మెత్త మెత్తగా మెగాస్టార్... ఇంట్లోనేనా ?
తన ఇంట్లో రాజకీయం ఉంది కానీ ఒంట్లో లేదని మెగాస్టార్ చిరంజీవి చాలా సార్లు ప్రకటించారు. ఇంట్లో అంటే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ.
By: Tupaki Desk | 16 March 2025 8:30 AM ISTతన ఇంట్లో రాజకీయం ఉంది కానీ ఒంట్లో లేదని మెగాస్టార్ చిరంజీవి చాలా సార్లు ప్రకటించారు. ఇంట్లో అంటే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఇక ఆ పార్టీ పొత్తులతో గెలిచి పవన్ ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఇపుడు మరో సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. తొందరలో మంత్రి కాబోతున్నారు.
అలా ఒకనాటి కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ ఇంట్లో ఇపుడు మంత్రులు ఇద్దరు అవుతారా అన్నది చర్చకు వస్తున్న విషయం. తన తమ్ముళ్ళు ఇలా రాజకీయంగా వెలిగిపోతూంటే మెగాస్టార్ హృదయం ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఆయన తట్టుకోలేక ట్వీట్లు వేస్తున్నారు. నిన్నటికి నిన్న ఆయన వేసిన ట్వీట్లు తమ్ముళ్ళు ఇద్దరికీ ఆశీర్వాదాలుగా మారాయి.
పెద్ద తమ్ముడు నాగబాబు ఎమ్మెల్సీగా నెగ్గడంతో ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు మెగాస్టార్. నాగబాబు మరింతగా రాణించాలని ఆశించారు ఇక పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో అదరగొట్టేసారు అని తాను అక్కడికి హాజరైన అశేష జన సంద్రం మాదిరిగానే మనసులో ఉప్పొంగిపోతున్నాను అని మనసు మొత్తం పరచేశారు.
దీనికంటే ముందు ఒక సినీ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం రూపాంతరమే జనసేన అన్నారు. జై జనసేన అని కూడా అన్నారు. ఇపుడు జనానికి నాయకుడు వచ్చారు అన్న నమ్మకం కుదిరింది అంటున్నారు. ఇలా ఆయన రాజకీయంగా చేస్తున్న వ్యాఖ్యల మీద సరికొత్త చర్చ సాగుతోంది.
అసలు మెగా బ్రదర్స్ లో సీఎం కావాలని మెగాభిమానులు అంతా తపించింది చిరంజీవి విషయంలోనే. ఆయనే తొలుత పార్టీ పెట్టారు. బాగానే ఓట్లూ సీట్లూ రాబట్టారు కానీ ఆ పార్టీని కొనసాగించలేకపోయారు. అందువల్ల మెగాస్టార్ రాజకీయంగా ముందుకు అడుగులు వేయలేకపయారు.
ఇక చూస్తే కనుక పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేసి తనదైన వ్యూహాలతో కదులుతున్నారు. బలం తక్కువగా ఉందని గ్రహించి పొత్తులతో ఎత్తులతో తన రాజకీయాన్ని పరుగులు తీయిస్తూ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. ఆయనకు ఉన్న విశేష జనాదరణ వల్ల ఏమైనా రాజకీయ అద్భుతాలు చేస్తారని మెగాభిమానులు ఆశపడుతున్నారు.
ఇక మెగాస్టార్ కూడా తమ్ముడి రాజకీయ ఎదుగుదల చూసి మనసు ఉండబట్టలేక చెప్పాల్సింది బయటకు చెప్పేస్తున్నారు. ఆయన జై జనసేన అనకుండా ఉండలేకపోతున్నారు. అయితే మెగాస్టార్ ఈ రాజకీయం ఉత్సాహం మెత్తమెత్తగా మొదాలి ఎక్కడికి చేరుతుందో ఎంత పదును తేరుతుందో అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇక పోతే అన్ని పార్టీలతోనూ సాన్నిహిత్యం నెరిపే మెగాస్టార్ జనసేన మనిషిగా ముద్ర పడడం మంచిదా కాదా అన్నది కూడా చూడాలని అంటున్నారు. రాజకీయాలను ఆయన వదిలేశాను అంటున్నారు. కానీ వ్యాఖ్యలు మాత్రం చేస్తున్నారు. ఇది మిగిలిన పార్టీలకు ఏ మేరకు సహించేలా ఉంటాయో అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. ఇంట్లో పాలిటిక్స్ ఉంది. మెగాస్టార్ వంట్లో పాలిటిక్స్ ఉందా అంటే ఏమో ఎవరు చెప్పగలరు అన్నదే వినవస్తున్న జవాబు. చూడాలి మరి మెగా భవితవ్యం ఎలా ఉందో కాలమే చెబుతుంది అని అంటున్నారు.