రం అక్కడ స్టార్‌డం దక్కలేదు. కాస్త గ్యాప్ తర్వాత మీనాక్షి నుంచి వరుసగా మూడు సినిమాలు వచ్చాయి. అవే లక్కీ భాస్కర్‌, మట్కా, మెకానిక్‌ రాకీ. ఈ మూడు సినిమాల్లో లక్కీ భాస్కర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా సినిమా ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా పాన్ ఇండియా స్థాయిలో ఆడింది.

లక్కీ భాస్కర్‌ విజయంతో జోరు మీదున్న ఈ అమ్మడు మెగా హీరో వరుణ్ తేజ్‌ తో కలిసి నటించిన మట్కా సినిమాతో వచ్చింది. ఆ సినిమాలోనూ ఈ అమ్మడి నటన గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సినిమాలో ఆమె లుక్‌, నటనకు మంచి మార్కులు పడతాయని అంతా భావించారు. కానీ సినిమాకు నిరాశే మిగిలింది. దాంతో లక్కీ భాస్కర్‌ విజయం తాలూకు ఆనందం వెంటనే మిస్ అయింది. మట్కా సినిమా ఫెయిల్‌ కావడంతో మీనాక్షి చౌదరి ఒకింత ఆవేదన వ్యక్తం చెందింది. మట్కా తర్వాత చాలా తక్కువ గ్యాప్‌లోనే ఈ అమ్మడు విశ్వక్‌ సేన్‌తో కలిసి మెకానిక్ రాకీ సినిమాతో వచ్చింది. ఆ సినిమా సైతం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. లాంగ్‌ రన్‌లో వసూళ్లు ఎలా ఉంటాయి అనేది చూడాలి.

మొత్తానికి ఈ ఏడాది ఆరు సినిమాలతో మీనాక్షి వస్తే కమర్షియల్‌ బిగ్‌ హిట్‌ దక్కింది కేవలం లక్కీ భాస్కర్‌ సినిమాకు మాత్రమే. వచ్చే ఏడాది ఆరంభంలోనే సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా హిట్‌ ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఆ సినిమా హిట్‌ అయితే వచ్చే ఏడాదిలోనూ రెండు మూడు సినిమాలను ఈమె చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిల్లో ఏ సినిమాలు హిట్‌ అవుతాయో చూడాలి.