ఇంతకీ వీరిలో మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ఎవరితో..?
ఒకవేళ శ్రీకాంత్ 'పారడైజ్' సినిమా కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడితే, వీలైనంత ఫాస్ట్ గా సినిమాని పూర్తి చేసే అనిల్ తో వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్, బాబీలతో ప్యారలల్ గా పని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
By: Tupaki Desk | 19 Dec 2024 4:15 AM GMT'భోళా శంకర్' సినిమా డిజాస్టర్ గా మారడంతో మెగాస్టార్ చిరంజీవి ఆలోచనా విధానం పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసే సీనియర్ దర్శకులను పూర్తిగా పక్కన పెట్టి, సరికొత్త ఐడియాలతో వచ్చే నవతరం దర్శకులతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వశిష్ఠ డైరెక్షన్ లో 'విశ్వంభర' మూవీ చేస్తున్న చిరు.. మరికొంతమంది డైరెక్టర్లను లైన్‌లో పెట్టారు. ఈ క్రమంలో బాబీతో ఓ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "వాల్తేరు వీరయ్య". 2023 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి విజయాన్ని అందించిన బాబీతో చిరు మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు ఓ స్టోరీ రెడీ చేసుకున్నారని, లైన్ గా చెబితే చిరంజీవి సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నారు. ఇదే నిజమైతే ఈ కాంబో వెంటనే సెట్స్ మీదకు వెళ్ళడం కష్టమేనని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఇటీవలే ఓ సినిమాని అధికారికంగా ప్రకటించారు. హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నానితో శ్రీకాంత్ చేస్తున్న 'పారడైజ్' సినిమా పూర్తయిన వెంటనే, మెగా మాస్ ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయి. దీంతో పాటుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అనిల్ డైరెక్ట్ చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజైన తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టనున్నారు.
మరోవైపు బాబీ ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కూడా సంక్రాంతికే విడుదల కానుంది. బాబీ దీని తర్వాత చిరంజీవి సినిమా స్క్రిప్టు మీద వర్క్ చేస్తాడని టాక్ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి సినిమాల్లో చిరు ఏది ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు బాబీ కూడా లైన్ లో ఉన్నాడని అంటున్నారు. ఒకవేళ శ్రీకాంత్ 'పారడైజ్' సినిమా కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడితే, వీలైనంత ఫాస్ట్ గా సినిమాని పూర్తి చేసే అనిల్ తో వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్, బాబీలతో ప్యారలల్ గా పని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే 'విశ్వంభర' సినిమా ఫలితాన్ని బట్టి కూడా చిరంజీవి ప్రాధాన్యతా క్రమం మారినా మారొచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా మెగాస్టార్ ఇలా వరుసగా సినిమాలు చేస్తారని తెలియడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఏది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లినా, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయితే అదే చాలని అభిప్రాయ పడుతున్నారు. ఔట్ డేటెడ్ డైరెక్టర్స్ తో కాకుండా యంగ్ డైరక్టర్స్ తో చిరు చేతులు కలపడం సంతోషించదగ్గ విషయమని అంటున్నారు.