Begin typing your search above and press return to search.

క్షీణించిన స్నేహితుడి ఆరోగ్యం.. చిరు ఏం చేసారంటే?

ఆప‌త్కాలంలో మ‌నిషికి మ‌నిషి సాయం చేయ‌డానికి మ‌న‌సుండాలి.

By:  Tupaki Desk   |   23 Oct 2023 4:39 AM GMT
క్షీణించిన స్నేహితుడి ఆరోగ్యం.. చిరు ఏం చేసారంటే?
X

ఆప‌త్కాలంలో మ‌నిషికి మ‌నిషి సాయం చేయ‌డానికి మ‌న‌సుండాలి. కుటుంబ స‌భ్యుల‌తో పాటు స్నేహితులు, శ్రేయోభిలాషులు, సొంత‌ ఊరి వాళ్లు ఎవ‌రికైనా క‌ష్టాలు రావొచ్చు. అలాంటి సంద‌ర్భంలో సాటి మ‌నిషిగా స్పందించే తీరును బ‌ట్టే సంఘంలో గౌర‌వం ద‌క్కుతుంది. టాలీవుడ్ ప్ర‌ముఖులు ఒక‌రికి క‌ష్టం ఉంది అంటే ఆదుకోవ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ధాతృత్వం గురించి ఇప్పుడే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆయ‌న ద‌శాబ్ధాల పాటు సామాజిక జీవ‌నంలో ఎంద‌రికో ఎన్నో ర‌కాలుగా సాయం అందించారు. తన అభిమానులకే కాకుండా తన తోటి కళాకారులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులు, స్నేహితులకు కూడా సాయం చేసారు.

క‌రోనా క్రైసిస్ కాలంలో ఎంద‌రికో ఆయ‌న ప్రాణ‌దానం చేసారు. జీవితాల‌ను నిల‌బెట్టారు. సేవ చేయడంలో చిరంజీవి తిరుగులేని నిబద్ధత ఎంద‌రికో స్ఫూర్తి. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ఐ బ్యాంక్ సేవ‌లు ఎంద‌రికో దార్శ‌నీకం. ఇప్పుడు త‌న‌ చిన్ననాటి స్నేహితుడికి క‌ష్టం వ‌చ్చింది. అత‌డి ఆరోగ్యం క్షీణించడం గురించి విన్న వెంటనే చిరు వెంటనే ఆసుపత్రికి వెళ్లి క‌లిసారు. ఆ కుటుంబానికి క‌ష్ట కాలంలో అండ‌గా నిలుస్తాన‌ని భ‌రోసానిచ్చారు. మొగల్తూరుకు చెందిన చిరు స్నేహితుడు పువ్వాడ రాజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజా ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్న వెంటనే అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రి నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకురావడానికి చిరంజీవి అస్స‌లు సమయం వృథా చేయలేదు. ఆసుపత్రిని సందర్శించిన సమయంలో చిరంజీవి తన అనారోగ్యంతో ఉన్న స్నేహితుడితో వ్యక్తిగతంగా గడిపారు. వైద్యుల‌తో మాట్లాడి బాగోగులు చూసుకోవ‌డంలో ఏ స‌హాయం కావాల‌న్నా త‌న‌ని అడ‌గ‌మ‌ని తెలిపారు.

ఇలాంటి అరుదైన దృశ్యానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్‌లు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. స్నేహితుల విష‌యంలోను చిరు ఇలా స్పందించ‌డం ఆయ‌న విలువ‌ల‌కు, నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం. స్నేహితుల్ని, సొంత వారి కోసం చిరు ఏం చేయ‌డానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటార‌న‌డానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్ర‌మే.