Begin typing your search above and press return to search.

'మెగా + అల్లు' బాండింగ్ కి ఇదే నిదర్శనం!

మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయని గత కొంతకాలంగా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   14 Dec 2024 7:30 AM GMT
మెగా + అల్లు బాండింగ్ కి ఇదే నిదర్శనం!
X

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ శనివారం ఉదయం చంచల్ గూడా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం యావత్ చిత్ర పరిశ్రమను షాక్ కు గురి చేసింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, శుక్రవారం రాత్రి మొత్తం ఆయన జైల్లోనే ఉండిపోవలసి వచ్చింది. బన్నీ బయిటకు రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఉదంతం మెగా ఫ్యామిలీని మళ్ళీ ఒక్కటి చేసినట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలున్నాయని గత కొంతకాలంగా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. అభిమానులైతే తమ సొంత ఇంట్లో గొడవలు అవుతున్నాయనే విధంగా ఫ్యాన్ వార్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దానికి తగ్గట్టుగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేచోట కలుసుకున్న సందర్భం కూడా లేకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. నాగబాబు నిగూఢ అర్థం వచ్చే ట్వీట్స్ సంగతి చెప్పనక్కరలేదు. ఇదిలానే కొనసాగుతుండగా.. 'పుష్ప 2' వేదికగా అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

'పుష్ప 2' విడుదల సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీకి బెస్ట్ విషెస్ అందజేశారు. మంచి సినిమాను ఆదరించాలంటూ నాగబాబు పరోక్షంగా పోస్ట్ పెట్టారు. సక్సెస్ మీట్ లో 'కల్యాణ్ బాబాయ్' అంటూ అల్లు అర్జున్ ప్రేమగా పిలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సాయి తేజ్ 'సంబరాల ఏటిగట్టు' ఈవెంట్ కు హాజరైన అల్లు అరవింద్.. మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచేలా స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు బన్నీ అరెస్ట్ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ బాండింగ్ ఎలాంటిదనేది మరోసారి తెలిసి వచ్చిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అల్లుడి అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేశారు. ఆ వెంటనే నాగబాబు నడవడానికి ఇబ్బంది పడుతూనే బన్నీ ఇంటికి చేరుకున్నారు. ఇదంతా మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం ఒక్కటే అనడానికి సంకేతం అని అభిమానులు ఆనంద పడుతున్నారు. తమ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా.. కష్ట సమయాల్లో అందరం కలిసిపోతామనే సందేశం ఇచ్చాయని అంటున్నారు. మిగతా మెగా హీరోలు కూడా ఈరోజు బన్నీని కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతంలో సినీ ఇండస్ట్రీ అంతా బాసటగా నిలిచింది. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు ఆయనకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దిల్ రాజు, మైత్రీ రవి శంకర్, సితార నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్కెఎన్, బన్నీ వాసు లాంటి సినీ ప్రముఖులు అరెస్టయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రానా దగ్గుబాటి లాంటి మరికొందరు బన్నీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సుకుమార్, నవీన్ యెర్నేని, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వంటి మరికొందరు ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిశారు. బన్నీని హత్తుకొని సుకుమార్ కన్నీళ్ళు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.