Begin typing your search above and press return to search.

చిరంజీవి కూతురిపై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ 'విశ్వంభర'.

By:  Tupaki Desk   |   14 Oct 2024 1:30 PM GMT
చిరంజీవి కూతురిపై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్!
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ 'విశ్వంభర'. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ మెగా మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను దసరా స్పెషల్ గా రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. యూట్యూబ్ లో వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ, అదే స్థాయిలో నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విఎఫ్‌ఎక్స్ క్వాలిటీ బాలేదని, కాస్ట్యూమ్ డిజైనింగ్ సరిగా లేదనే విమర్శలు వచ్చాయి.

చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచీ ఆయన పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'విశ్వంభర' చిత్రానికి కూడా మెగా డాటరే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసింది. టీజర్ చూసిన తర్వాత, ఆమె వర్క్ పట్ల మెగా అభిమానులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. స్టైలింగ్ అస్సలు బాగోలేదని, ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేయడం లేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

టీ-షర్ట్ పైన షర్ట్ వేసుకొని స్లీవ్స్ మడత పెట్టడం, మెడలో ఒక చైన్, దానికో లాకెట్.. సుస్మిత అక్కకి తెలిసిన స్టైలింగ్ ఇదేనని ఓ మెగా ఫ్యాన్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఖైదీ నెం.150, ఆచార్య, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల్లో మెగాస్టార్ ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పాడు. మరో అభిమాని గత నాలుగైదు సినిమాల్లో చిరంజీవి లుక్స్ ని పక్కపక్కన పెట్టి, "విశ్వంభర''తో కంపేర్ చేస్తూ మీమ్ పోస్ట్ చేశాడు.

సుష్మితకి కలర్ కాంబినేషన్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలియదు, రొటీన్ కలర్ ప్యాలేట్ పట్టుకొని అవే షర్ట్ డిజైన్ చేస్తోంది అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఒకప్పటి బాస్ స్టైల్ కి ఇప్పటి స్టైలింగ్ అసలు మ్యాచ్ చెయ్యడం లేదని.. అభిమానులమైన మాకే చిరాకు దొబ్బుతుందని కామెంట్ పెట్టాడు. మెగాస్టార్ లుక్ ను మెరుగుపరచాల్సింది పోయి, ఆమె తన కాస్ట్యూమ్స్ స్టైలింగ్ తో ఇంకా తగ్గిస్తోందని ఫ్యాన్స్ వాపోతున్నారు.

సినిమా రిజల్ట్ ను పక్కన పెడితే, ప్రతీ దాంట్లో చిరంజీవిని అలానే చూడటం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. మెగాస్టార్ తన కూతురును రాబోయే ప్రాజెక్ట్స్ కు దూరంగా ఉంచాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కేవలం టీజర్ చూసి సినిమా అంతా బిగ్ బాస్ అలాంటి కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తారని అనుకోవడం కరెక్ట్ కాదని, సినిమాలో ఆయన లుక్స్ మెరుగ్గా ఉండొచ్చేమో అని మరికొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం సుస్మితకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇదిలా ఉంటే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారిన సుష్మిత కొణిదెల.. తన భర్తతో కలిసి సినిమాలు తీయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తన తండ్రితో ఓ సినిమా రూపొందించాలని ప్లాన్ చేసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది కానీ, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పనులు పక్కన పెట్టారని తెలుస్తోంది. 'విశ్వంభర' రిలీజైన తర్వాత చిరంజీవి తన కుమార్తె ప్రొడక్షన్ లో సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.