మెగా హీరోలు.. అవార్డుల్లో వీళ్లకు వీళ్లే పోటీ?
మెగా ఫ్యామిలీకి 2023 అత్యంత కలిసొచ్చిన సంవత్సరం. గడిచిన ఏడాదిలో మెగా కుటుంబం ఎన్నో శుభవార్తలను అభిమానులకు చేరవేసింది.
By: Tupaki Desk | 26 Jan 2024 7:42 AM GMTమెగా ఫ్యామిలీకి 2023 అత్యంత కలిసొచ్చిన సంవత్సరం. గడిచిన ఏడాదిలో మెగా కుటుంబం ఎన్నో శుభవార్తలను అభిమానులకు చేరవేసింది. వీటిలో చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ దక్కడం ఒకటి అనుకుంటే, అదే ఏడాదిలో `పుష్ప`లో అల్లు అర్జున్ నటనకుగాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ దక్కడం ఒక చరిత్ర. వందేళ్లు పైబడిన భారతీయ సినిమా చరిత్రలో, 90ఏళ్లు పైబడిన తెలుగు సినీ హిస్టరీలో ఇవి రెండూ చాలా కొత్త విషయాలు.
ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు గీతం ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో అద్భుతంగా నర్తించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు గొప్ప గుర్తింపు లభించింది. ఇక పుష్పరాజ్ గా బన్ని అసమాన నట ప్రతిభను గుర్తించిన కేంద్రం జాతీయ ఉత్తమ నటుడిగా ప్రకటించడం మరో సెన్సేషన్.
ఈ రెండు గొప్ప పురస్కారాల తర్వాత ఇప్పుడు మెగా కుటుంబంలోకి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి చేరింది. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్రం గౌరవించిందన్న ప్రకటనతో 2024 కూడా మెగా కుటుంబానికి ప్రత్యేకంగా మారింది. 2016 లో పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న చిరు ఎనిమిదేళ్లకు పద్మవిభూషణుడు అయ్యారు. ఇది నిజంగా రేర్ ఫీట్. ఈ గొప్ప గౌరవం కేవలం తాము ఎంచుకున్న రంగంలో రాణించడమే గాక, సమాజం పట్ల గొప్ప నిబద్ధత, సేవాగుణం ప్రదర్శించే ఉత్తమ వ్యక్తులకు మాత్రమే ఈ పురస్కారం దక్కుతుంది. వరుసగా మెగా హీరోలు అత్యున్నత పురస్కారాలను అందుకుంటూ వీళ్లలో వీళ్లే పోటీపడడం చర్చనీయాంశంగా మారింది.